కాంపిటీటివ్ కౌన్సెలింగ్
సివిల్స్ మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్-3లో సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎలా సిద్ధమవ్వాలి?
- టి.కృష్ణప్రియ, కరీంనగర్.
సివిల్స్ మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్-3లో ఆర్థికాభివృద్ధి, టెక్నాలజీ, జీవవైవిధ్యం, పర్యావరణం, భద్రత, విపత్తు నిర్వహణ అనే అంశాలున్నాయి. వీటి నుంచి దాదాపు 25 ప్రశ్నల వరకు అడుగుతున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోడైవర్సిటీ, సెక్యూరిటీ, మేధో సంపత్తి హక్కులు, డిజాస్టర్ మేనేజ్మెంట్లో ప్రశ్నలన్నీ దాదాపు సమకాలీన అంశాలపైనే ఉంటున్నాయి. ముఖ్యంగా సోషల్ నెట్వర్కింగ్ సైట్లు.. వీటి ద్వారా భద్రత ఏవిధంగా ప్రభావితమవుతుంది?
తీసుకోవాల్సిన చర్యలు వంటివాటిపై గత పరీక్షల్లో ప్రశ్నలు ఇచ్చారు. సైబర్ సెక్యూరిటీలో భాగంగా.. సైబర్ వార్ఫేర్ అనేది ఉగ్రవాదం కంటే ఏవిధంగా తీవ్రమైంది? భారత్ ఏవిధంగా దాని ప్రభావానికి గురవుతోంది? భారత్‌లో ఈ అంశానికి చెందిన సంసిద్ధత ఎలా ఉంది? వంటివాటిపై కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ఇలా అన్ని ప్రశ్నలు దాదాపుగా సమకాలీన అంశాలతో ముడిపడి ఉన్నాయి. ప్రశ్నలన్నీ సమకాలీన సమస్యలపై అప్లికేషన్ ఓరియంటెడ్ విధానంలో ఉంటున్నాయి.
అభ్యర్థి సమగ్ర ఆలోచనా విధానాన్ని, వ్యక్తిత్వాన్ని అంచనా వేసేలా ప్రశ్నల కూర్పు ఉంటోంది. కాబట్టి ఒక అంశానికి సంబంధించిన ప్రాథమిక భావనలతోపాటు దానితో ముడిపడి ఉన్న వర్తమాన అంశాలన్నింటిపై అవగాహన పెంచుకోవాలి. దీనికోసం విస్తృతంగా అధ్యయనం చేయాలి. దినపత్రికల్లో వచ్చే విశ్లేషకుల ఆర్టికల్స్‌ను తప్పనిసరిగా చదవాలి.