దేశీ కట్టీలో జర్మన్ బ్యూటీ క్లాడియా
అక్షయ్ కుమార్ సినిమా ఖిలాడీ 786లో మెరిసిన జర్మన్ మోడల్ క్లాడియా సీస్లా మరో హిందీ సినిమాలోనూ చాన్స్ సంపాదించుకుంది. దేశీ కట్టీలో ఐటెమ్‌సాంగ్ ద్వారా యువతకు హుషారెక్కించనుంది. ‘ఖిలాడీలో బల్మా పాట తరువాత కూడా చాలా అవకాశాలు వచ్చాయి కానీ, అవేవీ నచ్చకపోవడంతో ఒప్పుకోలేదు. దేశీ కట్టీలోని పట్నీవాలీ హూ పాట బాగా నచ్చింది. బీహార్, ఉత్తరప్రదేశ్‌లోని జానపద గేయమిది. కొంటెగా అనిపిస్తుంది’ అని క్లాడియా చెప్పింది. దేశీ కట్టీ ఆగస్టు 28న థియేటర్లకు వస్తుంది. ఇక పట్నీవాలీ పాటకు కైలాష్ ఖేర్ సంగీతం అందించగా, రేఖా భరద్వాజ్ పాడింది. ఈ పాటలో క్లాడియా హుషారుగా నర్తిస్తుంటే చుట్టూ తుపాకులతో ఉండే సాయుధులు కూడా స్టెప్పులేస్తుంటారు.
ఒక గ్రామంలో తీసిన ఈ పాటకు విష్టుదేవా కొరియోగ్రఫీ అందించాడు. ‘ఈ పాట కోసం బాగా కష్టపడ్డాను. బిపాసాబసు ఐటెంసాంగ్ నమక్ మాదిరిగానే ఇదీ ఉంటుంది కాబట్టి ఆ పాటను చాలాసార్లు చూశాను. విష్టు నుంచి స్టెప్పులు నేర్చుకోవడానికి కూడా చాలా సమయమే పట్టింది. ఇతడు అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడు. స్టెప్పులు చాలా బాగుంటాయి’ అని క్లాడియా వివరించింది. కత్రినా కైఫ్, కరీనా కపూర్, ప్రియాంకా చోప్రా వంటి పెద్ద హీరోయిన్లు కూడా ఐటెంసాంగులకు ఓకే అంటుండడంతో వీటికి బాలీవుడ్లో గిరాకీ బాగానే ఉంది. హిందీ డ్యాన్సింగ్ బ్యూటీల్లో నీకు ఎవరంటే ఇష్టమన్న ప్రశ్నకు బదులుగా ‘మలైకా అరోరా’ అని క్లాడియా చెప్పింది. దిల్ సేలోని ఛయ్య ఛయ్య పాట చూసిన తరువాత ఆమెకు అభిమానిగా మారిపోయానని, మలైకతోపాటు డ్యాన్స్ చేయాలని ఉందని తెలిపింది. కలర్స్ చానల్ రియాల్టీ షో బిగ్‌బాస్ ద్వారా అక్షయ్‌కుమార్‌కు పరిచయం కావడంతో ఈమెకు ఖిలాడీ 786లో అవకాశం దక్కింది. ప్రస్తుతం ఇండియాలోనే ఉంటున్న క్లాడియాకు పూర్తిస్థాయి హీరోయిన్గా మాత్రం ఇంకా అవకాశం రాలేదు.