తమాషా చేస్తున్నావా!
♦ డీఎస్ఓపై.. దుర్భాషలాడిన మంత్రి ఓఎస్డీ
♦ ఫోన్లో చందూలాల్ ఓఎస్డీ అతిప్రవర్తన
♦ 6ఏ కేసు తొలగించాలని హెచ్చరిక
♦ కంటతడి పెట్టిన డీఎస్ఓ ఉషారాణి
♦ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే యోచనలో ఉద్యోగులు
‘ఎవరు మాట్లాడేది డీఎస్ఓనా.. ఒకసారి చెపితే అర్థం కాదా.. మావాళ్ల మీద 6(ఏ) కేసు పెట్టొద్దని చెప్పినా వినట్లేదు. ఏమనుకుంటున్నావ్. అసలు నీది ఏ బ్యాచ్. జిల్లాలో ఎక్కడ ఏం జరిగేది నాకు తెలుసు.. తమాషాలా? అక్కడ జనంతో ధర్నా చేయిస్తా అప్పుడు తెలుస్తుంది. ముందు నువ్వు పూర్తి వివరాలతో వచ్చేవారం రా.. రివ్యూ ఏర్పాటు చేస్తా..’ ఇలా మాట్లాడింది ఎవరో కాదు. జిల్లాకు చెందిన మంత్రి అజ్మీరా చందూలాల్ హైదరాబాద్ కార్యాలయంలో ప్రత్యేక అధికారి(ఓఎస్డీ)గా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్. ఫోన్లో ఇవతలివైపు ఉన్నది జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి(డీఎస్ఓ) ఉషారాణి.
సాక్షి ప్రతినిధి, వరంగల్ : మహబూబాబాద్‌లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చిన ఓ రేషన్ దుకాణం డీలరుపై అధికారులు నమోదు చేసిన కేసు ఎత్తివేయాలని మంత్రి చందూలాల్ ఓఎస్డీ ప్రవీణ్‌కుమార్ ఫోన్లో డీఎస్ఓ ఉషారాణిని ఆదేశించారు. ముందుగానే తాను ఫోన్ చేసినా ఎందుకు కేసు నమోదు చేశారని కోపగించుకున్నారు. తన అక్కసునంతా ఫోన్లో మహిళా అధికారిపై వెళ్లగక్కాడు. సాటి అధికారి అని చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. దీంతో తోటి ఉద్యోగుల సమక్షంలోనే డీఎస్వో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓఎస్డీ మాట్లాడిన తీరుపై ఉద్యోగుల్లోనే నిరసన వ్యక్తమవుతోంది. మంత్రి పేషీలో పనిచేస్తే దబాయింపు చేయడమేమిటనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓఎస్డీ మాట్లాడిన తీరుతో డీఎస్వో ఉషారాణి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కంటతడి పెట్టారు.
ఇదీ విషయం..
పౌర సరఫరాల శాఖలో అక్రమాలను అరికట్టేందుకు జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ కొంతకాలం నుంచి.. ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు నేరుగా ఫోన్‌ఇన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గత నెల మొదటివారంలో మహబూబాబాద్ నుంచి ఒక ఫోన్‌కాల్ వచ్చింది. మహబూబాబాద్‌లోని 126 నంబర్ రేషన్‌షాపు డీలరు కార్డుదారులకు సరుకులు ఇవ్వడంలేదని, షాపు తెరవడంలేదని, సరుకులు పక్కదారి పడుతున్నాయన్నది ఆ ఫోన్‌కాల్ ఫిర్యాదు సారాంశం.
టోల్ ఫ్రీ నంబర్‌కు అందిన ఫోన్‌కాల్ ఫిర్యాదుపై వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ అక్కడి అధికారులను ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ మహౠబాబాద్ సహాయ సరఫరా అధికారి(ఏఎస్వో) చందన్‌కుమార్ ఆరోపణలు వచ్చిన షాపులో తనిఖీలు చేశారు. సరుకుల నిల్వల్లో భారీగా తేడాలు ఉండటంతో పూర్తిస్థాయి విచారణ చేసి సదరు డీలర్‌పై నిత్యావసరాల చట్టంలోని 6ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. తదుపరి చర్యల కోసం దీనికి సంబంధించిన ఫైల్ డీఎస్వో ద్వారా జాయింట్ కలెక్టర్‌కు చేరింది.
కేసు వద్దని ఒత్తిడి..
షాపులో తనిఖీలు చేసినప్పటి నుంచి అధికారులపై ఒ త్తిళ్లు మొదలయ్యాయి. మొదట కేసు నమోదు చేయవద్దని ఆదేశాలు వచ్చాయి. కేసు నమోదైన తర్వాత తాజా కేసు ఎత్తివేయాలని తీవ్రస్థాయిలో అధికారులపై ఒత్తిళ్లు తెచ్చారు. ఇదే క్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ ఓఎస్డీగా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్ డీఎస్ వో ఉషారాణికి ఫోన్ చేసి కేసు విషయంలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. కేసు తమ పరిధిలో లేదని జాయింట్ కలెక్టర్ ఆదేశాల ప్రకారం అధికారులు విచారణ చేసి నివేదిక ఇచ్చారని డీఎస్వో తెలిపారు.
ఏదైనా ఉంటే జేసీతో మాట్లాడాలని సూచించారు. ఇలా ఈ వ్యవహారం నడుస్తోంది. తాజాగా సోమవారం కలెక్టరేట్లోని పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో డీఎస్వో ఉషారాణి అధికారులతో సమావేశమయ్యారు. అధికారులతో మాట్లాడుతు న్న క్రమంలో డీఎస్వోకి ఫోన్‌కాల్ వచ్చింది. తాను వద్ద ని చెప్పినా కేసు ఎందుకు నమోదు చేశారని నిలదీశారు. ఇప్పటికైనా కేసు ఎత్తివేయాలని ఆదేశించారు. అది తన పరిధిలో వ్యవహారం కాదని డీఎస్వో మరోసారి చెప్పా రు. అయినా పట్టించుకోకుండా ఓఎస్డీ వినకుండా... వా రంలో రావాలి రివ్యూ ఏర్పాటు చేస్తా అప్పుడు చెపుతా అంటూ హెచ్చరిస్తూ మాట్లాడారు. ఈ ఘటనతో డీఎస్ వో కంటతడి పెట్టుకున్నారు. అధికారులు సమావేశం ముగించుకుని వెళ్లిపోయారు.
ఈ విషయంపై జేసీకి, కలెక్టర్‌కు, పౌరసరఫరాల మంత్రికి ఫిర్యాదు చేయాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విషయంపై మం త్రి చందూలాల్ ఓఎస్డీ ప్రవీణ్‌కుమార్‌ను ‘సాక్షి ప్రతినిధి’ ఫోన్లో సంప్రదించగా.. తాను అధికారులతో బాగానే ఉంటానని చెప్పారు. డీఎస్‌వోతో మాట్లాడాను. విషయం ఏమిటని ఆరా తీశాను. హైదరాబాద్‌కు అక్కడి అధికారులను మేం ఎందుకు రప్పిస్తాం’ అని అన్నారు.