మహిళతో సహజీవనం.. కుమార్తెపై అత్యాచారం | Man Molestation On Girl In Guntur | Sakshi
Sakshi News home page

Published Mon, May 28 2018 10:47 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

Man Molestation On Girl In Guntur - Sakshi

తెనాలి రూరల్‌: సహజీవనం చేస్తున్న మహిళ కన్నుగప్పి ఆమె పదహారేళ్ల కుమార్తెపై అత్యాచారం చేస్తున్నాడో కామాంధుడు. అతడి చేష్టలను ప్రతిఘటించలేని పర్యవసానంగా అమాయకురాలు గర్భం దాల్చింది. అనారోగ్యంతో ఉన్న కుమార్తెను వైద్యుడి దగ్గరకు తీసుకెళితే, ఈ నిజం తెలిసింది. ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మహిళ భర్తతో విభేదాల కారణంగా విడిపోయింది. తెనాలికి వచ్చి ముత్యంశెట్టిపాలెంలో నివసిస్తోంది. తెనాలి, పరిసర ప్రాంతాలకు కూలిపనులకు వెళుతూ జీవనం సాగిస్తోంది. ఆమెకు 16 ఏళ్ల కుమార్తె, 11 ఏళ్ల కుమారుడు ఉన్నారు. ఏ అండా లేని ఆ ఒంటరి మహిళకు, కూలిపనుల సమయంలో పరిచయమైన పొన్నూరుకు చెందిన తాపీ మేస్త్రి వెంకటేశ్వర్లు (50)తో సాన్నిహిత్యం ఏర్పడింది.

పరస్పర అంగీకారంతో అతడితో సహజీవనం చేస్తోంది. వెంకటేశ్వర్లు కొద్దిరోజులు తెనాలిలో ఈమెతో ఉంటూ మరికొన్ని రోజులు స్వగ్రామానికి వెళుతూ గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో మహిళ కుమార్తెకు కొద్దిరోజులుగా ఒంట్లో నలతగా ఉంటోంది. ఏది తిన్నా సహించకపోవటం, వాంతులు అవుతుండడంతో శనివారం ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు బాలిక ప్రస్తుతం గర్భవతి అని చెప్పడంతో తల్లి నిర్ఘాంతపోయింది. ఆరాతీస్తే వెంకటేశ్వర్లు రాత్రిపూట ఆహారంలో తనకు మత్తుమందు ఇచ్చి కుమార్తెపై లైంగికదాడి చేశాడని అర్థమైంది. దుర్మార్గుడిని శిక్షించి, తమకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు  చేసింది. ఎవరికైనా చెబితే చంపేస్తానని తన కుమార్తెను బెదిరించాడని మహిళ వాపోయింది. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ఎం.స్నేహలత వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement