నేరచరితులకు డ్రైవింగ్ లెసైన్సు జారీకాకుండా చూస్తాం
నగర పోలీస్ కమిషనర్ భీంసేన్ బస్సి
క్యాబ్ డ్రైవర్ అత్యాచార ఘటన నేపథ్యంలో నగరంలో ఇటువంటివి పునరావృతం కాకుండా చేసే దిశగా పోలీసు శాఖ, రవాణా విభాగం అడుగులు వేశాయి. ఇందులోభాగంగా లెసైన్సు జారీ సమయంలోఈ రెండు శాఖలు ప్రతి దరఖాస్తుదారుడి పూర్వచరిత్రను ఆరా తీయనున్నాయి. తద్వారా అటువంటివారికి చెక్ పెట్టనున్నాయి.
న్యూఢిల్లీ: నేరచరిత్ర కలిగినవారికి లెసైన్సు రాకుండా చూస్తామని నగర పోలీస్ కమిషనర్ భీంసేన్ బస్సి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు.ఇందుకోసం రవాణా శాఖతో కలిసి పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటుచేస్తామన్నారు. ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడిన శివకుమార్ యాదవ్ సమర్పించిన తనిఖీ పత్రం నకిలీదేనన్నారు. ఇటువంటి నకిలీ పత్రాలు సులువుగా లభిస్తుండడం అత్యంత ఆందోళన కలిగించే అంశమన్నారు. అందువల్లనే ఈ కేసు విషయంలో లోతయిన దర్యాప్తు చేస్తున్నామన్నారు. ‘ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. రవాణా శాఖ తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం.వారితో సత్సంబంధాలు ఉన్నాయి. అందువల్ల భవిష్యత్తులోఏ ఒక్క నేరస్తుడికీ డ్రైవింగ్ లెసైన్సు జారీ కాకుండా చేసే దిశగా పకడ్బందీ చర్యలు తీసుకోబోతున్నామన్నారు.
పాత్ర పరిమితమైనదే: డ్రైవింగ్ లెసైన్సుల జారీ విషయంలో పోలీసుల పాత్ర పరిమితమైనదేనని బస్సి పేర్కొన్నారు. తమ సిబ్బంది కేవలం తనిఖీ చేస్తారని, అయితే లెసైన్సులను జారీ చేసేది రవాణా విభాగమేనని అన్నారు. మోటార్ వాహనాల చట్టం ప్రకారమే ఈ నిబంధనలు రూపొందాయన్నారు. ఇక తమకు సంబంధించి అవసరమైనప్పుడు మాత్రమే తమ సిబ్బంది తనిఖీ చేస్తారన్నారు. నేరచరితుడికి డ్రైవింగ్ లెసైన్సు జారీ కాకుండా చేసేందుకు సంబంధించి కొన్ని వ్యవస్థలు ఉన్నాయన్నారు.
ఎఫ్ఐఆర్ నమోదు చేశాం: అత్యాచారానికి పాల్పడిన శివకుమార్ యాదవ్‌పై బురారి పోలీస్‌స్టేషన్‌లో తాము ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని బస్సీ చెప్పారు. యాదవ్‌తోపాటు నకిలీ కేరెక్టర్ సర్టిఫికెట్ పొందేందుకు సహాయపడిన ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్‌పై కూడా కేసు నమోదు చేశామన్నారు.