గ్రీన్విచ్ కంటే ముందే మనకో కాలమానం!
న్యూఢిల్లీ: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) ఆరో తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పుస్తకంలో పలు మార్పులు చేసింది. గ్రీన్విచ్ కాలమానం కంటే ముందే మన దేశానికి సొంత కాలమానం ఉందని, దీనిని ‘మధ్య రేఖ’ అని పిలుస్తారని పేర్కొంది. బీఆర్ అంబేద్కర్ అనుభవాలను, ఎదుర్కొన్న కుల వివక్ష పాఠాన్ని కూడా కుదించింది. హరప్పా నాగరికతను కొత్త పాఠ్య పుస్తకంలో ‘సింధు–సరస్వతి’గా పేర్కొంది. నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా పాఠశాల విద్య కోసం కొత్త జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్ వర్క్–2023కు అనుగుణంగా ఎన్సీఈఆర్టీ కొత్త సిలబస్‌ను సిద్ధం చేస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో 6వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకంలో పలు మార్పులు చేసింది. గ్రీన్విచ్ కాలమానమే ప్రధాన కాలమానం కాదని, దానికంటే శతాబ్దాల ముందు యూరప్, భారత్‌లకు సొంత కాలమానాలున్నాయని పేర్కొంది. దానిని మధ్య రేఖ (మిడిల్ లైన్) అని పిలిచేవారని, అది ఖగోళ శాస్త్రానికి ప్రసిద్ధి చెందిన ఉజ్జయినీ నగరం (ఉజ్జయిన్) గుండా వెళ్లిందని వివరించింది. అలాగే కొత్త పాఠ్యపుస్తకంలో ‘భారత నాగరికత ప్రారంభం’ అనే అధ్యాయంలో సరస్వతి నదికి ప్రముఖ స్థానం ఉందని, ప్రజలను వర్ణాలుగా విభజించారని, శూద్రులను, స్త్రీలను వేదాలను అధ్యయనం చేయనీయలేదని పాత పాఠ్య పుస్తకంలో ఉండగా.. వ్యవసాయదారుడు, నేత, కుమ్మరి, బిల్డర్, వడ్రంగి, వైద్యుడు, నర్తకి, మంగలి, పూజారివంటి వృత్తులను వేదాల్లో పేర్కొన్నట్లు కొత్త పుస్తకాల్లో పేర్కొంది. పాత పుస్తకంలోని నాలుగు అధ్యాయాల్లో ఉన్న చాణక్యుడి అర్థశాస్త్రం, గుప్తులు, పల్లవులు, చాళుక్యుల రాజవంశాలు, అశోకుడు చంద్రగుప్త మౌర్యుల రాజ్యాల కథనాలను కొత్త పుస్తకంలో తొలగించింది.