నగరంలోని ఖైరతాబాద్‌కు చెందిన శ్రీనివాస్ ప్రతి రెండు నెలలకు ఒకసారి ఎల్పీజీ సిలిండర్‌ను ఆన్‌లైన్‌లో బుకింగ్ చేస్తున్నాడు. మూడు నాలుగు రోజుల వ్యవధిలో సిలిండర్ డోర్ డెలివరి కూడా జరుగుతోంది. వంటగ్యాస్‌కు నగదు బదిలీ పథకం అమలవుతుండడంతో మార్కెట్ ధర చెల్లిస్తూ వస్తున్నాడు. కానీ, సబ్సిడీ సొమ్ము మాత్రం బ్యాంక్ ఖాతాలో జమ కావడం లేదు. గత పది మాసాల కాలంలో ఐదు సిలిండర్లు తీసుకున్నా నయా పైసా ఖాతాలో పడలేదు. ఆలస్యంగా గుర్తించిన శ్రీనివాస్ డిస్ట్రిబ్యూటర్ దష్టికి తీసుకెళ్లాడు. ఆన్‌లైన్‌లో పరిశీలించి బ్యాంక్ లింకేజి కట్ అయిందని, తిరిగి పునరుద్ధరించుకోమని ఉచిత సలహా ఇచ్చారు. ఇదీ ఒక శ్రీనివాస్ సమస్య కాదు.. నగరంలో వేలాది మంది వంట గ్యాస్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్య.
సాక్షి, సిటీబ్యూరో: వంట గ్యాస్ సబ్సిడీ సొమ్ము చుక్కలు చూపిస్తోంది. నగదు బదిలీ కింద సబ్సిడీ సొమ్ము బ్యాంక్ ఖాతాలో జమ సమస్యగా తయారైంది. వినియోగదారుడు మార్కెట్ ధర చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తున్నా.. సబ్సిడీ సొమ్ము నగదుగా వెనక్కి జమ అవుతుందన్న నమ్మకం లేకుండా పోయింది. కొందరు వినియోగదారులకు నెలల తరబడి అసలు నగదు జమ అంటూ లేకుండా పోతోంది. ముఖ్యంగా గ్యాస్ సబ్సిడీ కోసం తెరిచిన బ్యాంక్ ఖాతాల్లో సబ్సిడీ నగదు జమకు అనేక సమస్యలు ఆటంకంగా మారాయి. మరోవైపు ఎల్పీజీ సిలిండర్æ బుకింగ్ సమయాల్లో సైతం చిన్న చిన్న తప్పిదాలు బ్యాంక్ లింకేజి బంధంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా గ్యాస్ సబ్సిడీ నెలల తరబడి నిలిచిపోతోంది. గ్యాస్ సబ్సిడీ నగదు రూపంలో జమకు ఒక నిర్దిష్ట సమయం అంటూ లేక పోవడంతో వినియోగదారులు గుర్తించే సరికి నాలుగైదు సిలిండర్లు డోర్ డెలివరీ అవుతున్నాయి. ఆలస్యంగానైనా గుర్తించి డిస్ట్రిబ్యూటర్ దష్టికి తీసుకెళ్లితే సబ్సిడీ నగదు సొమ్ము జమ తమకు సంబంధం లేదంటూ చేతులేత్తుస్తూ ఒక ఉచిత సలహా పారేయడం సర్వసాధారణంగా తయారైంది. వాస్తవంగా పథకం అమలు ఆరంభంలో కొంత ఇబ్బందులు ఎదురైనా ఆ తర్వాత సక్రమంగానే బ్యాంక్ ఖాతాలో సబ్సిడీ సొమ్ము జమ అవుతూ వచ్చింది. కానీ, తిరిగి పాత పరిస్థితి ఇప్పుడు పునరావృతం అవుతోంది.
వినియోగంలో లేకుంటే అంతే....
వంట గ్యాస్ కనెక్షన్‌కు అనుసంధామైన బ్యాంక్ ఖాతా వినియోగంలో లేకుంటే సబ్బిడీ సొమ్ము వెనక్కి వెళ్తోంది. కొందరు వినియోగదారులు వంట గ్యాస్ సబ్సిడీ కోసం ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతాలు తెరిచి వాటిని అనుసంధానం చేయించారు. కేవలం ఆ ఖాతాలు సబ్సిడీ సొమ్ముకు పరిమితం కావడంతో కనీస నగదు లేక కొన్నిసార్లు ఇన్‌యాక్టివ్ అవుతుంటాయి. దీంతో బయట నుంచి వచ్చిన సొమ్ము ఖాతాలో జమ కావడానికి సాంకేతిక సమస్యలు తయారవుతున్నాయి. దీంతో గ్యాస్ సబ్సిడీ కాస్త ఆయిల్ కంపెనీలకు వెళ్లిపోతుంది. ఒక సారి సబ్సిడీ వెనక్కి వస్తే ఆ తర్వాత సబ్సిడీ విడుదల నిలిచిపోతుంది. బ్యాంక్ లింకేజి బంధం కూడా తెగిపోతుంది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ బుకింగ్ సమయాల్లో సైతం పొరపాటున గ్యాస్ సబ్సిడీ వదులుకునే ఆప్షన్‌కు నెంబర్ ప్రెస్ అయితే సబ్సిడీ కాస్త నిలిచిపోయి బ్యాంక్ లింకేజి బంధం తెగుతోంది. దీంతో సబ్సిడీ సొమ్ము అందడం లేదు.
బ్యాంక్ లింకేజీనిపునరుద్ధరించుకోవాలి
వంట గ్యాస్ కనెక్షన్‌తో అనుసంధానమైన బ్యాంక్ ఖాతా వినియోగంలో లేకుంటే సబ్సిడీ నగదు జమ కాదు. బుకింగ్ సమయంలో గ్యాస్ సబ్సిడీ వదలుకునే ఆప్షన్ పొరపాటున నొక్కినా సబ్సిడీ నిలిచిపోతుంది. బ్యాంక్ లింకేజి కట్ అవుతోంది. సబ్సిడీ సొమ్ము కావాలంటే బ్యాంక్ ఖాతాలను వినియోగంలోకి తీసుకొని రావాలి. తిరిగి బ్యాంక్ ఖాతాలను గ్యాస్ కనెక్షన్‌తో అనుసంధానం చేసుకొవాలి. బ్యాంక్ లింకేజీలను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది.– అశోక్‌కుమార్, అధ్యక్షుడు, వంటగ్యాస్ డీలర్ల సంక్షేమ సంఘం, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment