అనంతపురం సిటీ: కరోనా సాకుతో మూడేళ్ల క్రితం రద్దు చేసిన ప్యాసింజర్ రైళ్లలో ‘అనంతపురం–విజయవాడ’ ఒకటి. అయితే, కోవిడ్ మహమ్మారి ఉధృతి తగ్గినా నేటికీ ఈ రైలును పునఃప్రారంభించలేదు. దీంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. రెండేళ్ల తరువాత దశల వారీగా రైళ్లను పునఃప్రారంభిస్తున్నా.. ఈ ప్యాసింజర్ రైలు విషయంలో రైల్వే శాఖ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పేద,మధ్య తరగతికి పెద్దదిక్కు
విజయవాడకు వెళ్లే (ట్రైన్ నంబర్:56503/04) ఈ ప్యాసింజర్ రోజూ ఉదయం 7.20 గంటలకు బెంగళూరు (యశ్వంతపుర)లో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు అనంతపురం చేరేది. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు విజయవాడ చేరుకునేది. మొత్తం 13 బోగీలతో 700 మంది ప్యాసింజర్ల కెపాసిటీతో 75 స్టేషన్లలో ఆగుతూ ప్రయాణించి ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేది. రైలు ద్వారా రోజూ 2 వేల నుంచి 3 వేల మంది దాకా ప్రయాణికులు రాకపోకలు సాగించే వారు. వీరిలో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారే అధికం.
రాష్ట్ర విభజన తరువాత విజయవాడకు పెరిగిన రద్దీ
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉన్నత చదువులు గానీ, మెరుగైన వైద్యసేవల కోసం గానీ మరే ఇతర అవసరాల కోసమైనా ఈ ప్రాంత ప్రజలు హైదరాబాద్‌కు రాకపోకలు సాగించేవారు. అయితే రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్‌తో సత్సంబంధాలు తగ్గిపోయాయి. పిల్లల చదువులు, ఇతర పనులపై ఇప్పుడు ఎక్కువగా విజయవాడకు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఆర్టీసీతో పాటు ప్రైవేటు బస్సులు ఎక్కువగా విజయవాడకు తిరగడం మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు ప్యాసింజర్ రైళ్ల సంఖ్యను పెంచాల్సిందిపోయి, ఉన్న రైళ్లను రద్దు చేయడం ఏమిటో అంతుబట్టడం లేదు.
(చదవండి: కోర్టు ప్రాంగణంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం)
Comments
Please login to add a commentAdd a comment