సాక్షి, సిటీబ్యూరో: నగరంలో తరచూ స్తంభిస్తున్న మెట్రో రైళ్లు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకవైపు ప్రయాణికుల డిమాండ్ మేరకు కోచ్‌లు అందుబాటులో లేకపోవడంతో కిక్కిరిసిపోతున్నాయి. అదే సమయంలో ఉన్నపళంగా నిలిచిపోతున్న సర్వీసులతో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఐటీ ఉద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన వారు గంటల తరబడి పడిగాపులు కాయాల్సివస్తోంది. కొద్దిరోజుల క్రితం నాగోల్– అమీర్‌పేట్ మార్గంలో సాంకేతిక కారణాలతో సర్వీసులు నిలిచిపోయాయి. ఉదయం 7.30 గంటల నుంచి సుమారు గంట పాటు రైళ్ల నిర్వహణకు ఆటంకాలు తలెత్తడంతో ప్రయాణికులంతా ఎక్కడిక్కడ మెట్రో స్టేషన్‌లలోనే పడిగాపులు కాశారు. ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. సామాజిక మాధ్యమాల్లో ఆందోళన వ్యక్తమైంది. గతేడాది నవంబర్ 4న సైతం మియాపూర్–ఎల్‌బీనగర్ రూట్‌లో అసెంబ్లీ సమీపంలో మెట్రో రైలు ఆగిపోయింది. దీంతో ఆ రూట్‌లో సర్వీసులను నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. ఇలా తరచూ మెట్రో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడటం పట్ల నగరంలోని వివిధ ప్రాంతాల ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ముందస్తు సమాచారం లేదు..
సాధారణంగా సాంకేతికంగా తలెత్తే సమస్యలతో సిగ్నలింగ్ సేవలకు ఆటంకం కలుగుతుంది. అధికారులు ఆ సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు అరగంట నుంచి గంట వరకు సమయం పట్టవచ్చు. ఈ క్రమంలో మెట్రో రాకపోకల్లో తలెత్తిన అంతరాయంపై ప్రయాణికులకు ముందస్తుగా ఎలాంటి సమాచారం లభించడం లేదు. ఒకవైపు అప్పటికే టికెట్‌లు తీసుకున్న వాళ్లు మెట్రో కోసం ఎదురు చూస్తుంటారు. మరోవైపు యథావిధిగా టికెట్ విక్రయాలు కొనసాగుతూనే ఉంటాయి. దీంతో ఒక ట్రైన్‌కు సరిపడా ప్రయాణికులు ఎదురుచూస్తుండగా.. అంతకు రెట్టింపు సంఖ్యలో టికెట్‌లు ఇవ్వడం వల్ల రద్దీ అనూహ్యంగా పెరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని సర్వీసులకు అంతరాయం ఏర్పడినట్లు మెట్రోస్టేషన్‌లలో అనౌన్స్‌మెంట్ ఇవ్వాలని ప్రయాణికులు కోరుతున్నారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలకు అవకాశం లభిస్తుందని పేర్కొంటున్నారు. అధికారులు ఈ మేరకు ఎలాంటి అనౌన్స్‌మెంట్ చర్యలు చేపట్టకపోవడం వల్ల ప్రయాణికులకు పడిగాపులు తప్పడం లేదు.
కోచ్‌ల కొరత.. తంటాలు
సాంకేతిక సమస్యలతో పాటు కోచ్‌ల కొరత కూడా నగరంలో మెట్రో ప్రయాణానికి సవాల్‌గా మారింది. ప్రస్తుతం నాగోల్–రాయదుర్గం, ఎల్‌బీనగర్– మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్ కారిడార్‌లలో ప్రతి రోజు సుమారు 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. రోజురోజుజూ మెట్రోల్లో రద్దీ పెరుగుతూనే ఉంది. ఒక ట్రైన్ బయలుదేరే సమయానికి మరో రెండు ట్రైన్‌లకు సరిపడా ప్రయాణికులు టికెట్‌లు తీసుకొని ఎదురుచూస్తున్నారు. దీంతో ఉదయం, సాయంత్రం మెట్రోలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ మేరకు రైళ్లు పెంచాలనే ప్రతిపాదన ఉంది. నాగ్‌పూర్ నుంచి కొత్త కోచ్‌లను కొనుగోలు చేయనున్నట్లు ఇటీవల ఎల్‌అండ్‌టీ అధికారులు పేర్కొన్నారు. కానీ ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment