మూలకణ చికిత్సతో చిన్నారికి ఊపిరి!
సాక్షి, హైదరాబాద్: దేశంలో మూలకణ చికిత్సా విధానంలో తమిళనాడులోని వెల్లూరు సీఎంసీ ఆసుపత్రి వైద్యులు అరుదైన విజయం సాధించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన గొండు మురళి, చాందిని దంపతుల కుమార్తె ప్రణతి (3)కి లుకేమియా (బ్లడ్ కేన్సర్) నుంచి విముక్తి ప్రసాదించారు. రెండేళ్ల క్రితం.. ఏడాది వయసులో ఉన్నప్పుడే అక్యూట్ లింఫోసైటిక్ లుకేమియా(ఏఏఎల్) రూపంలో ప్రా ణాంతక వ్యాధి బారిన పడ్డ ప్రణతికి వారు ఖమ్మం జిల్లాకు చెందిన దాత సాదినేని వెంకటేశ్వరావు నుంచి సేకరించిన మూలకణాలతో 2011 జూలైలో చికిత్స చేశారు. చెన్నైలోని దాత్రి బ్లడ్ స్టెమ్‌సెల్ డోనర్ రిజిస్ట్రీ స్వచ్ఛంద సంస్థ కూడా తోడ్పాటునందించింది.
ప్రణతి ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది. మూలకణ చికిత్సకు రోగి లేదా దగ్గరి బంధువుల నుంచే మూలకణాలు సేకరిస్తుంటారు. పరాయి వ్యక్తి మూలకణాలతో ఈ చికిత్స చే యడం దేశంలో ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో మూలకణాల దాత, గ్రహీతలతో కలిసి దాత్రి సీఈవో రఘు రాజగోపాల్ గురువారమిక్కడ తాజ్‌బంజారా హోటల్లో మీడియాతో మాట్లాడారు. ఈ చికిత్సకు 5 నుంచి 8 లక్షల రూపాయల వరకూ ఖర్చవుతుందని తెలిపారు. కాగా ఢిల్లీలోని ఓ బ్లడ్ కేన్సర్ రోగికోసం బసవతారకం కేన్సర్ ఆసుపత్రి వైద్యులు కూడా ఓ దాత నుంచి మూలకణాలు సేకరించి పంపారు.