క్లౌడ్ స్టోరేజ్‌లో బెస్ట్, బెటర్...
క్లౌడ్ డ్రైవ్స్లేని టెక్ జీవితం కష్టతరంగా మారింది. ఇవి అందుబాటులోకి రాకముందు డాటాను సెండ్ చేసుకోవడంలో ఎన్ని కష్టాలు పడినా... ఇప్పుడు మాత్రం వీటిని ఉపయోగించుకోవడం సులభం. డాటా మొత్తాన్ని ఆన్లైన్లో సేవ్ చేసుకుని అవసరమైనప్పుడు, అవసరమైనచోట వాటిని యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే ‘క్లౌడ్ స్టోరేజ్’ ఇచ్చే సదుపాయం. హార్డ్ డిస్క్ ఉన్నట్టుండి క్రాష్ అయినా, పీసీ అందుబాటులో లేకపోయినా, ఫార్మాట్ అయినా, పొరపాటున డిలీట్ అయినా, క్లౌడ్ స్టోరేజ్‌లో డాటాను దాచి ఉంచడం ఉపయోగకరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్, అప్లికేషన్ల రూపంలో అందుబాటులో ఉన్న క్లౌడ్‌స్టోరేజ్ సర్వీసుల గురించి...
బెస్ట్ ఆఫ్ ఓవరాల్ డ్రైవ్స్..
జీ మెయిల్ ద్వారా కొంచెం ఎక్కువ డాటాను పంపాలంటే.. వెంటనే పలకరించే పరిమితులు పోయాయి. 25 ఎమ్బీ ని మించిన డాటాను పంపాలంటే.. అవకాశమే లేదు అనే రోజులు పోయాయి... టక్కున గూగుల్ డ్రైవ్ ప్రత్యక్షం అవుతోంది. డోంట్ వర్రీ. మీరు గూగుల్‌డ్రైవ్ ద్వారా డాటాను పంపండి... అనే సజెషన్ వస్తుంది. జీమెయిల్ ద్వారా అవసరమైన డాటాను పంపడానికి అవకాశం దొరుకుతోంది. ఇదంతా క్లౌడ్ స్టోరేజ్ పుణ్యమే. ఫైల్స్‌ను ముక్కలుగా చేసి పంపేరోజులు పోయి, ఒకేసారి మొత్తంగా పంపడానికి అవకాశముంది. జీమెయిల్, గూగుల్ ప్లస్‌ల విషయంలో గూగుల్ డ్రైవ్ ఉపయోగకరంగా ఉంది. వీటి ద్వారా డాటాను పంపడానికి, డాటాను సేవ్ చేసుకోవడానికి గూగుల్ డ్రైవ్ సాయమందిస్తుంది. 15 జీబీ స్టోరేజ్‌ను ఉచితంగా అందిస్తుంది. గూగుల్ డ్రైవ్‌ను విండోస్ ఫోన్ కోసం అప్‌గ్రేడ్ చేయలేదు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ లపై పనిచేస్తుంది.
విండోస్ విషయంలో బెస్ట్..
మైక్రోసాఫ్ట్ అందిస్తున్న సేవ ఇది. విండోస్ - 8 ఆపరేటింగ్ సిస్టమ్స్ లుక్ అండ్ ఫీల్‌ను మార్చేసిన ఫీచర్ ఇది. బిల్ట్ ఇన్ అప్లికేషన్‌గా ఇది విండోస్ - 8 ను ప్రభావితం చేసింది. 7 జీబీ వరకూ ఉచిత స్టోరేజీకి అవకాశం ఉంటుంది. విండోస్ ఓఎస్ పై పనిచేసే డెస్క్టాప్ను వాడేవారికి, ఫోన్ వాడేవారికి ఉపయోగకరమైనది. ఉచిత పరిమితి దాటిపోతే, తక్కువ ధరలోనే ఎక్కువ స్టోరేజ్ స్పేస్ అందిస్తుంది స్కై డ్రైవ్. విండోస్ ఓఎస్ విషయంలో బెస్ట్ స్కై డ్రైవ్.
బెస్ట్ ఆఫ్ ఫ్రీ సర్వీస్..
వెబ్‌సైట్స్ నడిపేవారికి ఇది బెస్ట్ ఫ్రీ సర్వీస్. 50 జీబీ డాటాను అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సైట్ లో లింక్ ఇచ్చి డాటాను నెట్లో అందుబాటులో పెట్టడానికి అవకాశం ఉంది.
వన్ ఆఫ్ ది బెస్ట్..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది మెచ్చిన క్లౌడ్ స్టోరేజీ సేవ డ్రాప్‌బాక్స్. వేరు వేరు డివెజైస్లలో, వేరు వేరు ఆపరేటింగ్ సిస్టమ్స్‌పై పనిచేస్తుంది డ్రాప్ బాక్స్. డ్రాప్ బాక్స్ ద్వారా మల్టీ యూజర్లు డాటాను షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రైవేట్‌గా కూడా ఉంచుకోవచ్చు. డాటాను డ్రాప్ బాక్స్‌లో పడేసి కంప్యూటర్, ఫోన్స్, టాబ్లెట్ల ద్వారా యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మైక్రోసాఫ్ట్ విండోస్, మ్యాక్ ఓఎస్ఎక్స్, లైనక్స్, ఆండ్రాయిడ్, ఐఓఎస్, బ్లాక్‌బెర్రీ ఓఎస్‌లపై పనిచేస్తుంది డ్రాప్‌బాక్స్. టెక్ట్స్ఫైల్స్, ఫోటోలు వేటినైనా... కాన్ఫిడెన్స్‌తో షేర్ చేసుకోండి అని హామీ ఇస్తోంది డ్రాప్ బాక్స్. 2 జీబీ వరకూ స్టోరేజ్‌కు అవకాశం ఉంటుంది.
- జీవన్‌రెడ్డి. బి