సివిక్ సెంటర్లో లేజర్ షో
న్యూఢిల్లీ: నగరం నడిబొడ్డున ఉన్న పురపాలక సంస్థల పరిపాలనా కేంద్రం సివిక్ సెంటర్లో స్వాతంత్య్ర దినోత్సవం రోజున మువ్వన్నెల రంగులతో లేజర్ షో ఏర్పాటు చేయనున్నారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు ఎదురుగా ఉన్న ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) తన ప్రధాన కార్యాలయంలో లేజర్ షోకు ఏర్పాట్లు చేసింది. ఇంకా ఆ రోజున వీధి ప్రదర్శనలు, ఇతర కార్యక్రమాలకు కూడా రూపకల్పన చేసింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా మొదటిసారిగా తాము లేజర్ షోను ఏర్పాటు చేస్తున్నామని ఎన్డీఎంసీ పౌర సంబంధాల అధికారి యోగేంద్ర సింగ్ మాన్ చెప్పారు. ఆ రోజు సాయంత్రం తమ ప్రధాన కార్యాలయం రంగుల హరివిల్లుగా మారిపోతుందన్నారు. ఈ కార్యక్రమాలకు సూత్రప్రాయంగా అనుమతి లభించిందని చెప్పారు.
చీకటి పడిన వెంటనే దాదాపు నాలుగు గంటల పాటు ఈ షో కొనసాగుతుందన్నారు. కరోల్‌బాగ్‌లోని అజ్మల్ ఖాన్ పార్కులో 12, 13 తేదీల్లో మేళా నిర్వహిస్తామని, ఇటీవల జాతీయ ప్రాదేశిక ప్రాంతంలో ప్రాచుర్యం పొందిన వీధి ప్రదర్శన ‘రహగిరి’ని సాయంత్రం 4.00 నుంచి 7.00 గంటల మధ్య ప్రదర్శిస్తామని మాన్ చెప్పారు. నిత్యం రద్దీగా ఉండే చాందినీ చౌక్ ప్రాంతంలో కొన్ని గంటల పాటు వాహనాలు కనిపించకపోవడం ప్రజలకు ఆసక్తిగా మారగలదని ఆయన పేర్కొన్నారు. దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ) కూడా 68వ స్వాతంత్య్ర దినోత్సవాలను ప్రత్యేకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఎస్డీఎంసీ ఇంటింటి పారిశుధ్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజలు పౌర స్పృహను ప్రదర్శించాలని కోరే లక్ష కరపత్రాలను ముద్రించామని వాటిని స్కూలు పిల్లలు పంచి పెడతారని ఎస్డీఎంసీ పీఆర్ఓ ముఖేశ్ యాదవ్ చెప్పారు.