ఉపాధ్యాయులకు ఊరట
శ్రీకాకుళం న్యూకాలనీ, న్యూస్‌లైన్: కొంతకాలంగా తమ జీతాల స్తంబ్దతపై ఆతృతగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు ఎట్టకేలకు ఊరట కలిగింది. 49 రోజుల సమైక్యాంధ్ర ఉద్యమ సమ్మె కాలాన్ని ఆన్‌డ్యూటీగా పరిగణిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్వర్వులు జారీ చేసింది. అందుకు సంబంధించిన ఫైల్‌పై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సంతకం కూడా చేశారు. ఉవ్వెత్తున ఎగసిపడిన సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుండి నడిపిం చడంలో ఉపాధ్యాయ జేఏసీ ప్రతినిధులు, ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారు. సుమారు రెండు నెలలపాటు పాఠశాలలకు తాళం వేసి రోడ్డపైకి వచ్చారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 14 వేల మంది ఉపాధ్యాయులు ఉండగా..వీరిలో 9 వేలకు పైగా సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెకూడా విరమించి పాఠశాలల బాట పట్టారు.
సమ్మె కాలంలో విద్యార్థులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ఆదివారాలతోపాటు 2వ శనివారాల్లో కూడా స్కూళ్లకు వెళ్లేందుకు ఉపాధ్యాయులు ఒప్పందం చేసుకున్నారు. ఇదంతా ఒకెత్తయితే సమ్మెకాలానికిగాను ఇంతవరకు జీతాలను ప్రభుత్వం అందజేయలేదు. దీంతో ఉపాధ్యాయులు నానా అగచాట్లు పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో సమ్మెకాలపు పని దినాలను ఆన్‌డ్యూటీగా పరిగణిస్తు జీవో వెలువరించడంపై జిల్లాలోని ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జీవో విడుదల చేసిన సీఎంకు, అందుకు కృషి చేసిన ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడుకు సమైక్యాంధ్ర ఉపాధ్యాయ జేఏసీ జిల్లా కన్వీనర్ భైరి అప్పారావు, హరిశ్చంద్రుడు, శివరాంప్రసాద్, రాజేంద్రప్రసాద్, కొనే శ్రీధర్, సాంబమూర్తి, పోలినాయుడు, వెంకటరమణ కృతజ్ఞతలు తెలిపారు.