నగర పంచాయతీలకు ఉపాధి హామీ
♦ కేంద్రానికి లేఖ రాయాలని
♦ అధికారులకు జూపల్లి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన నగర పంచాయతీల్లోనూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద ఉపాధి పనులను కల్పించాలని పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి విభాగాలకు సం బంధించిన కార్యక్రమాలపై శనివారం ఆయన సమీక్షించారు. గత నెలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 11 నగర పంచాయతీల్లో ఉపాధి హామీ పనులను నిలిపివేయడంతో కూలీలు ఇబ్బందు లు పడుతున్నారని జూపల్లి చెప్పారు.
రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులున్న కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలోనూ ఈ పథకం కింద 50 అదనపు పనిదినాలను కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ అంశాలను ఇటీవల నగరానికి వచ్చిన కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. దీనికి అధికారికంగా అనుమతి కోసం కేంద్రానికి వెంటనే లేఖ రాయాలని అధికారులను జూపల్లి ఆదేశించారు.
లక్ష్యాలను చేరకుంటే ఇంటికే...
కూలీలకు ఉపాధి పనులు కల్పించడంలో ఫీల్డ్ అసిస్టెంట్లకు లక్ష్యాలను నిర్దేశించాలని, ప్రతి గ్రామంలోనూ 200 శాతం పనులను సిద్ధంగా ఉంచాలని జూపల్లి సూచించారు. ప్రతి గ్రామంలోనూ జాబ్‌కార్డులు కలిగిన వారిలో కనీసం 50 శాతం మందికి పనులు కల్పించడాన్ని టార్గెట్‌గా నిర్దేశించాలని, లక్ష్యాలను చేరడంలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్ ఎస్పీసింగ్, డెరైక్టర్ అనితా రాంచంద్రన్, ఈఎన్సీ సత్యనారాయణరెడ్డి, డిప్యూ టీ కలెక్టర్ పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.
వేతనాలు వెంటనే చెల్లిస్తాం...
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అర్నెల్ల వేతన బకాయిలను వెంటనే చెల్లించే ఏర్పాటు చేస్తానని శనివారం తనను కలసిన ఎంపీటీసీల ఫోరం ప్రతినిధులకు జూపల్లి హామీ ఇచ్చారు. మంత్రిని కలసిన వారిలో తెలంగాణ ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బోళ్ల కరుణాకర్, ప్రధాన కార్యదర్శి మనోహర్‌రెడ్డి, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు తులా బాలయ్య, సునీత సంజీవ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.