బీభత్సం
ఆదివారం అర్ధరాత్రి వర్షానికి 2వేలకు పైగా హెక్టార్లలో వరికి నష్టం
ఈ నెలలోనే 4,247 హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు
నష్టంపై ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదిక
రూ.6కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని అంచనా, ఇతర పంటలకూ నష్టమే
ఎక్కడికక్కడ తడిసి ముద్దవుతున్న ధాన్యపురాశులు
తడిసిన ధాన్యంపై రైతాంగంలో ఆందోళన
వ్యవసాయ మంత్రితో మాట్లాడిన సీఎల్పీ
ఉపనేత కోమటిరెడ్డి
ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలుకు
ఆదేశాలివ్వాలని డిమాండ్
సాక్షి నెట్వర్క్
వరుసగా కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతను అరిగోస పెట్టిస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చిందనుకుంటున్న వేళ వరుణుడు చూపుతున్న ప్రభావంతో రైతాంగంలో తీవ్ర ఆందోళనలు నెలకుంటున్నాయి. ముఖ్యంగా రబీసీజన్‌లో వరి పంట సాగుచేసిన రైతులు మొన్నటివరకు నీళ్లు లేక ఇబ్బందులు పడగా, ఇప్పుడు పంట చేతికొస్తున్న సమయంలో కురుస్తున్న వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక్క ఆదివారం అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షం కారణంగానే దాదాపు 2వేలకు పైగా హెక్టార్లలో వరిపంటకు నష్టంవాటిల్లింది.
దీనిని వ్యవసాయ శాఖ అధికారులు కూడా ధ్రువీకరించారు. ఈ మేరకు జరిగిన నష్టంపై ప్రభుత్వానికి నివేదిక కూడా పంపారు. మొత్తంమీద ఈనెల ఆరో తేదీ నుంచి వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా 4,247 హెక్టార్లలో వరి పంట దె బ్బతిందని, రూ.6కోట్ల మేర నష్టం జరిగిందని ఈ నివేదికలో పేర్కొన్నారు. మిర్యాలగూడ మండలం తడకమళ్ల ఐకేపీ కేంద్రంలో నిలిచిన నీటిని తీసేందుకు ఆయిల్ఇంజన్ను సైతం వినియోగించాల్సి వచ్చింది. నకి రేకల్ నియోజకవర్గంలో పలుచోట్ల ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు కన్నీరుపెట్టుకున్నారు.
అయితే, తడిసిన ధాన్యాన్ని నిబంధనల పేరుతో తిరస్కరించకుండా ఐకేపీ కేంద్రాల్లో మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు, రైతుసంఘాలు డిమాండ్ చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రావాలని వారు కోరుతున్నారు. ఈ మేరకు సీఎల్పీ ఉపనేత, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో సోమవారం ఫోన్లో మాట్లాడి రైతుల ఆందోళనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రకటన చేయాలన్న ఆయన విజ్ఞప్తి పట్ల మంత్రి కూడా సానుకూలంగా స్పందించారు. వరిపంటతో పాటు జిల్లాలో మామిడి, నిమ్మ, కూరగాయల పంటలు కూడా దె బ్బతినడం గమనార్హం.
అకాలవర్షం మిగిల్చిన నష్టం నియోజకవర్గాల వారీగా..
భువనగిరి: ఆకాల వర్షాలతో భువనగిరి నియోజకవర్గంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. భువనగిరి పట్టణం, మండలం, పోచంపల్లి, వలిగొండ మండలాల్లో 11,12,13 తేదీల్లో కురిసిన వర్షాలతో వరిపంట నెలవాలింది. భువనగిరిలో 9, బీబీనగర్‌లో 13,పోచంపల్లిలో 16 గ్రామాల్లో కోతకు వచ్చిన పంట వర్షానికి దెబ్బతిందని అధికారులు తేల్చారు. ఆదివారం రాత్రి నుంచి కురిసిన వర్షానికి 1300 హెక్టార్లలో వరిపంటకు నష్టం వాటిల్లింది. పొలాల్లో ధాన్యం రంగుమారింది.
