నేతృత్వం మాదే!
* సీఎం అభ్యర్థి ప్రకటించాకే ఎన్నికల్లోకి...
* బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టీకరణ
* పీఎంకే, డీఎండీకేలకు షాక్
* ‘చో’తో భేటీలో ఆంతర్యమేమిటో...
* కమలం గూటికి నెపోలియన్
సాక్షి, చెన్నై : ‘‘మా నేతృత్వంలోనే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కూటమి బరిలోకి దిగుతుంది. సీఎం అభ్యర్థి ప్రకటనతో ఎన్నికల్లోకి వెళ్తాం.’’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో కాస్త పీఎంకే, డీఎండీకేలకు షాక్ తగిలింది. తుగ్లక్ పత్రిక సంపాదకుడు చో రామస్వామితో అమిత్ షా భేటీ కావడంలో ఆంతర్యాన్ని వెతికే పనిలో విశ్లేషకులు పడ్డారు. డీఎంకే నుంచి బయటకు వచ్చిన సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి నెపోలియన్ కమలం కండువా కప్పుకున్నారు.
రాష్ట్రంలో బలమైన శక్తిగా అవతరించడం లక్ష్యంగా తన వ్యూహాలకు పదును పెట్టేందుకు అమిత్ షా సిద్ధం అయ్యారు. తన చెన్నై పర్యటనలో తొలి రోజు శనివారం మరై మలై నగర్ వేదికగా జరిగిన బహిరంగ సభలో ఆకట్టుకునే ప్రసంగం చేసిన అమిత్ షా రెండో రోజు తన వ్యూహాల్ని అమలు చేసేందుకు కమలనాథుల్ని సిద్ధం చేసే పనిలో పడ్డారు. ‘మా నేతృత్వంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి’ అన్న విషయాన్ని కుండబద్దలు కొట్టారు. అమిత్ షా పర్యటన ఉదయం నుంచి సాయంత్రం వరకు
బిజీబిజీగా సాగింది.
‘చో’తో భేటీ : అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీ కాంత్‌కు తుగ్లక్ పత్రిక సంపాదకుడు చో రామస్వామి సన్నిహితులు. ఈ పరిస్థితుల్లో చెన్నైకు వచ్చిన అమిత్ షా ఉదయాన్నే ఆర్యపురంలోని చో ఇంటికి వెళ్లారు. అక్కడ సుమారు గంట పాటుగా ఇద్దరు భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రజనీ కాంత్‌కు గాలం వేయడానికి బీజేపీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. చో ద్వారా అందుకు తగ్గ రాయబారాలు ఏవైనా సాగిస్తోందా..? అన్న చర్చ బయలు దేరింది. అయితే, చో అనారోగ్యంతో ఉన్న దృష్ట్యా, మర్యాద పూర్వక పరామర్శ సాగినట్టు కమలనాథులు పేర్కొంటున్నారు.
వ్యూహాల అమలు : టీ నగర్‌లోని కమలాలయం చేరుకున్న అమిత్ షాకు పార్టీ వర్గాలు ఘన స్వాగతం పలికారుు. రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ నేతృత్వంలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. ఇందులో కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మురళీ ధరరావు, నేతలు ఇల గణేషన్, హెచ్ రాజా, సీపీ రాధాకృష్ణన్, మోహన్ రాజులు తదితరులు పాల్గొన్నారు. సుమారు రెండు గంటల పాటుగా ఈ సమావేశం సాగింది. పార్టీ బలోపేతం లక్ష్యంగా, ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే రీతిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఇందులో చర్చ సాగినట్టు కమలనాథులు పేర్కొంటున్నారు.
మా నేతృత్వంలోనే కూటమి: మీడియా సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ నేతృత్వంలోనే కూటమి ఆవిర్భవిస్తుందని స్పష్టం చేశారు. సీఎం అభ్యర్థి ఎవరన్నది ప్రకటించాకే ఎన్నికలకు వెళ్తామన్నారు. అంతలోపు పార్టీ బలోపేతం లక్ష్యంగా దూసుకెళతామన్నారు. డీఎంకే, అన్నాడీఎంకేలను ఢీ కొట్టే శక్తిగా అవతరించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. 2014 బీజేపీకి కలసి వచ్చిన సంవత్సరంగా పేర్కొన్నారు. 30 ఏళ్లుగా పడ్డ శ్రమకు ఫలితంగా ఎవరి మద్దతు లేకుండా కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టగలిగామని గుర్తు చేశారు.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ధరల కట్టడి లక్ష్యంగా ముందుకు సాగుతున్నదన్నారు. అందువల్లే, తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పది సార్లు పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించ గలిగామని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంతో, స్మార్ట్ సిటీల పథకంతో ముందుకు దూసుకెళుతున్నామన్నారు. తమిళనాడులో సభ్యత్వ నమోదు ప్రక్రియ ఆరంభమైందని 60 లక్షల మందిని చేర్పించి బలమైన శక్తిగా తమ సత్తాను చాటుతామని ధీమా వ్యక్తం చేశారు.
అధికారాలు లేవు: సుబ్రమణ్య స్వామి పార్టీలో ఓ సభ్యుడు అని, నాయకుల్లో ఒకరు అని పేర్కొంటూ, ఆయనకు పార్టీ సిద్ధాంతాల పరంగా ఎలాంటి అధికారాలు ఇవ్వలేదని ఓ ప్రశ్నకు స్పష్టం చేశారు. తమిళ జాలర్లకు భద్రత కల్పించే విధంగా చర్యలు వేగవంతం చేశామని, కర్ణాటకలో సాగుతున్న డ్యాం నిర్మాణ వ్యవహారాల్లో ఆ రాష్ర్టం, తమిళనాడు అధికారుల్ని ఒక చోట చేర్చి చర్చించి నిర్ణయాలు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా క్రోం పేటలోని ఓ కల్యాణ మండపంలో జరిగిన పార్టీ జిల్లాల కార్యదర్శుల సమావేశంలో అమిత్ షా పాల్గొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు వేగవంతం లక్ష్యంగా ఉపదేశాలు ఇచ్చి ఢిల్లీకి తిరుగు పయనమయ్యారు.
నెపోలియన్ తీర్థం : డీఎంకే నుంచి బయటకు వచ్చిన కేంద్ర మాజీ మంత్రి నెపోలియన్ కమలం కండువా కప్పుకున్నారు. అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. డీఎంకేలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని, అందుకే తాను బీజేపీలోకి చేరినట్టు నెపోలియన్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలన అద్భుతంగా ఉందని, ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తున్నదని పేర్కొన్నారు. డీఎంకేలో అసంతృప్తి వాదులు కోకొల్లలుగా ఉన్నారని, త్వరలో వీరంతా బీజేపీలో చేరబోతున్నారని నెపోలియన్ ప్రకటించడం గమనార్హం.