Civil supplies officials
-
ఉద్యోగ ప్రతిపాదనలు సిద్ధం చేయండి!
‘పౌరసరఫరాల’ అధికారులకు మంత్రి ఈటల ఆదేశం సాక్షి, హైదరాబాద్: పౌరసరఫరాల సంస్థ అవసరాల మేర ఉద్యోగులను నియమించు కునేందుకు ఉద్యోగాల ప్రతిపాదనలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ, పౌరసర ఫరాల సంస్థ, తూనికలు, కొలతల శాఖ అధికారులతో ఆయన సచివాలయంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహిం చారు. 2015–16లో కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని నూరుశాతం సేకరించామని, 2016–17లోనూ అదే లక్ష్యంగా పెట్టుకోవా లన్నారు. ఎన్ఫోర్స్మెంట్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకుంటామని, తూనికలు, కొలతల శాఖలోనూ అక్రమా లను అరికడతామన్నారు. రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల్లో ఈ–పాస్ విధానం ప్రవేశపెట్టి బోగస్ లబ్ధిదారులకు బియ్యం అందకుండా చర్యలు చేపడతామన్నారు. జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) నియమాలకు అనుగుణంగా రాష్ట్రంలో కార్డుల, రేషన్ షాపుల క్రమబద్ధీకరణ చేపట్టాలన్నారు. ఎన్ఎఫ్ఎస్ఏ నిబంధనల మేరకు రేషన్ డీలర్లకు కమీషన్ పెంచే విషయంలో అతి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీపం పథకం కింద వంట గ్యాసు కనెక్షన్లు అడిగనన్ని ఇస్తామని, గతంలో మంజూరైన కనెక్షన్లు వెంటనే అందజేయడానికి గ్రౌండింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన సౌకర్యం వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెడతామని తెలిపారు. పౌరసరఫరాల శాఖ బడ్జెట్ ప్రతిపాదనలను సమగ్రంగా తయారు చేయాలని కమిషనర్ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు. పెట్రోలు బంకులు, మాల్స్, దుకాణల్లో తూనికలు, కొలతల్లో అక్రమాలను అరికట్టాలన్నారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి, కమిషనర్ సీవీ ఆనంద్, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
జనగాం డివిజన్లో సివిల్ సప్లై దాడులు
వరంగల్ : వరంగల్ జిల్లా సివిల్ సప్లై అధికారులు గురువారం జనగాం డివిజన్ పరిధిలో అకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవరుప్పుల గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 150 లీటర్ల కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే లింగాల ఘన్‌పూర్‌లో 5 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. అనంతరం వాటిని సీజ్ చేశారు. పలువురిపై సివిల్ సప్లై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అర్హులందరికీ పండుగ సరుకులు
రంజాన్ తోఫా ప్రారంభ సభలో మంత్రి పరిటాల సునీత ♦ కడపలో హజ్ హౌస్ నిర్మాణానికి ♦ రూ.12 కోట్లు విడుదల : సతీష్‌రెడ్డి కడప సెవెన్‌రోడ్స్ : వేలి ముద్రలు సరిపడలేదనో, ఐరిస్ మ్యాచ్ కాలేదనో ఎవరినీ వెనక్కి పంపవద్దని, అర్హులందరికీ చంద్రన్న రంజాన్ తోఫా అందజేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అధికారులను ఆదేశించారు. కడప కళాక్షేత్రంలో మంగళవారం ఆమె రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. పేద వారు పండుగపూట సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారన్నారు. చంద్రన్న రంజాన్ తోఫా ఎవరికైనా అందకపోతే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ముస్లింల అభ్యున్నతి కోసం గతంలో మసీదులు, ఈద్గాలు, మదరసాల వంటి వాటి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు. కడపలో హజ్ హౌస్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.12 కోట్లు విడుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ర్ట శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హజ్ైహౌస్ నిర్మాణం కోసం 10 ఎకరాల భూమిని కేటాయించాలని కలెక్టర్‌ను ఆదేశించిందని చెప్పారు. కడపలో ఉర్దూ అకాడమి ఏర్పాటుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. గతంలో సంక్రాంతి కానుకను అందరికీ అందించామని, ఇప్పుడు ముస్లింలు, దూదేకులకు రంజాన్ తోఫాను ప్రభుత్వం అందిస్తోందన్నారు. గత ప్రభుత్వాలు ముస్లింలను ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకున్నాయని విమర్శించారు. గతంలో హైదరాబాద్‌లో నిరంతరం మత ఘర్షణలు జరిగేవని, టీడీపీ ఆవిర్భావం తర్వాత వాటి దాఖలాలు లేవన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని ముస్లింలు తమ పార్టీకి దూరమయ్యారన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం కోసం బీజేపీతో తాము పొత్తు పెట్టుకున్నాము తప్ప మైనార్టీల అభ్యున్నతిని, రక్షణను ఎప్పటికీ విస్మరించలేదన్నారు. ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ రాష్ర్టం ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలు అమలు చేసేందుకు అహరహం శ్రమిస్తున్నారన్నారు. ఎవరూ అడగకపోయినా రంజాన్ తోఫా ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కేవీ రమణ, జేసీ రామారావు, డీఎస్ఓ కృపానందం, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వెంకటేశం, మాజీ మంత్రి డాక్టర్ ఎస్ఏ ఖలీల్‌బాష, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎం.లింగారెడ్డి, విజయమ్మ, నాయకులు విజయజ్యోతి, అమీర్‌బాబు, జిలానీబాష, రెడ్యం వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహిళల అసంతృప్తి రంజాన్ తోఫా ప్రారంభ కార్యక్రమానికి పౌర సరఫరాల అధికారులు నగరంలోని ముస్లిం మహిళలను సభా స్థలికి తీసుకువచ్చారు. అందరికీ తోఫా పంపిణీ చేస్తామని అధికారులు, డీలర్లు నమ్మ బలకడంతో పేద మహిళలంతా ఎంతో ఆశగా కళాక్షేత్రం వద్దకు వచ్చారు. లాంఛనంగా కొందరికి మాత్రమే పంపిణీ చేయడంతో మిగిలిన వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు. -
సిలిండర్ @ రూ.2వేలు !