మునుగోడు: అకాల వ ర్షానికి వరి చేలకు, మామిడి తోటలకు మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా నష్టం వాటిల్లింది. చౌటుప్పల్ మండలంలో 200 ఎకరాల్లో వరిపంటకు పాక్షికంగా నష్టం వాటిల్లింది. మల్కాపురంలో ఓ ఇంటి పైకప్పు రేకులు లేచిపోయాయి. మల్కాపురం, పంతంగి, ఎస్.లింగోటం గ్రామాల్లో దాదాపు 50ఎకరాల్లో మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. మునుగోడు మండలంలో 200ఎకరాల్లో వరిచేలు నేలకొరిగాయి. మర్రిగూడ మండలంలో 20ఎకరాల్లో మామిడితోటల్లో కాయలు నేలరాలాయి. వరిచేను నేలకొరిగింది. చండూరు మండలం పుల్లెంల, అంగడిపేట గ్రామాల్లో 15ఎకరాల మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి.
మిర్యాలగూడ: మిర్యాలగూడ నియోజకవర్గంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి ఐకేపీ కేంద్రాలలోని ధాన్యం తడిసి మద్దయింది. సాధారణ వర్షం కురిసినప్పటికీ ఈదులు గాలుల వల్ల ధాన్యంరాశులపై రైతులు కప్పుకున్న పట్టాలు లేచిపోయి ధాన్యం తడిసింది. మిర్యాలగూడ మండలంలోని తడకమళ్ల ఐకేపీ కేంద్రంలో వర్షం నీళ్లు భారీగా నిలవడంతో ధాన్యం కుప్పలు నీటిలో తేలాయి. ఐకేపీ కేం ద్రంలో నిలిచిన నీటిని తొలగించడానికి రైతు లు ఆయిల్ ఇంజన్ ఉపయోగించారు. తడకమళ్ల, తక్కెళ్లపాడు, గోగువారిగూడెం ఐకేపీ కేం ద్రాలలో సుమారుగా 10 వేల బస్తాల ధాన్యం తడిసింది. వేములపల్లి మండలంలోని ఆగామోత్కూర్, రావులపెంట, శెట్టిపాలెం గ్రామాలలోని ఐకేపీ కేంద్రాలలో వర్షం నీళ్లు నిలిచి సుమారు నాలుగు వేల బస్తాల ధాన్యం తడిసింది. రావులపెంట గ్రామంలో తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు రాస్తారోకో చేశారు.
తుంగతుర్తి: తుంగతుర్తి నియోజకవర్గంలో సో మవారం తెల్లవారు జాము నుంచి కురిసిన వర్షానికి పెద్దగా పంట నష్టం వాటిల్లలేదు. సుమారు 1200 ఎకరాల్లో చేతికి వచ్చిన వరి పొలాలు నేలకొరిగాయి. మోత్కూరు, తిరుమలగిరి, తుంగతుర్తి మండలాలల్లో సుమారు 150 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బ తిన్నా యి. తిరుమలగిరి మండలం మాలిపురంలో ఆరు విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. మోత్కూర్ మండలంలోని ఐకేపీ కేంద్రాల్లో 500 బస్తాల ధాన్యం తడిసిపోయింది.
నకిరేకల్: రెండవ రోజు కురిసిన అకాల వర్షంతో రైతుల ధాన్యం మళ్లీ తడిసి ముద్దయింది. నియోజకవర్గంలోని నకిరేకల్, కట్టంగూర్, కేతేపల్లి, రామన్నపేట మండలాలలో ఐకేపీ కేంద్రాలలో ధాన్యం తడిసిపోయింది. నకిరేకల్ వ్యవ సాయ మార్కెట్లోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాశుల కిందికి వర్షపు నీరు చేరి కొంత కొట్టుకుపోయింది. రామన్నపేట మండలంలో రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు రామన్నపేట వ్యవసాయమార్కెట్తోపాటు కక్కిరేణి, మునిపంపుల, లక్ష్మాపురం, శోభనాద్రిపురం గ్రామాల్లోని కొనుగోలుకేంద్రాలలో పోసిన ధాన్యపురాశులు తడిసిపోయాయి. రామన్నపేట మార్కెట్లో సిందం మల్లయ్య అనేరైతుకు చెందిన 30బస్తాలధాన్యం వరదకు కొట్టుకుపోవడంతో ఆయన భార్య పద్మ కంటతడిపెట్టడం కనిపించింది.
