ఇద్దరు మహిళల చేతుల్లో మాల్యా తలరాత
లండన్ : భారతీయ బ్యాంకులకు రూ. 9 వేల కోట్లకు కుచ్చుటోపీ పెట్టి బ్రిటన్‌లో దర్జాగా బతుకుతున్న విజయ్ మాల్యా తలరాతను ఇద్దరు మహిళలు శాసించనున్నారు. బ్రిటన్‌లో తలదాచుకుంటున్న విజయ్‌మాల్యాను అప్పగించాలని భారత్ కేసు వేసిన విషయం తెలిసిందే. ఈ కేసు సోమవారం విచారణకు రానుంది. వరుసగా ఎనిమిది రోజుల పాటు లండన్‌లో ఓ ప్రత్యేక కోర్టు ఈ కేసును విచారించనుంది.
అయితే, ఈ కేసు విచారణలో ఇద్దరు బ్రిటిష్ మహిళలు కీలక పాత్ర పోషించనున్నారు. వారిలో ఒకరు మాల్యా తరఫు వాదించనున్న క్లేర్మాంట్గోమెరీ, మరొకరు చీఫ్ మేజిస్ట్రేట్ ఎమ్మా అర్బత్నోట్(57). క్లేర్ మాంట్గోమెరీ(30), బ్రిటిష్ రాణి వద్ద న్యాయవాదిగా పని చేస్తున్నారు. అంతర్జాతీయ క్రిమినల్ చట్టాలు, నేరస్తుల అప్పగింత వంటి కేసుల్లో క్లేర్‌కు ఏళ్ల అనుభవం ఉంది.
కేసులో వాదోపవాదనలు విన్న అనంతరం విజయ్ మాల్యాను అప్పగించాలా? వద్దా? అనే నిర్ణయాన్ని తీసుకునే వారిలో చీఫ్ మేజిస్ట్రేట్ ఎమ్మా అర్బత్నోట్ ఒకరు. నేరస్తుల అప్పగింత కేసుల్లో ఎమ్మాకు సంవత్సరాల అనుభవం ఉంది. కొద్దిరోజుల క్రితం విచారణలో భాగంగా.. ‘మీరు తీసుకున్న కోట్ల రూపాయలను తిరిగి చెల్లిస్తారా?’ అని కోర్టు మాల్యాను ప్రశ్నించింది.
ఇందుకు స్సందించిన మాల్యా ‘నిజాలు తెలుసుకోకుండా మిలియన్ల పౌండ్ల గురించి మీరు మాట్లాడుతున్నారు’ అని సమాధానం ఇచ్చారు. కాగా, సోమవారం నుంచి జరగనున్న కేసు విచారణలో భారత్ తరఫున లండన్‌కు చెందిన ‘ది క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్’ వాదనలు వినిపించనుంది.