సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలకే కొత్త పేర్లు పెట్టడంలో పేరుపొందిన నరేంద్ర మోదీ ప్రభుత్వం గంగా ప్రక్షాళన పథకానికి ప్రాధాన్యత ఇవ్వడం కోసం అనేక కొత్త పేర్లను తీసుకొచ్చింది. మోదీ ప్రభుత్వం రాకముందున్న ‘వాటర్ రిసోర్సెస్ మినిస్ట్రీ (జలవనరుల మంత్రిత్వ శాఖ)’ని ‘మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్‌మెంట్ అండ్ గంగా రిజ్వునేషన్ (జల వనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుద్ధరణ మంత్రిత్వ శాఖ)’గా మార్చింది. ‘ది నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ’ని ‘నేషనల్ గంగా కౌన్సిల్’గా మార్చింది.
2015లో నమామి గంగా ప్రాజెక్ట్‌ను ప్రారంభించి 20 వేల కోట్ల రూపాయలను కేటాయించారు. అప్పటి జలవనరుల శాఖ మంత్రి గంగా ప్రక్షాళన పథకాన్ని 2018, జూలై నెలలోగా పూర్తి చేస్తామని శపథం చేయగా, 2019లో పూర్తి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ వాగ్దానం చేశారు. ‘గంగా రిజ్వునేషన్ బేసిన్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్’ అంటూ కేంద్ర ప్రభుత్వం ఓ నివేదికను కూడా తీసుకొచ్చింది. సలహాలు, సూచనల కోసం ఈ నివేదికను వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలకు పంపించాల్సి ఉండగా, ఇంతవరకు ఏ మంత్రిత్వ శాఖకు పంపించిన దాఖలాలు లేవు. నేషనల్ రివర్ గంగా (రిజువినేషన్, ప్రొటెక్షన్, మేనేజ్‌మెంట్) బిల్‌ను 2017లో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది. గంగా ప్రొటెక్షన్ కోర్ పేరిట ఓ సాయుధ దళం ఏర్పాటుకు, గంగా కాలుష్యానికి కారకులవుతున్న వారికి భారీ నష్ట పరిహారం, జైలు విధించేందుకు ఈ బిల్లును తీసుకొచ్చారు. గంగా ప్రక్షాళనకు స్వయం ప్రతిపత్తి గల సంఘాన్ని ఏర్పాటు చేయకుండా, నిపుణులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేయకుండా బిల్లును తీసుకరావడం ఏమిటని గంగా ప్రక్షాళన కోసం గురువారం నాడు ప్రాణాలర్పించిన అగర్వాల్ నాడు ప్రశ్నించారు.
కాలుష్యానికి కారకులవుతున్న వారికి రెండు నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకు అవకాశం ఉన్న ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఆమోదించలేదు. ఈలోగా కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ గంగా ప్రక్షాళన పనులను పక్కన పెట్టి గంగా, బ్రహ్మ పుత్ర నదుల అనుసంధానంపై దృష్టిని కేంద్రీకరించింది. 2002లో అప్పటి అటల్ బిహారి వాజపేయి ప్రతిపాదించిన ఈ పథకానికి 8,700 కోట్ల డాలర్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. నదుల అనుసంధానం వల్ల దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు జల వనరులు అందుబాటులో ఉంటాయని, వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందిగానీ, నదుల అనుసంధానం వల్ల పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు కెన్–బెట్వా నదుల అనుసంధానం వల్ల పన్నా టైగర్ రిసర్వ్‌లో ఎక్కువ భాగం నీట మునిగి పోతుంది.
ఉత్తరాఖండ్‌కు 2013లో భారీ వరదలు రావడంతో ఏకంగా ఆ రాష్ట్రంలో కొనసాగుతున్న 24 జల విద్యుత్ ప్రాజెక్ట్ పనులను సుప్రీం కోర్టు నిలిపివేసింది. వాటిని పునర్ సమీక్షించాల్సిందిగా కోరుతూ జల వనరులు, పర్యావరణ మంత్రిత్వ శాఖలు సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. గంగా ప్రక్షాళన కార్యక్రమాలపై గత నాలుగేళ్లుగా నేతల ఊక దంపుడు ఉపన్యాసాలేగానీ, చెప్పుకోతగ్గ పురోగతి మాత్రం సాధించలేదు. అదే గనుక జరిగి ఉంటే నేడు అగర్వాల్ ప్రాణాలు పోయేవి కావు.
Comments
Please login to add a commentAdd a comment