అర్హులందరికీ పండుగ సరుకులు
రంజాన్ తోఫా ప్రారంభ సభలో మంత్రి పరిటాల సునీత
♦ కడపలో హజ్ హౌస్ నిర్మాణానికి
♦ రూ.12 కోట్లు విడుదల : సతీష్‌రెడ్డి
కడప సెవెన్‌రోడ్స్ : వేలి ముద్రలు సరిపడలేదనో, ఐరిస్ మ్యాచ్ కాలేదనో ఎవరినీ వెనక్కి పంపవద్దని, అర్హులందరికీ చంద్రన్న రంజాన్ తోఫా అందజేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అధికారులను ఆదేశించారు. కడప కళాక్షేత్రంలో మంగళవారం ఆమె రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. పేద వారు పండుగపూట సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారన్నారు.
చంద్రన్న రంజాన్ తోఫా ఎవరికైనా అందకపోతే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ముస్లింల అభ్యున్నతి కోసం గతంలో మసీదులు, ఈద్గాలు, మదరసాల వంటి వాటి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు. కడపలో హజ్ హౌస్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.12 కోట్లు విడుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ర్ట శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హజ్‌ైహౌస్ నిర్మాణం కోసం 10 ఎకరాల భూమిని కేటాయించాలని కలెక్టర్‌ను ఆదేశించిందని చెప్పారు. కడపలో ఉర్దూ అకాడమి ఏర్పాటుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
గతంలో సంక్రాంతి కానుకను అందరికీ అందించామని, ఇప్పుడు ముస్లింలు, దూదేకులకు రంజాన్ తోఫాను ప్రభుత్వం అందిస్తోందన్నారు. గత ప్రభుత్వాలు ముస్లింలను ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకున్నాయని విమర్శించారు. గతంలో హైదరాబాద్‌లో నిరంతరం మత ఘర్షణలు జరిగేవని, టీడీపీ ఆవిర్భావం తర్వాత వాటి దాఖలాలు లేవన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని ముస్లింలు తమ పార్టీకి దూరమయ్యారన్నారు.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం కోసం బీజేపీతో తాము పొత్తు పెట్టుకున్నాము తప్ప మైనార్టీల అభ్యున్నతిని, రక్షణను ఎప్పటికీ విస్మరించలేదన్నారు. ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ రాష్ర్టం ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలు అమలు చేసేందుకు అహరహం శ్రమిస్తున్నారన్నారు. ఎవరూ అడగకపోయినా రంజాన్ తోఫా ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కేవీ రమణ, జేసీ రామారావు, డీఎస్‌ఓ కృపానందం, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వెంకటేశం, మాజీ మంత్రి డాక్టర్ ఎస్‌ఏ ఖలీల్‌బాష, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎం.లింగారెడ్డి, విజయమ్మ, నాయకులు విజయజ్యోతి, అమీర్‌బాబు, జిలానీబాష, రెడ్యం వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహిళల అసంతృప్తి
రంజాన్ తోఫా ప్రారంభ కార్యక్రమానికి పౌర సరఫరాల అధికారులు నగరంలోని ముస్లిం మహిళలను సభా స్థలికి తీసుకువచ్చారు. అందరికీ తోఫా పంపిణీ చేస్తామని అధికారులు, డీలర్లు నమ్మ బలకడంతో పేద మహిళలంతా ఎంతో ఆశగా కళాక్షేత్రం వద్దకు వచ్చారు. లాంఛనంగా కొందరికి మాత్రమే పంపిణీ చేయడంతో మిగిలిన వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు.