జి.ఈశ్వరమ్మ
గుంటూరు: ‘‘పిల్లలతో కలిసి ఉంటున్న నన్ను నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి కానిస్టేబుల్ శ్రీనివాసరావు ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. తీరా పెళ్లి చేసుకోమని నిలదీస్తే తనకెలాంటి సంబంధం లేదంటూ బుకాయిస్తున్నాడు.’’ అంటూ బాపట్లలోని తుఫాన్ నగర్‌కు చెందిన జి.ఈశ్వరమ్మ శుక్రవారం రూరల్ ఎస్పీ సిహెచ్.వెంకటప్పలనాయుడు వద్ద వాపోయింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... ఈశ్వరమ్మ భర్త వెంకటేశ్వరరావు 2012లో మృతి చెందాడు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అప్పట్లో బాపట్ల టౌన్ ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చింతపల్లి శ్రీనివాసరావుతో పరిచయమైంది. తన భార్య చనిపోయిందని, నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేయడం ప్రారంభించాడు. ఐదేళ్లుగా ఇద్దరం కలిసి ఉంటున్నాం.
కొద్ది నెలల కిందట వెల్దుర్తి పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయింది. అప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం తాగుతూ దుర్భాషలాడడం ప్రారంభించాడు. కుటుంబ పోషణ కూడా భారంగా మారడంతో వంట పనులు చేసుకుని జీవిస్తున్నాను, పెళ్లి చేసుకోమని ఈశ్వరమ్మ కొద్దికాలంగా ఒత్తిడి చేయడంతో తనకు భార్య, పిల్లలు ఉన్నారని, పెళ్లి చేసుకోవడం సాధ్యపడదని తేల్చి చెప్పాడు. ఎలాగైనా వదిలించుకోవాలని నిర్ణయించుకుని ఈ నెల 16న మధ్యాహ్న సమయంలో ఈశ్వరమ్మతో పాటు వంట పనులకు వచ్చే వ్యక్తితో అక్రమ సంబంధం అంటగట్టి ఈశ్వరమ్మను ఇంట్లో గదిలో బంధించాడు. మరో కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి పిలిపించి ఇంట్లో ఉన్న ప్రామిసరీ నోట్లు డబ్బుతో పాటు, మెడలో ఉన్న బంగారు చైన్ ఇవ్వకుంటే ఇంట్లో తగులబెడతానని హెచ్చరించడంతో, గత్యంతరం లేని స్థితిలో వాటిని ఇచ్చేసింది. కానిస్టేబుల్ శ్రీనివాసరావు నుంచి తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఆమె ఎస్పీని కోరింది. సానుకూలంగా స్పందించిన ఎస్పీ విచారించి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment