ఒత్తిడే శత్రువు! | - | Sakshi
Sakshi News home page

ఒత్తిడే శత్రువు!

Published Fri, Feb 7 2025 7:46 AM | Last Updated on Fri, Feb 7 2025 12:13 PM

exam tension

విద్యార్థుల్లో ఆందోళన

మరికొద్ది రోజుల్లో టెన్త్‌, ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల సమయం సమీపిస్తున్నకొద్దీ.. విద్యార్థుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. పరీక్షల్లో తప్పుతామోనని.. కొంత మంది, తల్లిదండ్రులు ఆశించిన దానికంటే తమకు తక్కువ మార్కులు వస్తాయోననే టెన్షన్‌తో మరికొంత మంది తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. బలహీన క్షణంలో ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారు. వార్షిక పరీక్షల వేళ.. విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు ఏ ఒక్క రెసిడెన్షియల్‌ కాలేజీలోనూ కౌన్సిలర్‌ లేకపోవడం కూడా ఈ విపత్కర పరిణామాలకు మరో కారణం. అధ్యాపకులే కాదు తల్లిదండ్రులు కూడా విద్యార్థుల మానసిక స్థితిపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. బలవంతపు బోధన, అభ్యాసన కంటే.. ఇష్టంతో చదివేలా విద్యార్థులను మానసికంగా సంసిద్ధులను చేసినప్పుడు మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరో

ర్యాంకులు, గ్రేడ్లు రద్దు చేశాం

విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వం ఇప్పటికే టెన్త్‌లో ర్యాంకులు, గ్రేడింగ్‌ విధానాన్ని రద్దు చేసింది. ప్రభుత్వ స్కూళ్లలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారిలో మానసిక స్థైర్యాన్ని నింపి, మానసికంగా పరీక్షలకు సంసిద్ధులను చేస్తున్నాం. అర్థం కాని పాఠ్యాంశాలను మళ్లీ వివరించే ప్రయత్నం చేస్తున్నాం. వార్షిక పరీక్షలపై వారిలో ఉన్న భయాన్ని పూర్తిగా పోగొట్టే ప్రయత్నం చేస్తున్నాం. మోడల్‌ పేపర్లను తయారు చేసి, పరీక్షలు రాయిస్తున్నాం.

– సుశీందర్‌రావు, డీఈఓ, రంగారెడి

ప్రేమతో చెప్పాలి

పిల్లల ఆత్మహత్యలకు కాలేజీ యాజమాన్యాలది ఎంత బాధ్యత ఉంటుందో? తల్లిదండ్రులది అంతే బాధ్యత ఉంటుంది. పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకోకుండా వారికి ఇష్టం లేని కోర్సులు, కాలేజీల్లో బలవంతంగా చేర్పిస్తుంటారు. ఈ సమయంలో కనీసం కౌన్సెలింగ్‌ కూడా ఇవ్వడం లేదు. ఒత్తిడికి గురై, ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్నకొద్దీ.. వారిలో ఆందోళన, భయం ఎక్కువై.. ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు వారితో ప్రేమగా వ్యవహరించాలి. మానసిక స్థైర్యం చెప్పాలే గాని.. వారిని తోటి పిల్లలు, బంధువుల ముందు తిట్టకూడదు.

– డాక్టర్‌ కల్యాణ్‌ చక్రవర్తి, మానసిక నిపుణుడ్డు

 ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం

అత్యధిక మార్కులు సాధించాలనే ఉద్దేశంతో చాలా మంది పిల్లలు నిద్రాహారాలు మాని చదువుతుంటారు. అదేపనిగా చదవడం వల్ల తలనొప్పి, మానసిక సంఘర్షణ, కంటిచూపు సమస్య వస్తుంది. తీరా పరీక్షలు మొదలయ్యే నాటకి అనారోగ్యం పాల వుతుంటారు. ఈ సమయంలో పరీక్ష సరిగా రాయలేక..ఫెయిలవుతుంటారు. పిల్లల ఆరోగ్యపై తల్లిదండ్రులు శ్రద్ద చూపించాలి. వేళకు నిద్రపుచ్చడం, వేళకు నిద్రలేపి ఓ ప్రణాళిక ప్రకారం చదివించడం చేయాలి. తేలికగా జీర్ణం అయ్యే అప్పుడే వండివార్చిన తాజా ఆహారం అందించాలి.

– డాక్టర్‌ వెంకటి, డీఎంహెచ్‌ఓ, హైదరాబాద్‌

మచ్చుకు కొన్ని ఇటీవలి ఉదంతాలు..

● ప్రిన్సిపాల్‌ తిట్టాడనే కారణంతో షాద్‌నగర్‌లోని శాస్త్ర పాఠశాల భవనంపై నుంచి దూకి 10వ తరగతి విద్యార్థి నీరజ్‌ బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

● పరీక్షలో ఫెయిల్‌ అవుతాననే భయంతో మైసమ్మగూడ మల్లారెడ్డి మహిళా ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న ఓ విద్యార్థిని కళాశాల నాలుగో అంతస్తు కిటికీ నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు యత్నించగా తోటి విద్యార్థులు గమనించి అడ్డుకున్నారు.

● కుంట్లూరులోని తెలంగాణ గిరిజన రెసిడెన్షియల్‌ కళాశాలలో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న నాగర్‌కర్నూలుకు చెందిన సౌమ్య (17) ఇటీవల తరగతి గదిలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

● చదువు ఒత్తిడి తట్టుకోలేక హైదర్‌నగర్‌ శ్రీ చైతన్య జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతున్న షాద్‌నగర్‌కు చెందిన విద్యార్థి కౌశిక్‌ రాఘవ (17) హాస్టల్‌ గదిలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

● పరీక్ష సరిగా రాయలేదనే కారణంతో జీడిమెట్ల పీఎస్‌ పరిధిలో ఇటీవల పదో తరగతి విద్యార్థిని త్రిష ఆత్మహత్యకు పాల్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement