సాక్షి, సిటీబ్యూరో: వందశాతం మురుగు శుద్ధి దిశగా జలమండలి అడుగులేస్తోంది. మహా నగరంలో రోజువారీగా ఉత్పన్నమయ్యే మురుగు నీటిని పూర్తి స్థాయిలో శుద్ధి చేసేందుకు మూడేళ్ల క్రితం చేపట్టిన మురుగు శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) ప్రాజెక్టు పూర్తి కావస్తోంది. ఇప్పటికే సుమారు 663 ఎంఎల్‌డీల సామర్థ్యం గల 11 ఎస్టీపీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరో 443 ఎంఎల్‌డీ సామర్థ్యం గల తొమ్మిది ఎస్టీపీల నిర్మాణాలు తుది దశకు చేరుకుంటున్నాయి. మరోవైపు అమృత్ పథకంక కింద 972 ఎంఎల్‌డీ సామర్థ్యమున్న 39 ఎస్టీపీల నిర్మాణాలకు టెండర్లను ఆహ్వానించింది
1,650 ఎంఎల్‌డీల మురుగు ఉత్పన్నం..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోజువారీగా సుమారు 1,650 మురుగు నీరు ఉత్పన్నమవుతోందని అంచనా. అందులో సుమారు 772 ఎంఎల్‌డీల మురుగు నీటిని ఇప్పటికే 25 ఎస్టీపీల ద్వారా శుద్ధి చేస్తోంది. ఉత్పన్నమవుతున్న నీటిలో 46 శాతం శుద్ధి జరుగుతుండటంతో మిగిలిన 54 శాతం సైతం మురుగు నీటిని శుభ్రం చేయడానికి కొత్త ఎస్టీపీల నిర్మాణాలకు నడుం కట్టింది.
31 నుంచి 20కి కుదింపు
మూడేళ్ల క్రితం చేపట్టిన ఎస్టీపీల ప్రాజెక్టును మొత్తం మూడు ప్యాకేజీలుగా విభజించి రూ.3866.41 కోట్ల అంచనా వ్యయంతో 1259.50 ఎంఎల్డీల సామర్థ్యం గల 31 కొత్త మురుగు నీటి శుద్ధి కేంద్రాలకు ప్రణాళిక రూపొందించి కార్యాచరణకు దిగింది. స్థల సేకరణ వివాదాలు ఇతరత్రా అభ్యంతరాలతో ఎస్టీపీల సంఖ్యను 20కి కుదించి ఎంఎల్డీల సామర్థ్యాన్ని మాత్రం తగ్గకుండా చర్యలు చేపట్టింది. అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీ వినియోగిస్తూ ఎస్టీపీల నిర్మాణాలు చేపట్టింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్యాకేజీ –1 కింద అల్వాల్, మల్కాజిగిరి, కాప్రా, ఉప్పల్, ప్యాకేజీ–2 కింద రాజేంద్రనగర్, ఎల్బీ నగర్ ప్యాకేజీ–3 కింద కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి సర్కిల్ ప్రాంతాల్లో ఎస్టీపీ నిర్మాణాలు చేపట్టగా.. ఇప్పటికే వీటిలో సగం అందుబాటులోకి వచ్చాయి. మిగతావి తుది దశలో ఉన్నట్లు జలమండలి వర్గాలు చెబుతున్నాయి.
హ్యామ్ మోడ్‌లో అమృత్ ఎస్టీపీలు
కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం కింద మంజూరైన 39 ఎస్టీపీలు హ్యామ్ మోడ్‌లో నిర్మించేందుకు జలమండలి ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం అవి టెండర్ దశలో ఉన్నాయి. అందులో ఒక ఎస్టీపీ పీపీపీ మోడ్‌లో.. మిగతా 38 ఎస్టీపీలను హైబ్రిడ్ అన్నూయిటీ మోడల్ (హ్యామ్) విధానంలో నిర్మించనున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే.. 972 ఎంఎల్డీల మురుగును శుద్ధి చేయవచ్చు. వాటి నిర్మాణ పనులు రెండు ప్యాకేజీల్లో పూర్తి చేయనుంది.. ప్యాకేజీ–1లో 16 ఎస్టీపీలను, ప్యాకేజీ–2లో 22 ఎస్టీఛపీలు నిర్మిస్తారు. నిర్మాణ సంస్థ ఎస్టీపీలను నిర్మించి 15 ఏళ్ల పాటు నిర్వహణ చేపట్టాల్సి ఉంది. మొత్తం ఎస్టీపీల నిర్మాణ వ్యయం రూ.2,569.81 కోట్లు కాగా.. 15 ఏళ్ల పాటు నిర్వహణకు రూ.1,279.29 కోట్ల అంచనా వ్యయం కానుంది. ఎస్టీపీల ప్రాజెక్టుల నిర్మాణ వ్యయంలో కేంద్రం 30, రాష్ట్రం 30 నిర్మాణ సంస్థ 40 శాతం చొప్పున నిధులు సమకూర్చనున్నాయి.
తుది దశలో ఉన్న ఎస్టీపీలు
ఎస్టీపీ ఎంఎల్‌డీ
సామర్థ్యం
పాలపిట్ట 7
శివాలయనగర్ 14
ముల్లకత్వ చెరువు 25
నలగండ్ల 7
అత్తాపూర్–1 64
అంబర్‌పేట 212.5
రెయిన్‌బో విస్తా 43.5
రామ చెరువు 30
అత్తాపూర్–2 40
Comments
Please login to add a commentAdd a comment