Civil conflict
-
ఏం.. తమాషాలు చేస్తున్నారా?.. పట్టాభిపురం పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి,అమరావతి: గుంటూరు పట్టాభిపురం పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకోవద్దని ఆదేశాలు జారీ చేశాం. అయినా ఎందుకు తలదూరుస్తున్నారు’ అంటూ మండిపడింది. మంగళవారం హైకోర్టులో డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు సోదరి వజ్ర కుమారి, వసంత ఇంటి వ్యవహార కేసు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశించినా.. సివిల్ వ్యవహారంలో పట్టాభిపురం పోలీసులు జోక్యం చేసుకుంటున్నారంటూ వజ్రకుమారి, వసంతల తరఫున న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమ వ్యతిరేక వర్గానికి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, తమ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారని చెప్పారు. అనంతరం, తమ ఆదేశాలను ధిక్కరించిన పట్టాభిపురం పోలీసులపై హైకోర్టు న్యాయమూర్తి పై విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఆదేశాలను కచ్చితంగా అమలు అయ్యేటట్లు చూడాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశించారు. కోర్టు ఆదేశాల్ని ధిక్కరిస్తే సదరు పోలీసులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. -
పోలీసుల అత్యుత్సాహం
పట్నంబజారు (గుంటూరు): సివిల్ వివాదంలో ఒక వ్యక్తి ఇంటికి వెళ్లి ఏఎస్ఐ, కానిస్టేబుల్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన సంఘటన ఉన్నతాధికారులు దృష్టికి వెళ్లింది. వివరాలు.. వెస్ట్ సబ్‌డివిజన్ పరిధిలోని పట్టాభీపురం పోలీసుస్టేషన్ పరిధి విజయపురకాలనీలోని ఒక అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉండే ఓ వ్యక్తి దగ్గరకు ఆ స్టేషన్‌కు చెందిన ఏఎస్ఐ, కానిస్టేబుళ్లు వెళ్లారు. ఫిర్యాదు ఉందని, ఎస్‌హెచ్‌వో రావాలని చెప్పారని అజమాయిషీ చేశారు. సివిల్ పంచాయితీలో పోలీసులకు సంబంధం ఏమిటని సదరు వ్యక్తి ప్రశ్నించారు. దీనితో ఆగ్రహం చెందిన ఏఎస్ఐ, కానిస్టేబుళ్లు అతడిపై దాడి చేశారు. ఇంట్లోని మహిళను కూడా అసభ్యకరంగా, పరుష పదజాలంతో తిట్టారు. దురాగతాన్ని ఆ వ్యక్తి పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులతో విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పట్టాభీపురం పీఎస్‌లో బాధితులు, ఏఎస్ఐ, కానిస్టేబుల్ పిలిపించి వాస్తవాలను విచారిస్తున్నట్లు సమాచారం. గతంలోనూ ఏఎస్ఐపై పలు ఫిర్యాదులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఎస్ఐపై గతంలో సైతం పలు ఫిర్యాదులు ఉన్నాయి. ఒక చీటింగ్ కేసులో కూడా రూ. 40వేలు తీసుకున్నాడని బాధితులు అర్బన్ ఎస్పీ కార్యాలయంలోని గ్రీవెన్స్‌డేలో ఫిర్యాదు చేశారు. ఇటీవల నగరంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ద్విచక్ర వాహనదారుల వద్ద డబ్బులు తీసుకుని వదిలివేయడంతో గమనించిన టీం అధికారులు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడంతో వీఆర్‌కు కూడా పంపినట్లు పోలీసులే చెబుతున్నారు. దీనిపై వెస్ట్ డీఎస్పీ కె.జి.వి. సరితను వివరణ కోరగా పోలీసులు వెళ్లిన మాట వాస్తమేనని తెలిపారు. అయితే, అక్కడ జరిగిన సంఘటనపై అందిన ఫిర్యాదు మేరకు పూర్తిస్థాయిలో ఉన్నతాధికారులు విచారణ చేపట్టినట్లు వివరించారు. -
‘ఎవరు తప్పు చేసినా చర్యలు తప్పవు’
-
‘ఎవరు తప్పు చేసినా చర్యలు తప్పవు’
సిద్ధిపేట: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి ఎస్ఐ సతీష్ జులుంపై పోలీసు కమిషనర్ శివకుమార్ స్పందించారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించామని, ఎవరు తప్పు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒకరి వాదనే వినడం సరికాదని, ఇరువైపుల వాదనలు వినాలని సూచించారు. ఒకవేళ ఎస్ఐ తప్పుచేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సివిల్ వివాదాల్లో పోలీసు సిబ్బంది జోక్యం చేసుకోకుండా ప్రయత్నిస్తున్నామని మిరుదొడ్డి ఘటన తన దృష్టికి వచ్చిందని తెలిపారు. సిద్ధిపేట పోలీసు కమిషనర్‌కు నిజాయితీ ఉంటే ఎస్ఐ సతీష్‌ను సస్పెండ్ చేసి, ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని హైకోర్టు న్యాయవాది రఘునాథ్ డిమాండ్ చేశారు. ‘దివ్యాంగుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులను బెదిరించే పరిస్థితి ఉంటుందా? కమిషనర్‌కు ఆ విషయం తెలియదా? ఇందులో విచారించడానికి ఏముంది? ఎస్ఐ సతీష్‌ను కమిషనర్ వెనకేసుకు రావడం సరికాద’ని రఘునాథ్ అన్నారు. -
వద్దన్నా తలదూరుస్తున్నారు!