గొడౌన్లో గ్యాస్ లేదా...? గ్యాస్ అందుబాటులోకి రావడం లేదా....? అయితే సీలేరు రండి. రూ.2 వేలు ఇస్తే నడుచుకొని మీ ఇంటికి గ్యాస్ వచ్చేస్తుంది. గ్యాస్ సిలిండర్ ధర 2000 రూపాయలా..? అని ఆశ్చర్యపోతున్నారా!! ఔను నిజం. గ్యాస్ కావాలంటే అంత చెల్లించక తప్పదు. ఎందుకంటే ఇక్కడంతా దళారుల ఇష్టారాజ్యం. - సీలేరులో అంతే... - దళారుల చేతిలో సబ్సిడీ గ్యాస్ - ఒకే పేరుపై నాలుగైదు కనెక్షన్లు - అధిక ధరలకు ఒడిషా తరలింపు - పట్టించుకోని అధికారులు సీలేరు: సీలేరులో ప్రభుత్వ సబ్సిడీ గ్యాస్ దళారుల పాలవుతోంది. గ్యాస్ అధికారులు స్థానికంగా ఉన్న కొందరు దళారులు ఒక్కటై నకిలీ పేర్లతో పాస్ పుస్తకాలను తయారు చేసి ఒక్కొక్కరు 20 నుంచి 30 వరకు కనెక్షన్లు ఇళ్లల్లో పెట్టుకొంటున్నారు. ఈ వ్యవహారం అంతా రెండేళ్లుగా సాగుతున్నా సంబంధిత అధికారులు ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. దీంతో సీలేరుకు గ్యాస్ వచ్చిందంటే దళారుల సందడి ఎక్కువవుతుంది. ఒక్కో ఇంటిలో ఒకే పేరుపై నాలుగైదు కనెక్షన్లు, దానికి తోడు దళారుల వద్ద అధికంగా కనెక్షన్లు ఉండడంతో నిజమైన లబ్దిదారులకు గ్యాస్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలే చింతపల్లి గ్యాస్ గొడౌన్లో అవినీతి వెలు గు చూడడానికి ప్రధాన కారణం సీలేరే. మరణించిన, ఊరు విడిచి వెళ్ళిన వారు, బదిలీ అయిన ఉద్యోగుల పేరిట కనెక్షన్లు ముందుగా తీసుకొని దళారులు దళారులు దర్జాగా సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవానికి నెలకు రెండుసార్లు గ్యాస్ సరఫరాచేయాల్సి ఉంది. అయితే ఇక్కడ దళారులు చింతపల్లి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు కుమ్మక్కై గ్యాస్ సరఫరాలో జాప్యం చేస్తారు. ఈలోగా వినియోగదారుల అవసరాన్ని సాకుగా తీసుకుని తమ వద్ద ఉన్న సిలిండర్లను అధిక ధరలకు అమ్మి దళారులు సొమ్ము చేసుకుంటారు. సబ్సిడీ రేటు రూ.420గా ఉండగా, దళారులు రూ.1000 నుంచి రూ.2 వేల వరకు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. కనెక్షన్ ఉన్నా...నో గ్యాస్ ఆదివారం సీలేరులోని వినియోగదారుల కోసం 320 గ్యాస్ సిలిండర్లు సరఫరా అయ్యాయి. అయితే సరఫరా అయిన గ్యాస్ దళారుల పాలబడింది. లబ్దిదారుల్లో సగం మందికి కూడా గ్యాస్ అందకపోవడం గమనార్హం. అంటే ఒక్కొక్కరి వద్ద దగ్గర పదికి మించి బండలు ఉండడంతో వారంతా గ్యాస్‌ను సబ్సిడీ రేటుకు దక్కించుకున్నారు. వచ్చిన గ్యాస్‌లో సగం వారే తన్నుకుపోవడంతో మిగిలిన లబ్దిదారులకు గ్యాస్ అందక బిక్కమొగం వేశారు. రెండు నెలలుగా ఎదురు చూసినా తీరా గ్యాస్ వచ్చినా తమకు అందక గంటల తరబడి వేచి ఉండి ఖాళీ బండలతో లబ్దిదారులు ఉసూరుమంటూ తిరిగి వెళ్లారు. అధిక ధరలకు ఒడిషా తరలింపు అధిక ధరల కారణంగా స్థానికంగా డిమాండ్ లేకపోతే తమ వద్ద గల సిలిండర్లను దళారులు యథేచ్ఛగా పొరుగునే ఉన్న ఒడిషాకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా చిత్రకొండ, బలిమెల, మల్కన్‌గిరి వరకు బహిరంగంగా వ్యాన్లలో గ్యాస్ సిలిండర్లను తరలించడం ఇక్కడ నిత్యకృత్యం. ఇలా యథేచ్ఛగా సబ్సిడీ గ్యాస్ పక్కదారి పడుతుంటే పౌర సరఫరా అధికారులు మిన్నకుండిపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు గ్యాస్ అక్రమాలను దృష్టిలో పెట్టుకొని చింతపల్లిలో, సీలేరు దళారుల చేతిలో ఉన్న నకిలీ కనెక్షన్లు గుర్తించి నిజమైన లబ్దిదారులకు గ్యాస్ అందేలా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.