మీ త్యాగమే దేశ భవిష్యత్తుకు పునాది
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తు కోసం పోలీసులు ఎన్నో త్యాగాలు చేస్తున్నారని, వారి భుజస్కంధాల మీదనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర పోలీసు అకాడమిలో శిక్షణ పూర్తి చేసుకున్న 11వ బ్యాచ్ సివిల్ సబ్ ఇన్స్పెక్టర్లు(ఎస్ఐ), 10వ బ్యాచ్ రిజర్వ్ సబ్ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్ సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథితిగా హాజరైన గవర్నర్ నరసింహన్ ట్రైనీ ఎస్ఐల గౌరవ వందనం స్వీకరించారు. ఒక్క మహిళకు కూడా ఈ బ్యాచ్‌లో చోటు లేకపోవడం విచారకరమన్నారు.
సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
పోలీసులు లాఠీ పట్టుకొని శాంతిభద్రతలు చూడటమే కాకుండా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని గవర్నర్ సూచించారు. హైటెక్ నేరాలు, కమ్యూనిటీ వివాదాలు ప్రతీ ఒక్కటీ అభివృద్ధికి ముడిపడే ఉంటుందన్నారు. రోజు రోజుకు నేరాల సంఖ్య, జరుగుతున్న విధానాలు కూడా మారుతున్నాయంటూ నరసింహన్ ఉదహరించారు. సైబర్ నేరాలు, బ్యాంకిగ్ వంటి మోసాలపై ఎక్కువగా దృష్టిసారించాలన్నారు. అందుకు తగ్గట్లుగా పోలీసు లు కూడా కొత్త సాంకేతిక పరిజ్ఞానంపట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. పోలీసు ప్రతిష్ట స్టేషన్‌హౌస్ ఆఫీసర్(ఎస్‌హెచ్‌వో) మీద ఆధారపడి ఉంటుందన్నారు.
పోలీసులకు అన్ని విధాల అండగా ఉండే ప్రభుత్వం ఉడటం చాలా శుభకరమన్నారు. పోలీసుల పట్ల సమాజ వైఖరి కూడా మారాలని గవర్నర్ కోరారు. పండుగలు, నూతన సంవత్సరం తదితర సందర్భాలలో కనీస కృతజ్ఞతలు తెలపాలనే స్పృహ సమాజానికి ఉండాలన్నారు. పోలీసుశాఖలోకి ఉన్నత విద్యావంతులు రావడం మంచి పరిణామమని డీజీపీ అనురాగ్‌శర్మ అన్నారు. ట్రైనీల్లో 142 మంది పోస్టుగ్రాడ్యుయేట్లు, 44 మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు ఉండటం చాలా గర్వంగా ఉందన్నారు. 59 మంది 20 ఏళ్ల వయస్సుగల వారే ఉండటం అభినందించదగ్గ విషయమన్నారు.
బహుమతుల ప్రదానం..
శిక్షణలో భాగంగా వివిధ విభాగాల్లో నైపుణ్యం సాధించిన ఎస్ఐలకు గవర్నర్ నరసింహన్ బహుమతులు అందజేశారు. సివిల్ విభాగానికి సంబంధించి అన్ని రంగాల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచినవారికి అందజేసే ముఖ్యమంత్రి రివాల్వర్ అవార్డును వరంగల్ రేంజ్‌కు చెందిన ఎన్.స్వరూప్‌రాజ్‌కు లభించింది. హోంమంత్రి ట్రోఫీ కూడా ఎన్.స్వరూప్రాజ్కే లభించింది. డీజీ, ఐజీపీ ట్రోఫీ అవార్డును హైదరాబాద్ రేంజ్‌కు చెందిన ఎం.లక్ష్మయ్య అందుకున్నారు. ఫైరింగ్ విభాగంలో డెరైక్టర్ ట్రోఫీని హైదరాబాద్ రేంజ్‌కు చెందిన కె.రాజుకు లభించింది. ఆర్మ్డ్ రిజర్వ్డ్ విభాగానికి సంబంధించి ముఖ్యమంత్రి రివాల్వర్ అవార్డుతోపాటు హోంమంత్రి ట్రోఫీని ఎన్.రాజేశ్ గెలుపొందారు. డీజీపీ ట్రోఫీ కె.శ్రీనివాసరావుకు లభించింది.
ఫైరింగ్‌లో ప్రతిభ కనబరిచినవారికి అందజేసే డెరైక్టర్స్ ట్రోఫీని ఎస్కె.నాగుల్‌మీరా కైవసం చేసుకున్నారు. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్(టీఎస్ఎస్పీ) విభాగంలో ముఖ్యమంత్రి రివాల్వర్ అవార్డును జి.గురుమూర్తి గెలుపొందారు. హోంమంత్రి ట్రోఫీని కె.త్రిముఖ్కు లభించింది. డీజీపీ ట్రోఫీని జి.గురుమార్తి గెలుపొందారు. ఫైరింగ్ విభాగంలో అందజేసే డెరైక్టర్ ట్రోఫిని ఎస్.శ్రీనివాసులు కైవసం చేసుకున్నారు.