- సివిల్ తగాదాల్లో ఖాకీల అత్యుత్సాహం - ఉన్నతాధికారుల సూచనలు పాటించని పోలీసులు - షాద్‌నగర్ సీఐ, ఎస్ఐ సస్పెన్షన్ తాజా నిదర్శనం షాద్‌నగర్‌క్రైం: సివిల్ తగాదాల్లో తలదూర్చవద్దని ఉన్నతాధికారులు వద్దంటున్నారు.. కిందిస్థాయి అధికారులు మాత్రం వదలనంటున్నారు.. దీంతో వివాదాల్లో చిక్కుకుని బదిలీలు, సస్పెన్షన్లకు వారు గురవుతూనే ఉన్నారు. షాద్‌నగర్ పట్టణ పోలీసు స్టేషన్లో విధులు నిర్వహించి సస్పెన్షన్‌కు గురైన సీఐ, ఎస్ఐల సంఘటనే ఇందుకు తాజా నిదర్శనంగా చెప్పుకోవచ్చు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని పోలీసు ఠాణాలన్నీ సైబరాబాద్ పరిధిలోకి వచ్చిన ఏడు నెలల వ్యవధిలోనే ఇక్కడి ఇద్దరు పోలీసు అధికారులు సివిల్ తగాదాల్లో తలదూర్చి సస్పెన్షన్‌కు గురి కావడం చర్చనీయాంశంగా మారింది. షాద్‌నగర్ పట్టణానికి చెందిన అన్నదమ్ములు కజ్జెం వీరేశం, కజ్జెం శ్రీధర్, కజ్జెం వెంకటేశ్‌ల మధ్య రెండేళ్లుగా ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పట్టణంలోని కేశంపేట రోడ్డులోని రైస్‌మిల్ నుంచి ఇటీవలే రూ. 8 లక్షల విలువైన బియ్యాన్ని తరలిండంతో పాటు మిల్లులో ఉన్న కొందరిపై ఓ వర్గం చేయిచేసుకుంది. రైస్ మిల్లు నుంచి బియ్యం తరలింపు సమయంలో పట్టణ ఎస్ఐ నారాయణ సింగ్ స్వయంగా అక్కడకు వెళ్లి ఒక వర్గానికి మద్దతు తెలిపి తమకు అన్యాయం చేశారంటూ కజ్జె వీరేశం సైబరాబాద్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విదేశాల్లో ఉన్న వీరేశం కుమారుడు తన కుటుంబానికి షాద్‌నగర్ పోలీసులు తీవ్ర అన్యాయం చేశారని సామాజిక మాధ్యమంలో (ట్విటర్)లో పోలీసు అధికారుల పేర్లతో సహా పోస్టులు చేశారు. ఈ సంఘటనపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు వెంటనే పట్టణ సీఐ రామకృష్ణతో పాటు ఎస్ఐ నారాయణ సింగ్‌ను సైబరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. తాజాగా గురువారం ఈ ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రాజకీయ నాయకుల ఒత్తిళ్లే కారణమా..? పట్టణంలోని కేశంపేట రోడ్‌లోని రైస్‌మిల్లు వ్యవహారంలో ఎస్ఐ నారాయణసింగ్ అత్యుత్యాహం చూపడానికి ఆయనపై వచ్చిన ఒత్తిళ్లే కారణమని సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పోలీసు సిబ్బంది ఒత్తిళ్లకు తలొగ్గి విధి నిర్వహణలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఉన్నతాధికారుల దృష్టి నుంచి తప్పించుకోలేరని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోకి వచ్చిన తర్వాత స్థానిక ఠాణాలో న్యాయం జరగకపోతే బాధితులు నేరుగా సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్యను కలిసి గోడు వెళ్లబోసుకుంటున్నారు. బాధితులకు భరోసానిస్తూ పోలీస్ కమిçషనర్ తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కాగా, నియోజకవర్గంలోని పలు మండలాల ఠాణాల్లో రాజకీయ ఒత్తిళ్ల మధ్య అధికారులు విధులు నిర్వహిస్తూ వారు చెప్పింది చెప్పినట్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. సీఐ, ఎస్ఐ సస్పెన్షన్ ఉదంతంతోనైనా ఆయా ఠాణాల పోలీస్ అధికారుల్లో మార్పు వస్తుందో లేదో వేచి చూడాల్సిందే.