CM tours
-
బస్సులన్నీ సీఎం సభకు
ఆర్టీసీ బస్సులన్నీ సీఎం సభకే తరలించారు. శుక్రవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వాలదిన్నె గ్రామంలో జరిగిన జన్మభూమి–మాఊరు ముగింపు సభకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున బస్సులు తరలివెళ్లాయి. 14 డిపోల నుంచి సుమారు 310 బస్సులను తరలించారు. బస్‌స్టేషన్లన్నీ వెలవెలబోయాయి. సంక్రాంతి సెలవుల కోసం ఇళ్లకు వెళ్లే విద్యార్థులు, ప్రయాణికులు పడరానిపాట్లు పడాల్సి వచ్చింది. ఇదిలావుండగా ఆర్టీసీ యాజమాన్యం స్పెషల్ సర్వీసుల పేరుతో అదనపు చార్జీలు వసూలు చేయడం విమర్శలకు తావిచ్చింది. చిత్తూరు , తిరుపతి సిటీ: జిల్లా ఆర్టీసీ అధికారులు స్వామి భక్తిని చాటుకున్నారు. నెల్లూరు జిల్లాలో జరిగిన సీఎం సభకు పెద్ద ఎత్తున బస్సులు తరలించారు. సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు, యువత, కుటుంబ సభ్యులు స్వగ్రామాలకు వెళ్లలేక నానా తిప్పలు పడాల్సి వచ్చింది. గంటల తరబడి నిరీక్షణ తిరుపతి, మదనపల్లి, పీలేరు, చిత్తూరు, శ్రీకాళహస్తి బస్ స్టేషన్లు బస్సులు లేక బోసిపోయాయి. ఆయా స్టేషన్లలో ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. మాములు రోజుల్లో తిరిగే సర్వీసులు కూడా అర్ధాంతరంగా నెల్లూరు జిల్లాలో జరిగిన సీఎం సభకు తరలించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే బస్సులు తరలించడం ఏమిటని ప్రయాణికులు మండిపడ్డారు. చివరకు ప్రయివేటు వాహనాలను ఆశ్రయించి స్వగ్రామాలకు వెళ్లాల్సి వచ్చింది. స్పెషల్ సర్వీసు పేరుతో దోపిడీ ఉన్న సర్వీసులను రద్దు చేసి స్పెషల్ సర్వీసుల పేరుతో సాధారణ చార్జీకి అదనంగా మరో 50 శాతం వసూలు చేయడం విమర్శలకు తావిచ్చింది. తప్పని పరిస్థితుల్లో ప్రయాణికులు అదనపు చార్జీలు చెల్లించాల్సి వచ్చింది. జిల్లా వ్యాప్తగా 14 డిపోల్లో 1,516 బస్సులు ఉండగా అందులో 310 బస్సులు నెల్లూరు జిల్లాలో జరిగిన సీఎం సభకు తరలివెళ్లాయి. స్వామి భక్తి సురక్షితం.. ఆర్టీసీ ప్రయాణం అంటూ సంబంధిత అధికారులు ఊదరగొట్టడం పరిపాటే. కానీ క్షేత్రస్థాయిలో ప్రయాణికుల సేవలను గాలికొదిలేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొదలే పండుగ సీజన్.. దానికితోడు ఉన్న అరకొర బస్సులను కూడా రాజకీయ సభలకు తరలించడం వెనుక ఆంతర్యమేమిటో అంతుపట్టని పరిస్థితి. ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవని తెలిసినా అధికారపార్టీపై ఉన్న వ్యామోహంతో కొందరు అధికారులు బస్సులు తరలించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రద్దీ రూట్లలో బస్సులు రద్దు సాధారణంగా రోజువారీ ఎక్కువగా తిరిగే సర్వీసుల్లో చాలావరకు బస్సులను రద్దు చేసి సీఎం సభకు మళ్లించినట్లు ఆర్టీసీ అధికారులే చెబుతున్నారు. ఘాట్‌రోడ్డు సర్వీలు, చిత్తూరు, కాణిపాకం, శ్రీకాళహస్తి, పుత్తూరు, సత్యవేడు ప్రాంతాల మధ్య తిగిరే సర్వీసులను రద్దు చేశారు. బస్ స్టేషన్లలో రద్దీని దృష్టిలో పెట్టుకుని ‘స్పెషల్ సర్వీస్’ పేరిట ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఆకలి కేకలు నెల్లూరు జిల్లాలో శుక్రవారం నిర్వహించిన సీఎం సభకు రెండురోజుల ముందే ఆర్టీసీ బస్సులను పలు మండలాలకు వెళ్లాలని డిపో మేనేజర్లు ఆయా డిపోల్లోని డ్రైవర్లు, కండక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. వారికి కేటాయించిన గ్రామాలకు బస్సులు తీసుకెళ్లినా అక్కడ సరైన భోజనం, వసతి లేక సిబ్బంది నానాతిప్పలు పడాల్సి వచ్చింది. సీఎం సభ ముగిసిన తర్వాత తిరిగి వారి స్వగ్రామాల్లో వదిలి డిపోకు చేరేవరకు ఖాళీ కడుపుతోనే విధులు నిర్వహించాల్సి వచ్చిందని కొందరు సిబ్బంది చెప్పడం గమనార్హం. సారూ.. మారాలి మీరు పండుగల సీజన్, సెలవుల సమయాల్లో, ప్రయాణికుల రద్దీ సమాయాల్లో కావాల్సినన్ని బస్సులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఆర్టీసీ యాజమాన్యందే. అధికారులు మాత్రం ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అధికార పార్టీ కనుసన్నల్లో పనిచేస్తూ వారు చెప్పినచోటికి బస్సులను తిప్పడం విమర్శలకు తావిస్తోంది. దీనివల్ల లక్షలాది మంది ప్రయాణికులు అవస్థలు పడాల్సి వస్తోంది. అధికారుల తీరులో మార్పు రావాలని.. ముందు ప్రయాణికులకు కావాల్సినన్ని బస్సులు ఏర్పాటు చేసి స్పేర్‌గా ఉన్న బస్సులను మాత్రమే ఇతర వాటికి వినియోగించాలని పలువురు సూచిస్తున్నారు. -
కరోకరో జర జల్సా!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి ఉన్నతాధికారుల పిల్లలకు పునరావాస కేంద్రంగా మారిపోయింది. ముఖ్యమంత్రి విదేశీ యాత్రలకు వేదికగా ఆర్థికాభివృద్ధి మండలి(ఈడీబీ) రూపాంతరం చెందింది. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలకయ్యే వ్యయాన్ని ఈ మండలి నిధుల నుంచే ఖర్చు చేస్తున్నారు. పెట్టుబడులను ఆకర్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలిని ఏర్పాటు చేసింది. ఈ మండలి ద్వారా గత మూడేళ్లలో పైసా కూడా పెట్టుబడులు రాకపోయినప్పటికీ అందులో పని చేస్తున్న ఉన్నతాధికారుల పిల్లలకు వేతనాలకు, విదేశీ యాత్రల కోసం రూ.కోట్లు వెచ్చించారు. ఆర్థికాభివృద్ధి మండలి చైర్మన్‌గా సాక్షాత్తూ ముఖ్యమంత్రి వ్యవహరిస్తుండడంతోపాటు ఆయనే ఆదేశాలు జారీ చేస్తుండడంతో ఈ దుబార ఖర్చుపై ఆర్థిక శాఖ అధికారులు నోరు మెదపలేకపోతున్నారు. మూడేళ్లుగా ఆర్థికాభివృద్ధి మండలి కార్యాలయం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథి గృహాంలో కొనసాగుతోంది. అమరావతికి తరలి రావాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పలుమార్లు సూచించనప్పటికీ ఫలితం లేదు. ఈ మండలిలో పనిచేసేందుకు కన్సల్టెంట్ల పేరుతో అర్హతలతో సబంధం లేకుండా ఉన్నతాధికారుల సంతానాన్ని నియమించారు. వారికి రూ.