బీపీఎల్ కుటుంబాలు సైతం దూరమే
కొందరికే పరిమితమైన సబ్సిడీ
నిబంధనలపై స్పష్టత లేని అధికారులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడు నెలలు గడుస్తోంది.. కానీ.. రూ.500కు వంటగ్యాస్ అమలు మాత్రం పేద కుటుంబాలకు అందని ద్రాక్షగా మారింది. ఆరు గ్యారంటీలలో భాగంగా సిలిండర్‌పై సబ్సిడీ అందిస్తున్నా.. మెజార్టీ బీపీఎల్ కుటుంబాలకు వర్తించకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. పేద కుటుంబాలు గృహాలక్ష్మి పథకానికి అర్హత సాధించినా.. మహాలక్ష్మి పథకం మాత్రం అందని దారక్షగా తయారైంది.
లోక్‌సభ ఎన్నికల ముందు గ్యాస్ సబ్సిడీ వర్తింపు అమలు ప్రారంమైంది. ఆరు నెలల క్రితం నిర్వహించిన ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా బీపీఎల్ కుటుంబాలను గుర్తించారు. మిగతా పథకాల మాదిరి మహాలక్ష్మి పథకానికి కూడా తెల్లరేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నారు. కానీ పథకం వర్తింపు మాత్రం కొందరికే వర్తింపజేయడంతో నిరుపేదల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ నిబంధనలపై పౌరసరఫరాల అధికారులతో పాటు ఆయిల్ కంపెనీలకు సైతం స్పష్టత కరువైంది.
ఇది పరిస్థితి..
గ్రేటర్ పరిధిలో గృహోపయోగ వంట గ్యాస్ కనెక్షన్లు 30.18 లక్షలపైగా ఉండగా అందులో సుమారు 24.74 లక్షల కుటుంబాలు మహాలక్ష్మి పథకం కింద రూ. 500కు వంట గ్యాస్ సిలిండర్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో సుమారు 19.01 లక్షల కుటుంబాలు మాత్రమే తెల్లరేషన్ కార్డులు కలిగి ఉన్నాయి. దరఖాస్తుదారుల్లో కేవలం 10 శాతం కుటుంబాలకు కూడా సబ్సిడీ వర్తించకపోవడం గమనార్హం.
నగదు జమ రూ.40.71
గృహోపయోగ వంట గ్యాస్ వినియోగదారులుకు బ్యాంక్ ఖాతాలో నగదు బదిలీ పథకం కింద సబ్సిడీ రూ. 40.71 మాత్రమే జమ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధరతో నిమిత్తం లేకుండా వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో పరిమితంగా నగదు జమ చేస్తోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ ప్రకారం 14.5 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.855. పలుకుతోంది. గృహ వినియోగదారులందరూ సిలిండర్ ధరను పూర్తిగా చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థల ద్వారా సబ్సిడీని నగదు బదిలీ కింద వినియోగదారుల ఖతాలో జమ చేస్తూ వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గత మూడు నెలలుగా ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా కొందరు లబ్ధిదారులకు మాత్రమే సిలిండర్ ధరలో రూ. 500 మినహాయించి మిగిలిన సొమ్మును నగదు బదిలీ ద్వారా వినియోగదారుల ఖాతాలో వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment