రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన
సాక్షి, సిటీబ్యూరో: జాతీయ రహదారి భద్రతా మాసం–2025 నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కమిషనరేట్ పరిసర ప్రాంతాల్లో గురువారం 1494 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. లా అండ్ ఆర్డర్ విభాగం 708, ట్రాఫిక్ విభాగం 378, ట్రాఫిక్ ట్రయినింగ్ ఇనిస్టిట్యూట్ (టీటీఐ) 408 అవగాహన సెషన్లు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు కమిషనర్ జీ సుధీర్ బాబు తెలిపారు. డ్రైవర్లు, పాదచారులు, విద్యార్థులు, ఆర్టీసీ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, ఆటోడ్రైవర్లను అవగాహన కార్యక్రమాల్లో భాగస్వాములను చేశారు. రోడ్డు భద్రతా నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు వివిధ విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు.