సిలిండర్ @ రూ.2వేలు !
గొడౌన్‌లో గ్యాస్ లేదా...? గ్యాస్ అందుబాటులోకి రావడం లేదా....? అయితే సీలేరు రండి. రూ.2 వేలు ఇస్తే నడుచుకొని మీ ఇంటికి గ్యాస్ వచ్చేస్తుంది. గ్యాస్ సిలిండర్ ధర 2000 రూపాయలా..? అని ఆశ్చర్యపోతున్నారా!! ఔను నిజం. గ్యాస్ కావాలంటే అంత చెల్లించక తప్పదు. ఎందుకంటే ఇక్కడంతా దళారుల ఇష్టారాజ్యం.
- సీలేరులో అంతే...
- దళారుల చేతిలో సబ్సిడీ గ్యాస్
- ఒకే పేరుపై నాలుగైదు కనెక్షన్లు
- అధిక ధరలకు ఒడిషా తరలింపు
- పట్టించుకోని అధికారులు
సీలేరు: సీలేరులో ప్రభుత్వ సబ్సిడీ గ్యాస్ దళారుల పాలవుతోంది. గ్యాస్ అధికారులు స్థానికంగా ఉన్న కొందరు దళారులు ఒక్కటై నకిలీ పేర్లతో పాస్ పుస్తకాలను తయారు చేసి ఒక్కొక్కరు 20 నుంచి 30 వరకు కనెక్షన్లు ఇళ్లల్లో పెట్టుకొంటున్నారు. ఈ వ్యవహారం అంతా రెండేళ్లుగా సాగుతున్నా సంబంధిత అధికారులు ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. దీంతో సీలేరుకు గ్యాస్ వచ్చిందంటే దళారుల సందడి ఎక్కువవుతుంది. ఒక్కో ఇంటిలో ఒకే పేరుపై నాలుగైదు కనెక్షన్లు, దానికి తోడు దళారుల వద్ద అధికంగా కనెక్షన్లు ఉండడంతో నిజమైన లబ్దిదారులకు గ్యాస్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలే చింతపల్లి గ్యాస్ గొడౌన్‌లో అవినీతి వెలు గు చూడడానికి ప్రధాన కారణం సీలేరే.
మరణించిన, ఊరు విడిచి వెళ్ళిన వారు, బదిలీ అయిన ఉద్యోగుల పేరిట కనెక్షన్లు ముందుగా తీసుకొని దళారులు దళారులు దర్జాగా సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవానికి నెలకు రెండుసార్లు గ్యాస్ సరఫరాచేయాల్సి ఉంది. అయితే ఇక్కడ దళారులు చింతపల్లి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు కుమ్మక్కై గ్యాస్ సరఫరాలో జాప్యం చేస్తారు. ఈలోగా వినియోగదారుల అవసరాన్ని సాకుగా తీసుకుని తమ వద్ద ఉన్న సిలిండర్లను అధిక ధరలకు అమ్మి దళారులు సొమ్ము చేసుకుంటారు. సబ్సిడీ రేటు రూ.420గా ఉండగా, దళారులు రూ.1000 నుంచి రూ.2 వేల వరకు బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.
కనెక్షన్ ఉన్నా...నో గ్యాస్
ఆదివారం సీలేరులోని వినియోగదారుల కోసం 320 గ్యాస్ సిలిండర్లు సరఫరా అయ్యాయి. అయితే సరఫరా అయిన గ్యాస్ దళారుల పాలబడింది. లబ్దిదారుల్లో సగం మందికి కూడా గ్యాస్ అందకపోవడం గమనార్హం. అంటే ఒక్కొక్కరి వద్ద దగ్గర పదికి మించి బండలు ఉండడంతో వారంతా గ్యాస్‌ను సబ్సిడీ రేటుకు దక్కించుకున్నారు. వచ్చిన గ్యాస్‌లో సగం వారే తన్నుకుపోవడంతో మిగిలిన లబ్దిదారులకు గ్యాస్ అందక బిక్కమొగం వేశారు. రెండు నెలలుగా ఎదురు చూసినా తీరా గ్యాస్ వచ్చినా తమకు అందక గంటల తరబడి వేచి ఉండి ఖాళీ బండలతో లబ్దిదారులు ఉసూరుమంటూ తిరిగి వెళ్లారు.
అధిక ధరలకు ఒడిషా తరలింపు
అధిక ధరల కారణంగా స్థానికంగా డిమాండ్ లేకపోతే తమ వద్ద గల సిలిండర్లను దళారులు యథేచ్ఛగా పొరుగునే ఉన్న ఒడిషాకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా చిత్రకొండ, బలిమెల, మల్కన్‌గిరి వరకు బహిరంగంగా వ్యాన్లలో గ్యాస్ సిలిండర్లను తరలించడం ఇక్కడ నిత్యకృత్యం. ఇలా యథేచ్ఛగా సబ్సిడీ గ్యాస్ పక్కదారి పడుతుంటే పౌర సరఫరా అధికారులు మిన్నకుండిపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు గ్యాస్ అక్రమాలను దృష్టిలో పెట్టుకొని చింతపల్లిలో, సీలేరు దళారుల చేతిలో ఉన్న నకిలీ కనెక్షన్లు గుర్తించి నిజమైన లబ్దిదారులకు గ్యాస్ అందేలా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.