ఆమె ఉన్నత విద్యను అభ్యసించింది. వివాహం చేసుకుని దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టింది. ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. కానీ కలిసిరాని కాలం అనారోగ్యం రూపంలో భర్తను తీసుకుపోవడంతో ఒంటరిగా మిగిలింది. ఇక్కడే విధి మరో మలుపు తిప్పింది. ఆమె జీవితంలోకి మరో వ్యక్తిని పంపించింది. మొదట పరిచయం.. ఆ తర్వాత ప్రేమ.. చివరికి సహజీవనం వరకు వచ్చింది. మళ్లీ విధి వెక్కిరించింది.. ప్రియుడు కాదన్నాడు.. వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడు.. ఈ నేపథ్యంలో ఆమె కుంగిపోయింది. గురువారం తన ఇద్దరి బిడ్డలతో సహా ఈ లోకం విడిచి వెళ్లిపోయింది.
పొన్నూరు(చేబ్రోలు): సహజీవనం చేస్తున్న వ్యక్తి కాదన్నాడని ఓ వివాహిత తనతో పాటు తన బిడ్డలపై డీజిల్, వంట నూనె మిశ్రమాన్ని పోసుకుని సజీవదహనమైంది. మండల పరిధిలోని జూపూడి గ్రామానికి చెందిన శారద(42) ఎంఏ బీఈడీ చదివింది. టీచర్‌గా పనిచేస్తోంది. అదే గ్రామానికి చెందిన ఉదయ్‌కుమార్‌తో వివాహం జరిగింది. వారికి శ్రేష్ఠ(11), ప్రకాష్‌వర్మ(9) అనే కుమార్తె, కుమారుడు ఉన్నారు. గుండె నొప్పి రావటంతో 2008లో భర్త అకస్మికంగా మృతి చెందాడు. ఆ తర్వాత శారదకు అదే గ్రామానికి చెందిన బొడ్డు కోటేశ్వరావుతో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త పెరిగి సహజీవనం సాగించే వరకు వచ్చింది.
ఈ నేపథ్యంలో సుమారు నెల రోజుల కిందట పట్టణంలో 31 వార్డులో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. శారద తన ఇద్దరి బిడ్డలు, కోటేశ్వరావుతో కలసి అక్కడే ఉంటోంది. ఈ క్రమంలో యువకుడైన కోటేశ్వరావు గురువారం మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న శారద మనస్తాపానికి గురై గురువారం రాత్రి ఇద్దరు బిడ్డలతో కలిసి సజీవదహనం చేసుకుంది. కోటేశ్వరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కేసు మాఫీకి యత్నాలు..
శారదతో సహజీవనం చేస్తున్న బొడ్డుకోటేశ్వరావు జూపూడి గ్రామంలో రేషన్ డీలర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను అధికార పార్టీ సానుభూతిపరుడు. కాగా ఈ వ్యవహారంలో అధికార పార్టీ నాయకులు జోక్యం చేసుకొని కేసును నీరు గార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment