సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 13 జిల్లాల్లో గత ఏడాదికాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన పర్యటనలకైన పెండింగ్ బిల్లులు ఏకంగా రూ.19 కోట్లు పేరుకుపోయాయి. వీటినెలా చెల్లించాలో తెలియక కలెక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. హోటళ్లు, ఇతర ఏర్పాట్లకోసం అయిన పెండింగ్ బిల్లులను చెల్లిస్తేగానీ తదుపరి ఏర్పాటు చేయలేమని కలెక్టర్లకు సంబంధితులు స్పష్టం చేస్తున్నారు. దీంతో పెండింగ్ బిల్లుల వ్యవహారాన్ని కలెక్టర్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై చిత్తూరు, విశాఖపట్నం, కృష్ణా జిల్లాలకు పెండింగ్ బిల్లుల చెల్లింపుకోసం రూ.మూడేసి కోట్ల చొప్పున రూ.9 కోట్లు, మిగతా పది జిల్లాలకు జిల్లాకో రూ.కోటి చొప్పున రూ.పది కోట్లను విడుదల చేయాలంటూ సీఎస్ ఇటీవల ఆర్థికశాఖను ఆదేశించారు. అయితే మొత్తం రూ.19 కోట్లు విడుదల చేయాలంటే బడ్జెట్ కేటాయింపులు లేవు. ఈ నేపథ్యంలో అదనపు నిధులను విడుదల చేయాల్సి ఉంది. కానీ అదనపు నిధులు విడుదలచేసే అధికారం ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పీ.వీ.రమేశ్‌కు మాత్రమే ఉంది.
ఆయన ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన సోమవారంగానీ విధులకు హాజరుకారు. అప్పటివరకు అదనపు నిధుల విడుదలకు వేచిఉండాల్సిందే. ఈ విషయం తెలియని సీఎస్ ఇంకా నిధులు ఎందుకు విడుదల చేయలేదంటూ ఆర్థికశాఖ కార్యదర్శి రవిచంద్రపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే బడ్జెట్‌లో కేటాయింపులున్న మేరకే నిధులు విడుదల చేసే అధికారం రవిచంద్రకుంది.
ప్రాథమిక మిషన్ భేటీకి రూ.26 లక్షలు..
ఇదిలాఉండగా సీఎం చంద్రబాబునాయుడు ప్రాథమిక మిషన్ సమీక్ష పేరుతో శుక్రవారం విజయవాడలో నిర్వహించిన సమావేశానికి ఏకంగా రూ.26 లక్షలు ఖర్చయింది. ఇందులో పాల్గొనే అధికారుల బసకోసమే ఏకంగా రూ.11 లక్షలు ఖర్చవుతోంది. ఈ సమావేశంలో 13 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతోపాటు మంత్రులు, వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వారికి ఉదయం టిఫిన్లు, భోజనాలు ఇతర కార్యక్రమాలకు రూ.26 లక్షల్ని వ్యయం చేయడంపై అధికారవర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. 13 జిల్లాల కలెక్టర్లను హైదరాబాద్‌కు రప్పించి హోటల్‌లో సమావేశం ఏర్పాటు చేసినా.. రూ.ఐదు లక్షలకు మించి వ్యయమయ్యేది కాదని వ్యాఖ్యానిస్తున్నాయి. అసలు ప్రాథమిక మిషన్‌కు వృద్ధి లక్ష్యాలను పెట్టడమే తప్పనేది ఆ వర్గాల వాదన . వ్యవసాయరంగానికి ప్రభుత్వ మద్దతుగా నిధులు సమకూర్చాలిగానీ వృద్ధికి లక్ష్యాలను నిర్ధారించడం సమంజసం కాదనే వాదన వినిపిస్తోంది.
సీఎం టూర్ల పెండింగ్ బిల్లులు 19 కోట్లు
Published Sat, Jun 27 2015 1:51 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM
Advertisement
Advertisement