లక్షల్లో వేతనాలు చెల్లిస్తున్నారు. వారు చేస్తున్నదేంటో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే. పెట్టుబడులను తీసుకొస్తామన్న సాకుతో విదేశాల్లో విహరించడం, సమావేశాల పేరుతో ఫైవ్‌స్టార్ హోటళ్లలో బస చేయడం విచ్చలవిడిగా కొనసాగుతోంది. ఆర్థికాభివృద్ధి మండలిలో పని చేయడం అంటే సుఖభోగాలు, విలాసాలతో కూడిన ఉద్యోగంగా మారిపోయిందని ఉన్నతాధికారి చెప్పారు. ప్రస్తుత బడ్జెట్లో రూ.62.67 కోట్లు ఆర్థికాభివృద్ధి మండలిలో కన్సల్టెంట్ల ముసుగులో చేరిన ఉన్నతాధికారుల పిల్లల జల్సాలకయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. వారి వేతనాలు, విదేశీ యాత్రలకు 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.11.70 కోట్లు ఖర్చయ్యింది. 2017–18లో ఏకంగా రూ.47.31 కోట్లు వ్యయం చేశారు. ఆర్థికాభివృద్ధి మండలికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రభుత్వం రూ.62.67 కోట్లు కేటాయించింది. ఆర్థికాభివృద్ధి మండలి చేసే ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు అడగరాదంటూ చట్టాన్ని తీసుకురావడం గమనార్హం. - రాజ్యాంగ పదవిలో ఉన్న ఓ ఐఏఎస్ అధికారి కుమార్తె రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలిలో పని చేస్తున్నారు. ఆమెకు నెలకు అక్షరాలా రూ.2 లక్షలు వేతనంగా చెల్లిస్తున్నారు. ఆమె తరచూ విదేశీ పర్యటనలకు వెళ్లడం, ఇష్టం వచ్చినప్పుడు ఆఫీసుకు రావడం జరుగుతోంది ఆమె తండ్రి కీలక పదవిలో ఉండడంతో ఇదేమిటని ఎవరూ ప్రశ్నించలేకపోతున్నారు. - ఓ ఐఆర్ఎస్ అధికారి కుమార్తెను నెలకు రూ.లక్ష వేతనంపై ఆర్థికాభివృద్ధి మండలిలో చేర్చుకున్నారు. ఆమె చాలాసార్లు విదేశీ పర్యటనలకు వెళ్లి రావడం తప్ప రూపాయి పెట్టుబడి కూడా తీసుకురాలేదు. - ఓ ఐఏఎస్ అధికారి కుమార్తెను నెలకు రూ.లక్ష వేతనంతో నియమించారు. ఐటీ పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యతను ఆమెకు కట్టబెట్టారు. కానీ, సాధించింది శూన్యం. - భార్యాభర్తలైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కుమారుడిని నెలకు రూ.లక్ష వేతనంతో తీసుకున్నారు. అతడు విజయవాడ, హైదరాబాద్ మధ్య తిరగడం తప్ప చేసేదేమీ ఉండదు. - గతంలో ‘ముఖ్య’నేత భద్రతా విభాగంలో పనిచేసిన ఐపీఎస్ అధికారి కుమార్తెను కూడా నెలకు రూ.లక్షల వేతనంపై ఆర్థికాభివృద్ధి మండలిలోకి తీసుకున్నారు. - రాజధాని జిల్లాకు చెందిన ఒక మంత్రి బంధువును నెలకు రూ.లక్ష వేతనంతో విజయవాడలో పని చేయడానికి నియమించారు. ఢిల్లీలో పనిచేయడానికి నెలకు రూ.1.80 లక్షల వేతనంతో ఒకరిని నియమించారు. మరో వ్యక్తిని నెలకు రూ.2.50 లక్షల చొప్పున వేతనంతో చేర్చుకున్నారు. ఇతడు పలుసార్లు విదేశాల్లో పర్యటించి వచ్చాడు. - గతంలో నెలకు రూ.30,000 జీతానికి పనిచేసిన వ్యక్తిని ఆర్థికాభివృద్ధి మండలిలో చేర్చుకుని, ఇప్పుడు నెలకు రూ.1.50 లక్షల వేతనం చెల్లిస్తున్నారు. అలాగే వైస్ చైర్మన్ పేరుతో మండలిలో చేరిన ఓ వ్యక్తికి నెలకు రూ.1.50 లక్షలు అందజేస్తున్నారు. - పశు సంవర్థక శాఖలో డైరెక్టర్ హోదాలో ఉన్న ఉద్యోగిని డిప్యూటేషన్‌పై ఆర్థికాభివృద్ధి మండలిలో నియమించారు. ఇతడు హైదరాబాద్‌లోనే ఉంటూ తనకు నచ్చినప్పుడే కార్యాలయానికి వస్తుంటాడు. -
సీఎం టూర్ల పెండింగ్ బిల్లులు 19 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 13 జిల్లాల్లో గత ఏడాదికాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన పర్యటనలకైన పెండింగ్ బిల్లులు ఏకంగా రూ.19 కోట్లు పేరుకుపోయాయి. వీటినెలా చెల్లించాలో తెలియక కలెక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. హోటళ్లు, ఇతర ఏర్పాట్లకోసం అయిన పెండింగ్ బిల్లులను చెల్లిస్తేగానీ తదుపరి ఏర్పాటు చేయలేమని కలెక్టర్లకు సంబంధితులు స్పష్టం చేస్తున్నారు. దీంతో పెండింగ్ బిల్లుల వ్యవహారాన్ని కలెక్టర్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై చిత్తూరు, విశాఖపట్నం, కృష్ణా జిల్లాలకు పెండింగ్ బిల్లుల చెల్లింపుకోసం రూ.మూడేసి కోట్ల చొప్పున రూ.9 కోట్లు, మిగతా పది జిల్లాలకు జిల్లాకో రూ.కోటి చొప్పున రూ.పది కోట్లను విడుదల చేయాలంటూ సీఎస్ ఇటీవల ఆర్థికశాఖను ఆదేశించారు. అయితే మొత్తం రూ.19 కోట్లు విడుదల చేయాలంటే బడ్జెట్ కేటాయింపులు లేవు. ఈ నేపథ్యంలో అదనపు నిధులను విడుదల చేయాల్సి ఉంది. కానీ అదనపు నిధులు విడుదలచేసే అధికారం ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పీ.వీ.రమేశ్‌కు మాత్రమే ఉంది. ఆయన ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన సోమవారంగానీ విధులకు హాజరుకారు. అప్పటివరకు అదనపు నిధుల విడుదలకు వేచిఉండాల్సిందే. ఈ విషయం తెలియని సీఎస్ ఇంకా నిధులు ఎందుకు విడుదల చేయలేదంటూ ఆర్థికశాఖ కార్యదర్శి రవిచంద్రపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే బడ్జెట్లో కేటాయింపులున్న మేరకే నిధులు విడుదల చేసే అధికారం రవిచంద్రకుంది. ప్రాథమిక మిషన్ భేటీకి రూ.26 లక్షలు.. ఇదిలాఉండగా సీఎం చంద్రబాబునాయుడు ప్రాథమిక మిషన్ సమీక్ష పేరుతో శుక్రవారం విజయవాడలో నిర్వహించిన సమావేశానికి ఏకంగా రూ.26 లక్షలు ఖర్చయింది. ఇందులో పాల్గొనే అధికారుల బసకోసమే ఏకంగా రూ.11 లక్షలు ఖర్చవుతోంది. ఈ సమావేశంలో 13 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతోపాటు మంత్రులు, వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వారికి ఉదయం టిఫిన్లు, భోజనాలు ఇతర కార్యక్రమాలకు రూ.26 లక్షల్ని వ్యయం చేయడంపై అధికారవర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. 13 జిల్లాల కలెక్టర్లను హైదరాబాద్‌కు రప్పించి హోటల్లో సమావేశం ఏర్పాటు చేసినా.. రూ.ఐదు లక్షలకు మించి వ్యయమయ్యేది కాదని వ్యాఖ్యానిస్తున్నాయి. అసలు ప్రాథమిక మిషన్‌కు వృద్ధి లక్ష్యాలను పెట్టడమే తప్పనేది ఆ వర్గాల వాదన . వ్యవసాయరంగానికి ప్రభుత్వ మద్దతుగా నిధులు సమకూర్చాలిగానీ వృద్ధికి లక్ష్యాలను నిర్ధారించడం సమంజసం కాదనే వాదన వినిపిస్తోంది.