నిద్రపోని నగరం..
విదేశాలలో!
ఆధునికత మనిషి చేత 24 గంటలూ పనిచేయిస్తుంది. అందులో భాగంగానే నగరాలలో అర్థరాత్రి దాటినా ప్రజలు అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉన్నారు. దీంతో పాటు క్లబ్బులు-పబ్బులలో ఆనందం ఉరకలేస్తూనే ఉంటోంది. ఈ విధంగా ప్రపంచంలో పేరొందిన మహానగరాలు రాత్రుళ్లు కూడా పగలను తలపిస్తున్నాయి. ఇటీవల ది వాల్‌స్ట్రీట్ జర్నల్ మహానగరాల మధ్యరాత్రుల సమాచారాన్ని సేకరించి, విశ్లేషించి ఆ విశేషాలను వెల్లడించింది. దీంట్లో భాగంగా అమెరికాలోని న్యూయార్క్ నగరం అస్సలు నిద్రపోవడం లేదని తేల్చింది.
న్యూయార్క్ నగరంలోని నైట్ క్లబ్బులు పాప్ మ్యూజిక్ హోర్తో దద్ధరిల్లిపోతుంటాయి. ఇక్కడి భూగర్భ బార్లు తెల్లవార్లూ బార్లా తెరుచుకునే ఉంటా యి. ఆకాశాన్నంటే భవనాలు.. థియేటర్లలో చిత్రాల సందడి, రోడ్ల మీద హుషారుగా తిరిగే ప్రజలు, దూసుకుపోయే వాహనాలు.. వీటిన్నింటినీ విశాలమైన రోడ్ల మీదుగా, లైట్ల వెలుతురులో చూసుకుంటూ అబ్బురపడవచ్చు.
రాత్రుళ్లు నిద్రపోని న్యూయార్క్ నగరం అత్యంత సందడిగా ఉంటే, ఆస్ట్రేలియలోని మెల్బోర్న్ నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రపంచంలోనే అతి విశ్రాంతికరమైన నగరాలలో మెల్బోర్న్కి వాల్ స్ట్రీట్ జర్నల్ మొదటి స్థానాన్ని కట్టబెట్టింది.