6న సీఎం రాక
– పకడ్బందీగా పర్యటన ఏర్పాట్లు చేయండి
– అధికారులకు కలెక్టర్ కోన శశిధర్ ఆదేశం
అనంతపురం అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగస్టు 6న జిల్లాకు విచ్చేస్తున్నారని కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం, జేసీ–2 సయ్యద్ ఖాజామొహిద్ధీన్తో కలిసి అధికారులతో సమీక్షించారు. ఆగస్టు 6న ధర్మవరంలో ఏర్పాటు చేసిన చేనేత రుణమాఫీ రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో, బుక్కరాయసముద్రంలో రైతు ఉత్పత్తి సంఘాల రాష్ట్ర స్థాయి సమావేశంలో సీఎం పాల్గొంటారన్నారు.
హెలిప్యాడ్, సభావేదిక, సీటింగ్, తాగునీరు, తదితర ఏర్పాట్లను సంబంధిత అధికారులు పకడ్బందీగా చేయాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ పీహెచ్ హేమసాగర్, ఆర్డీఓ మలోలా, ఎఫ్ఎస్ఓ మల్లీశ్వరిదేవి, జడ్పీ సీఈఓ రామచంద్ర, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం బుక్కరాయసముద్రం సమీపంలోని కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ సమీపంలో ఏర్పాటు చేయనున్న హెలీప్యాడ్ని, సీఎం ప్రారంభించే గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రభుత్వ విప్ యామిని బాల, ఎమ్మెల్సీ శమంతకమణి, ఎస్పీ రాజశేఖర్బాబుతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.