ఏం సాధించాం?
- రెండేళ్ల పాలనలో సాధించిన ప్రగతిపై సీఎంతో కేపీసీసీ చీఫ్ చర్చ
- గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు వ్యూహ రచన
బెంగళూరు: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న తరుణంలో గ్రామ పంచాయితీ ఎన్నికల నగారా సైతం మోగడంతో కాంగ్రెస్ పార్టీలో ‘రెండేళ్లలో ఏం చేయగలిగాం’? అన్న విషయంపై అంతర్మధనం మొదలైంది. గ్రామ పంచాయితీ ఎన్నికల కోసం ప్రజల ముందుకు ఎలా వెళ్లాలో చర్చించేందుకు గాను ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్ సమావేశమయ్యారు. బుధవారమిక్కడి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కృష్ణాలో సిద్ధరామయ్యతో పరమేశ్వర్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన పనులతో పాటు గ్రామ పంచాయితీ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి, మంత్రి మండలి విస్తరణ, బీబీఎంపీ ఎన్నికలు, రాష్ట్రంలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు తదితర అంశాలపై సిద్ధరామయ్యతో సుదీర్ఘంగా చర్చించారు. ‘గ్రామ పంచాయితీ ఎన్నికల నగారా మోగిన వేళ ప్రజలకు ఏం చెప్పి ఓట్లు అడగాలి, అసలు ఈ రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం చేపట్టిన కార్యక్రమాలేమిటి?’ అని కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను సూటిగా ప్రశ్నించినట్లు సమాచారం. ఇక అనంతరం మంగళవారం రోజున నగరంలోని రేస్‌కోర్సు రోడ్‌లోని కేపీసీసీ కార్యాలయంలో నిర్వహించిన కేపీసీసీ పదాధికారుల సమావేశానికి సంబంధించిన అంశాలను సైతం పరమేశ్వర్, సిద్ధుకు తెలియజేశారు.
ప్రభుత్వ పనితీరుపై క్షేత్రస్థాయి కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తి మంగళవారం నాటి సమావేశంలో బయటపడిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని పరమేశ్వర్ , సిద్ధరామయ్య ముందు ఉంచారు. ‘మంత్రులంతా తమ తమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పనిచేస్తున్నారు తప్పితే పార్టీ ప్రయోజనాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ కారణంగానే ప్రజల్లో ప్రభుత్వం పై మంచి అభిప్రాయం కూడా లేకుండా పోతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదులో కూడా మంత్రులు చురుగ్గా పాల్గొనలేదు. ఇదిలాగే కొనసాగితే పార్టీతో పాటు ప్రభుత్వానికి కూడా నష్టం తప్పదు. మంత్రుల తీరును మార్చేందుకు మీరు కలగజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రామ పంచాయితీ ఎన్నికల నగారా మోగిన ఈ తరుణంలో క్షేత్రస్థాయి కార్యకర్తల అవసరం పార్టీకి ఎంతైనా ఉంది’ అని కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పేర్కొన్నట్లు సమాచారం.
ఇక పరమేశ్వర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ...‘క్షేత్రస్థాయి నుంచి కార్యకర్తలను కలుపుకు పోయేందుకు సమావేశాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం తరఫున ఏమీ చేసేందుకు వీలుకాదు. అందువల్ల ఎన్నికలకు సంబంధించిన ఏ కార్యక్రమమైనా సరే పార్టీ తరఫునే చేపట్టండి. పార్టీలోని అందరి సహకారం ఈ కార్యక్రమాలకు అందేలా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ సీనియర్ నాయకులందరి పైనా ఉంది’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పరమేశ్వర్‌కు బదులిచ్చినట్లు కేపీసీసీ వర్గాల ద్వారా తెలుస్తోంది.