
పట్నంబజారు (గుంటూరు): సివిల్ వివాదంలో ఒక వ్యక్తి ఇంటికి వెళ్లి ఏఎస్‌ఐ, కానిస్టేబుల్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన సంఘటన ఉన్నతాధికారులు దృష్టికి వెళ్లింది. వివరాలు.. వెస్ట్ సబ్‌డివిజన్ పరిధిలోని పట్టాభీపురం పోలీసుస్టేషన్ పరిధి విజయపురకాలనీలోని ఒక అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉండే ఓ వ్యక్తి దగ్గరకు ఆ స్టేషన్‌కు చెందిన ఏఎస్‌ఐ, కానిస్టేబుళ్లు వెళ్లారు. ఫిర్యాదు ఉందని, ఎస్‌హెచ్‌వో రావాలని చెప్పారని అజమాయిషీ చేశారు. సివిల్ పంచాయితీలో పోలీసులకు సంబంధం ఏమిటని సదరు వ్యక్తి ప్రశ్నించారు. దీనితో ఆగ్రహం చెందిన ఏఎస్‌ఐ, కానిస్టేబుళ్లు అతడిపై దాడి చేశారు. ఇంట్లోని మహిళను కూడా అసభ్యకరంగా, పరుష పదజాలంతో తిట్టారు. దురాగతాన్ని ఆ వ్యక్తి పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులతో విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పట్టాభీపురం పీఎస్‌లో బాధితులు, ఏఎస్‌ఐ, కానిస్టేబుల్ పిలిపించి వాస్తవాలను విచారిస్తున్నట్లు సమాచారం.
గతంలోనూ ఏఎస్‌ఐపై పలు ఫిర్యాదులు
ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఎస్‌ఐపై గతంలో సైతం పలు ఫిర్యాదులు ఉన్నాయి. ఒక చీటింగ్ కేసులో కూడా రూ. 40వేలు తీసుకున్నాడని బాధితులు అర్బన్ ఎస్పీ కార్యాలయంలోని గ్రీవెన్స్‌డేలో ఫిర్యాదు చేశారు. ఇటీవల నగరంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ద్విచక్ర వాహనదారుల వద్ద డబ్బులు తీసుకుని వదిలివేయడంతో గమనించిన టీం అధికారులు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడంతో వీఆర్‌కు కూడా పంపినట్లు పోలీసులే చెబుతున్నారు. దీనిపై వెస్ట్ డీఎస్పీ కె.జి.వి. సరితను వివరణ కోరగా పోలీసులు వెళ్లిన మాట వాస్తమేనని తెలిపారు. అయితే, అక్కడ జరిగిన సంఘటనపై అందిన ఫిర్యాదు మేరకు పూర్తిస్థాయిలో ఉన్నతాధికారులు విచారణ చేపట్టినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment