సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరంలో ‘పగటి పూట’ నిత్యావసరాల రవాణాపై సైతం ఆంక్షలు తప్పడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు పగటి పూట నిత్యావసరాలైన వంట గ్యాస్, ఇంధనం సరఫరా చేసే భారీ వాహనాలను సైతం అడ్డుకోవడం విస్మయానికి గురిచేస్తోంది. గత నెలలో ట్రాన్స్‌పోర్టు సమ్మె కొంత ప్రభావం చూపగా, తాజాగా పగటి పూట సిటీలో భారీ వాహనాలకు నో ఎంట్రీ అమలు చేస్తుండడంతో..ఇంధన ఉత్పత్తుల రవాణాపై తీవ్ర ప్రభావం పడుతోంది. రాత్రిపూట అనుమతి ఉన్నా..రవాణా మాత్రం అంతంతమాత్రంగా తయారైంది. ఏకంగా ఆయిల్ కంపెనీల ప్రతినిధులు పోలీసు ఉన్నతాధికారులను కలిసి లోడ్ వాహనాల అడ్డిగింపును దృష్టికి తీసుకొని వెళ్లినా..ఫలితం లేకుండా పోయింది. ఆయిల్ కంపెనీల టెర్మినల్స్‌లో గ్యాస్, ఇంధనం నిల్వలు పుష్కలంగా ఉన్నా...రవాణా ఆంక్షలతో వచ్చిన సరుకు వచ్చినట్లే పంపిణీ జరుగుతుండటంతో గోదాములు వెలవెలబోతున్నాయి. రాత్రి పూట సరఫరాతో పెట్రోల్, డీజిల్ బంకుల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా... వంట గ్యాస్ పంపిణీ మాత్రం చుక్కలు చూపిస్తోంది.
రీఫిల్ డిమాండ్ లక్షన్నరపైనే..
మహానగరంలో దినసరి వంట గ్యాస్ డిమాండ్ సుమారు లక్షన్నర ఎల్పీజీ సిలిండర్లపైనే ఉంటుంది. తాజా పరిస్థితులతో పంపిణీ మాత్రం అంతంత మాత్రంగా తయారైంది. మూడు ప్రధాన చమురు సంస్థలకు చెందిన 125 ఏజెన్సీల పరిధిలో గృహోపయోగ వంట గ్యాస్ కనెక్షన్లు సుమారు 30 లక్షలపైనే ఉన్నాయి. మరో వైపు వాణిజ్య అవసరాలకు సైతం లక్షల వరకు సిలిండర్ల డిమాండ్ ఉంటుంది. పగటి పూట రవాణాపై అంక్షలు వంటగ్యాస్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఎల్పీజీ లోడ్ వాహనాలను అనుమతించాలి
సిటీలో పగటి పూట కూడా ఎల్పీజీ లోడ్ వాహనాలను అనుమతించాలి. భారీ వాహనాలకు నో ఎంట్రీ పేరుతో ఎల్పీజీ సిలిండర్ల లోడ్‌లను అడ్డుకోవడం తగదు. ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. శివార్లలోని టెర్మినల్స్ నుంచి నగరంలోకి వస్తున్న సిలిండర్ల లోడ్ వాహనాలను పోలీసులు అడుగడుగునా అడ్డుకుని నిలిపివేస్తున్నారు. రాత్రి పూట మాత్రమే అనుమతిస్తున్నారు. దీంతో వంట గ్యాస్ పంపిణీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తక్షణమే ఎల్పీజీ వాహనాలను మినహాయించాలి.
– అశోక్ కుమార్, అధ్యక్షుడు, వంట గ్యాస్ డీలర్ల సంఘం, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment