విద్యార్థి ఆత్మహత్యాయత్నం
అనారోగ్యంతో ఇంటికెళ్లొచ్చిన పదో తరగతి విద్యార్థి విషయంలో ఓ కార్పొరేట్ స్కూల్ యాజమాన్యం నిరంకుశంగా ప్రయత్నించింది. గాయపరిచేలా ప్రవర్తించడంతో ఆ పసి హృదయం తట్టుకోలేకపోయింది. చివరకు పురుగుల మందు తాగి ఈ లోకం నుంచే నిష్ర్కమించాలనుకుంది. ఈ సంఘటన కలకలం సృష్టించగా..విద్యార్థి సంఘాల రంగంలోకి దిగాయి. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. చివరకు పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
⇒ అనారోగ్యంతో ఇంటికెళ్లి తిరిగొచ్చిన ఫలితం
⇒ ఇంటికెళ్లినందుకు రోజుకు రూ.200 ఫైన్ కట్టాలన్న పాఠశాల యాజమన్యం
⇒ అవమానభారంతో పురుగుల మందు తాగిన విద్యార్థి
⇒ రంగంలోకి దిగిన విద్యార్థి సంఘాల ప్రతినిధులు
⇒ పాఠశాలలోకి జొరబడేందుకు యత్నం, పోలీసుల లాఠీచార్జ్
⇒ ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలు
నంద్యాల టౌన్ : నంద్యాల సంజీవనగర్‌లోని సెయింట్ జాన్స్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న నందన్ అనే విద్యార్థి ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహ త్యం చేశాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.
ఎందుకిలా జరిగిందంటే..
గత నెల 24న నందన్ తను చదువుతున్న పాఠశాలలోనే అస్వస్థతకు గురయ్యాడు. విశ్రాంతి తీసుకోవాలని సిబ్బంది ఇంటికి పంపారు. కోలుకున్న తర్వాత పాఠశాలకు వెళ్లిన నందన్‌ను సెలవు తీసుకున్నందుకు రోజుకు రూ.200 అపరాధ రుసుం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన నందన్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
అధికారులకు ఫిర్యాదు
పాఠశాలలో జరిగిన సంఘటనపై బాధిత విద్యార్థి నందన్ తల్లిదండ్రులు డిప్యూటీ డీఈఓ తాహేరా సుల్తానా సహా ఎంఈఓ శంకర్‌ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు.
విద్యార్థి సంఘాల ప్రవేశంతో...
విద్యార్థి విషయంలో మానవత్వం లేకుండా ప్రవర్తించిన పాఠశాల యాజమాన్యం వైఖరిని నిర సిస్తూ ఏపీవీఎఫ్, ఆర్వీఎఫ్, ఎస్ఎఫ్ఐ తదితర విద్యార్థి సంఘాల ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి కారణమైన పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థులను హింసిస్తున్న పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని, యాజమాన్యంపై కేసులు బనాయించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నందన్ అనే విద్యార్థి విషయంలో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నినదించారు. ఒక దశలో సహనం కోల్పోయిన విద్యార్థి సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాఠశాలలకు జొరబడేందుకు యత్నించారు.
విద్యార్థులపైకి దూసుకెళ్లిన పోలీసులు
పాఠశాల ప్రధాన గేట్లు దూకి లోపలికి వెళ్లేందుకు యత్నించిన విద్యార్థి సంఘాలు, కార్యకర్తలు, విద్యార్థులపై పోలీసులు విరుచుకుపడ్డారు. వారిపైకి దూసుకెళ్లి లాఠీ చార్జ్ చేశారు. ఘటనలో ఇద్దరు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. చివరకు డిప్యూటీ డీఈఓ తాహేనా సుల్తానా ఇచ్చిన హామీ మేరకు వారు శాంతించారు. ఫీజులు, అపరాధ రుసుం పేరుతో విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్న సెయింట్ జాన్స్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆర్వీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాజునాయుడు, ఏపీవీఎఫ్ జిల్లా అధ్యక్షుడు నవీన్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఎంఆర్ నాయక్ వేర్వేరు ప్రకటనలో డిమాండ్ చేశారు.