నా మరణంతోనే దీక్ష ముగింపు: అగర్వాల్
సాక్షి, న్యూఢిల్లీ : కొంత మంది ప్రాణాలకు ఎప్పటికీ విలువ కట్టలేం. అలాంటి కోవకు చెందిన అతి కొద్ది మందిలో గంగా ప్రక్షాళన కోసం తన ప్రాణాలను అర్పించిన ప్రముఖ పర్యావరణ వేత్త జీడీ అగర్వాల్ (86) ఒకరు. సాధ్యమైనంత త్వరగా గంగా నదిని ప్రక్షాళించాలని, అది నిరంతరం ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని, అందుకోసం గంగా ఉప నదులపై చేపట్టిన జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాలను నిలిపివేయాలని, ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేస్తూ 111 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న అగర్వాల్ గురువారం నాడు రూర్కెలాలోని ఏయిమ్స్ ఆస్పత్రిలో మరణించారు. అంతకుముందు తేనె మంచి నీళ్లను మాత్రమే తీసుకున్న అగర్వాల్ తన ఉద్యమాన్ని తీవ్రం చేయడంలో భాగంగా అక్టోబర్ 9వ తేదీ నుంచి తేనె మంచి నీళ్లను కూడా మానేశారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఆయన్ని బలవంతంగా బుధవారం నాడు రూర్కెలా ఆస్పత్రికి తరలించారు. ఆయన్ని ఢిల్లీలోని ఏయిమ్స్‌కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆయన అందుకు అంగీకరించలేదు. చివరకు గురువారం నాడు కన్నుమూశారు.
స్వామి జ్ఞాన్ స్వరూప్ సనంద్‌గా కూడా సుపరిచితుడైన అగర్వాల్, మామూలు నిరసనకారుడో, మొండి పర్యావరణ వేత్తనో కాదు. ఉన్నత విద్యావంతుడు. కాన్పూర్ ఐఐటీలో సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చైర్మన్‌గా పనిచేశారు. నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ బోర్డు సభ్యుడిగా, కేంద్ర కాలుష్య నియంత్రణా బోర్డు మొట్టమొదటి సభ్య కార్యదర్శిగా పనిచేశారు. దేశంలోని నదుల పరిరక్షణ కోసం వివిధ స్థాయిల్లో, వివిధ రీతుల్లో ప్రభుత్వంతో కలసి పనిచేశారు. నదుల పరిరక్షణ కోసమే ఆయన 2008 నుంచి 2012 మధ్య నాలుగు సార్లు ఆమరణ దీక్షలు చేశారు. గంగా నదీ జలాల ప్రక్షాళన గురించి కేంద్రం పట్టించుకోవడం లేదన్న కారణంగా ఆయన ‘నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ’ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశారు. మిగతా సభ్యులను కూడా రాజీనామా చేయాల్సిందిగా ఒత్తిడి చేశారు.
ఈసారి తప్ప ఆయన ఎప్పుడు నిరాహార దీక్ష చేసినా దాన్ని ప్రభుత్వం సీరియస్‌గానే తీసుకుంది. గంగానదిలో కలిసే ప్రధాన నదుల్లో ఒకటైన భగీరథిపై డ్యామ్‌ల నిర్మించరాదంటూ అగర్వాల్ 2010, జూలైలో నిరాహార దీక్ష చేపట్టారు. అప్పటి పర్యావరణ, అటవి, వాతావరణ మార్పుల శాఖ మంత్రి జైరామ్ రమేశ్ స్వయంగా వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. డిమాండ్లను అంగీకరించి దీక్షను విరమింప చేశారు.
పోలీసుల ప్రవర్తనపై కేసు
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో అగర్వాల్ జూన్ 22వ తేదీన తన డిమాండ్ల పరిష్కారం కోరుతూ నిరాహార దీక్షకు కూర్చున్నారు. జూలై 10వ తేదీన పోలీసులు రంగప్రవేశం చేసి బలవంతంగా ఆయన్ని గుర్తుతెలియని చోటుకు తరలించారు. ఆ మరుసటి రోజు వారి చెర నుంచి విడుదలైన అగర్వాల్ పోలీసు చర్యను సవాల్ చేస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టులో కేసు పెట్టారు. తాను శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలిగించకుండా శాంతియుతంగా దీక్ష చేస్తుంటే అనవసరంగా పోలీసులు జోక్యం చేసుకున్నారని, తన అనుచరుల పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు.
ప్రాణాలకు ముప్పన్నా పట్టించుకోలేదు!
అగర్వాల్‌తో సంప్రతింపులు జరిపి వచ్చే 12 గంటల్లోగా సమస్యను పరిష్కరించాలని కోరతూ ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు జూలై 12వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. గంగా నదిలో కలిసే భగీరథి, పల్మనారి, లోహరి నాగ్‌పాల్, భెరోఘాటి నదులపై విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిలిపివేయాలని అగర్వాల్ డిమాండ్ చేశారు. ఈ అంశం తన పరిధిలో లేదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేతులు దులిపేసుకున్నారు. రామన్ మెగసెసె అవార్డు, స్టాక్‌హోమ్ వాటర్ ప్రైజ్ గ్రహీత, ప్రముఖ జల వనరుల కార్యకర్త రాజేంద్ర సింగ్ జోక్యం చేసుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి స్వయంగా ఓ లేఖ రాశారు. అగర్వాల్ ప్రధాన డిమాండైన నదులపై డ్యామ్‌ల నిర్మాణాన్ని నిలిపివేయాలని, కేంద్ర ప్రభుత్వం 2017లోనే ప్రతిపాదించిన ‘గంగా ప్రొటెక్షన్ అండ్ మేనేజ్మెంట్’ బిల్లును ఆమోదానికి చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో రాజేంద్ర సింగ్ డిమాండ్ చేశారు. అప్పటికీ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న అగర్వాల్ ప్రాణాలకు ముప్పు ఉందని కూడా ఆయన ఆ లేఖలో హెచ్చిరించినట్లు తెలుస్తోంది. అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు.
నా మరణంతో దీక్ష ముగింపు: అగర్వాల్
హరిద్వార్‌లో 109 రోజుల పాటు కేవలం కొంచెం తేనే, మంచినీరు తీసుకుంటూ నిరాహార దీక్ష కొనసాగించిన అగర్వాల్ సెప్టెంబర్ 9వ తేదీన తాను ఇక నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనని శపథం చేశారు. ‘నా చావుతోనే నా దీక్ష ముగుస్తుంది’ అని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకొని సెప్టెంబర్ పదవ తేదీన ఆయన్ని హరిద్వార్ నుంచి రూర్కెలాలోని ఏయిమ్స్‌కు తరలించారు. అప్పటికే 9 కిలోల బరువు తగ్గిన అగర్వాల్ ఆరోగ్యం మరింత క్షీణించి కన్నుమూశారు. గంగా ప్రక్షాళన పనుల్లో జాప్యం జరిగితే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని, 2018. జూలైలోగా గంగా ప్రక్షాళన జరక్కపోతే అదే గంగా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని (2017, ఫిబ్రవరి 22న) శపథం చేసిన కేంద్ర మంత్రి ఉమా భారతి ఇప్పటికీ నిక్షేపంగా ఉండడమే కాకుండా బరువు తగ్గిన దాఖలాలు కూడా లేవు.
చదవండి: గంగా ప్రక్షాళన గంగపాలు!