సూర్యాపేట: సూర్యాపేట నియోజకవర్గంలో సోమవారం తెల్లవారుజాము నుంచి కురిసిన అకాల వర్షానికి పెద్దగా ఎక్కడా పంట నష్టం వాటిల్లలేదు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు తీసుకొచ్చిన ధాన్యం కొద్ది మొత్తంలో తడిసిపోయింది. అకాల వర్షం కురవడంతో రైతులు మార్కెట్లో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సూర్యాపేట, పెన్‌పహాడ్, చివ్వెంల, ఆత్మకూర్.ఎస్ మండలాల్లో బోరుబావుల కింద సాగుచేసిన వరి పొలాలు కొన్నిచోట్ల నేలకొరిగిన ఘటనలు కన్పించాయి. కందగట్ల ఐకేపీ కేంద్రంలో ధాన్యం రాశుల మధ్య నీళ్లు నిలిచి ధాన్యం తడిసిముద్దయింది.
నల్లగొండ: నియోజకవర్గంలో కురిసిన వర్షానికి నల్లగొండ మండలం, తిప్పర్తి, కనగల్ మండలాల్లో ప లు చోట్ల చేతికొచ్చిన పంటలు నేలకొరిగాయి. ఐకేపీ కేంద్రాలు, మార్కెట్ యార్డ్‌ల్లో నిల్వ ఉ ంచిన ధాన్యం తడిసిపోయింది. నల్లగొండ మండలంలో 15 వందల ఎకరాల్లో వరి చేలు నేలకొరిగాయి. 62 ఎకరాల్లో మామిడికాయలు రాలిపోయాయి. ఎకరానికి పదిహేను కిలోల చొప్పున కాయలు రాలినట్లు రైతులు చె బుతున్నారు. ముషంపల్లి, జీకే అన్నారం ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. తిప్పర్తి మార్కెట్ యార్డ్‌లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసిపో యింది. కాగా తిప్పర్తి, కనగల్ మండలా ల్లో పలు చోట్ల ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం పాక్షికంగానే తడిసిపోయింది.
ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదిక
నల్లగొండ అగ్రికల్చర్: జిల్లాలో 6వ తేదీ నుంచి ఆదివారం వరకు కురిసిన అకాల వర్షం కారణంగా 4,247 హెక్టార్లలో వరిపంటలు దెబ్బతిని సుమారు రూ.6.5 కోట్ల మేర పంట నష్టం జరిగిందని జిల్లా యంత్రాంగం ప్రాథమిక అంచనాలు వేసింది. ముఖ్యంగా భువనగిరి, బీబీనగర్, భూదాన్‌పోచంపల్లి, రామన్నపేట, నారాయణపురం, నకిరేకల్, కేతెపల్లి, కట్టంగూరు, శాలిగౌరారం మండలాలో వర్షం కారణంగా వరిపొలాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు అంచనాలు వేసింది. అదే విధంగా జిల్లాలో మామిడి తోటలకు కూడా నష్టం జరిగినప్పటికీ కాయలు, పిందెలు రాలిపోతే రైతులకు నష్టపరిహారం అందించే నిబంధనలు లేకపోవడం వల్ల నష్టం జరిగిన మామిడి తోటల నివేదికను రూపొందించలేదని ఉద్యానవన శాఖ అధికారి ఒకరు తెలిపారు. చెట్లు ధ్వంసమైతేనే పరిహారం అందించే నిబంధనలు ఉన్నాయని తెలిపారు. కానీ ఇటీవలన కురిసిన గాలులతో కూడిన వర్షాల కారణంగా వందల ఎకరాలలో మామిడి తోటలకు నష్టం జరిగింది.