బకాయిలు చెల్లిస్తే కేసులు ఎత్తేస్తాం
- పౌరసరఫరాలశాఖ కమిషనర్ సీవీ ఆనంద్
హైదరాబాద్: కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిల వసూలుపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా ఎగవేతదారుల జాబితాను తయారు చేశారు. ఇందు కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. 2010-11 నుంచి 2014-15 వరకు 115మంది మిల్లర్ల నుంచి రూ.134 కోట్ల విలువ చేసే 57,781 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి రావాల్సి ఉందన్నారు.
పౌరసరఫరాలశాఖ భవన్లో సీఎంఆర్ ఎగవేసిన మిల్లర్లతో కమిషనర్ బుధవారం సమావేశం నిర్వహించారు. ఎగవేతదారుల వివరాలను అందించి పలు ప్రతిపాదనలను మిల్లర్ల ముందుంచారు. దీనిపై సంబంధిత శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. నవంబర్ 30లోగా సీఎంఆర్ బకాయిలు మొత్తం చెల్లిస్తే కేసులు ఎత్తివేసి సీజ్ అయిన వాటిని తెరిపించి మిల్లింగ్ సామర్థ్యాన్నిబట్టి సీఎంఆర్ ధాన్యం కేటాయిస్తామన్నారు. 75శాతం బకాయిలు చెల్లిస్తే సామర్థ్యాన్నిబట్టి ధాన్యం కేటాయిస్తామంటూ మిగిలిన 25శాతం జనవరి 31లోగా చెల్లించాలని సూచించారు.