దక్కని హామీ
'అనంత' అధికార పార్టీ నేతలతో సీఎం ప్రత్యేక సమావేశం
ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌పై ఆలోచిస్తామన్న చంద్రబాబు
నేతల మధ్య విభేదాలపై ఫిర్యాదులందితే చర్యలు తప్పవని హెచ్చరిక
శ్రీరామరెడ్డి తాగునీటి పథకంపై విచారణకు ఆదేశం
వచ్చే నెల 2న జిల్లాకు సీఎం...గొల్లపల్లి రిజర్వాయర్‌లో గంగపూజ
వరుస కరువులతో అల్లాడిపోతున్న 'అనంత' రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా కల్పించలేకపోయారు. కష్టకాలంలో ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇచ్చి రైతులను ఆదుకుంటామని గట్టి హామీ ఇవ్వలేకపోయారు. జిల్లా అభివృద్ధి, పార్టీ పరిస్థితుల నేపథ్యంలో 'అనంత' నేతలు శుక్రవారం రాజధానిలో ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమావేశంలో పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఏడాది వర్షాభావంతో పంటలు పూర్తిగా ఎండిపోయాయని పలువురు నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన ఆయన.. ‘రెయిన్గన్లతో ఎండిన ప్రతి ఎకరాకు నీరిచ్చాం కదా?! కాపాడామని ప్రభుత్వం తరఫున ప్రకటన కూడా చేశాం. మీరు కూడా 'థ్యాంక్యూ సీఎం' అని కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు పంట నష్టపరిహారం అంటే.. రెయిన్గన్లు విఫలమయ్యాయని ప్రభుత్వమే అంగీకరించినట్లవుతుంది కదా?!’ అని ప్రశ్నించినట్లు తెలిసింది. దీనిపై ఓ ఎమ్మెల్యే మాట్లాడుతూ రెయిన్గన్ల వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనమూ లేదని, అధికారులు తప్పుడు లెక్కలతో మభ్యపెట్టారని, సీఎంగా మీరు నాలుగురోజులు 'అనంత'లోనే మకాం వేయడంతో పంటలను కాపాడామని తాము కూడా మాట్లాడామని, కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని వివరించారు. ఇన్‌పుట్‌సబ్సిడీ ఎగ్గొట్టేందుకే ప్రభుత్వం రెయిన్గన్లను తెరపైకి తీసుకొచ్చిందనే ప్రచారం 'అనంత' రైతుల్లో జరుగుతోందని, ఈ క్రమంలో పరిహారం ఇవ్వడమే ఉత్తమమని చెప్పినట్లు తెలిసింది. చివరకు జిల్లాలో ఎంత పంట ఎండింది, ఎంత పరిహారం ఇవ్వాల్సి వస్తుందనే అంచనాలు సిద్ధం చేయించి నివేదికలు పంపితే ఆలోచిద్దామని సీఎం చెప్పారు. ఇన్సూరెన్స్పైనా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
శ్రీరామరెడ్డి తాగునీటి పథకంపై విచారణ : శ్రీరామరెడ్డి తాగునీటి పథకంలో 12 కిలోమీటర్ల మేర పైపులైన్ నిర్మాణంలో అవినీతి జరిగిందని, దానిపై విచారణ చేయించాలని జిల్లానేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విచారణకు కమిటీ వేయాలని మంత్రులను సీఎం ఆదేశించారు. 12కిలోమీటర్లకు అదనంగా నిధులు కేటాయించి పైపులైన్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని సీఎం చెప్పినట్లు తెలిసింది. అలాగే వర్షాభావంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయని, వేసవిలో తాగునీటి ఎద్దడి తీవ్రస్థాయిలో తలెత్తే ప్రమాదముందని, నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లానేతలు చంద్రబాబును కోరారు. దీనిపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి తనకు నివేదికను పంపాలని ఆయన సూచించారు.
వచ్చే నెల 2న గొల్లపల్లిలో గంగపూజ : 2012లో జీడిపల్లి రిజర్వాయర్‌కు కృష్ణా నీళ్లొచ్చినా, ఇప్పటి వరకూ గొల్లపల్లికి చేరలేదు. అయితే.. డిసెంబర్ 2న గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీళ్లొదిలి గంగపూజ చేసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. ఆరోజు గొల్లపల్లికి నీళ్లివ్వడంతో పాటు చెర్లోపల్లి రిజర్వాయర్‌కు ఎప్పటిలోగా నీరిస్తామనే తేదీని కూడా ప్రకటిస్తామని, అందుకు వీలుగా పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయో తెలుసుకోవడానికి అధికారులు, ఏజెన్సీలతో సమావేశం నిర్వహించి ఓ నివేదికను పంపాలని మంత్రులను సీఎం ఆదేశించారు. జిల్లానేతల మధ్య విభేదాలపై సీఎం గట్టిగానే హెచ్చరించారు. పార్టీలో వర్గాలను ప్రోత్సహించడం, ఓ నియోజకవర్గంలో మరో నేత జోక్యం చేసుకోవడం లాంటి చర్యలను ఉపేక్షించేది లేదని చెప్పారు. ఒకట్రెండుసార్లు చెప్పి చూస్తామని, అయినా మారకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశానికి అనంత ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి గైర్హాజరయ్యారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సీఎంకు కన్పించి సమావేశంలో పాల్గొనకుండా వెళ్లిపోయినట్లు తెలిసింది.