అడ్వాంటేజ్ డొనాల్డ్ ట్రంప్.. హారిస్‌తో ఉత్కంఠ పోరు
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పది రోజులే మిగిలి ఉంది. పోలింగ్ తేదీ నవంబర్ 5 దగ్గర పడుతున్న కొద్దీ ప్రచార హోరు పెరిగింది. పోల్స్ ఫలితాలు కూడా తారుమారవుతున్నాయి. అధ్యక్ష బరి నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకొన్న మొదట్లో వరుస పోల్స్ హారిస్ వైపే మొగ్గు చూపాయి. కానీ తీరా పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ పరిస్థితి క్రమంగా తారుమారు అవుతున్నట్టు కన్పిస్తోంది. కీలక రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యంలోకి వెళ్తున్నారు. అంతేగాక తాజా పోల్స్‌లో సానుకూలతను పెంచుకున్నారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ట్రంప్, హారిస్ పోరు తారాస్థాయికి చేరుతోంది. మొన్నటిదాకా సర్వేల్లో హారిస్ ఆధిక్యంలో ఉండగా తాజాగా ట్రంప్ కాస్త ముందంజలోకి వచ్చారు. వాల్ స్ట్రీట్ జర్నల్ తాజా సర్వేలో ట్రంప్ 47 శాతం మద్దతు దక్కించుకోగా హారిస్‌కు 45 శాతం ఓట్లు పోలయ్యాయి. సీఎన్‌బీసీ ఆల్ అమెరికన్ ఎకనమిక్ సర్వేలోనూ హారిస్ కంటే ట్రంప్ రెండు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. హోరాహోరీ పోరు సాగుతున్న 7 కీలక స్వింగ్ రాష్ట్రాల్లోనూ తాజా సర్వేల్లో హారిస్ కంటే ట్రంప్ ఒక్క పాయింట్ ఆధిక్యం సాధించారు. డెమొక్రాట్ల కంచుకోటలైన మిషిగన్, విస్కాన్సిన్, పెన్సిల్వేనియాతో పాటు నల్లజాతీయులు, లాటినో ఓటర్లలో ఆయన పట్టు సాధిస్తున్నారు.ఇది డెమొక్రాట్లకు ఆందోళన కలిగిస్తోంది. అయితే ప్రాంతీయ, జాతీయ స్థాయిలో ప్రధాన పోల్స్ అన్నింటినీ విశ్లేషించే రియల్క్లియర్పాలిటిక్స్ ప్రకారం హారిస్ ఇప్పటికీ ట్రంప్‌పై 0.3 శాతం ఆధిక్యంలో ఉన్నారు. కాకపోతే స్వింగ్ స్టేట్లలో మాత్రం ట్రంప్‌కే 0.9 శాతం మొగ్గుందని అది తేల్చింది. అమెరికా బెట్టింగ్ మార్కెట్ అయితే ట్రంప్ విజయావకాశాలను ఏకంగా 61 శాతంగా అంచనా వేసింది. హారిస్ గెలిచేందుకు 39 శాతం మాత్రమే చాన్సుందని పేర్కొంది. ట్రంప్‌పై కొన్ని రోజులుగా హారిస్ తీవ్ర విమర్శలు చేస్తుండటం తెలిసిందే. హిట్లర్‌ను ప్రశంసించిన ట్రంప్ అంతకంటే నియంత అంటూ దుయ్యబట్టారు. ఆయనో అసమర్థుడని ఎద్దేవా చేశారు. ట్రంప్ మళ్లీ అధికారంలోకి వస్తే పర్యవసానాల గురించి పదేపదే హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హారిస్ పాపులర్ ఓట్లను గెలుచుకోవచ్చని సర్వేలంటున్నాయి. కానీ కీలక రాష్ట్రాలను కైవసం చేసుకుంటేనే ఎన్నికల విజయం సాధ్యం. మరోవైపు చాలా రాష్ట్రాల్లో ఓటర్లకు హారిస్‌పై పలు అంశాల్లో ఇప్పటికీ అభ్యంతరాలున్నాయి. మరోవైపు ముందస్తు ఓటేసిన అమెరికన్ల సంఖ్య 3.1 కోట్లు దాటింది.పెన్సిల్వేనియాలో ట్రంప్ ఆధిక్యంస్వింగ్ రాష్ట్రాల్లో అత్యంత ముఖ్యమైనది పెన్సిల్వేనియా. వాటిలో అత్యధికంగా 19 ఎలక్టోరల్ కాలేజీ ఓటు్లున్న రాష్ట్రం. ఇక్కడి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రకటనలపైనే రెండు పార్టీలు కోట్లు వెచ్చించాయి. ఇక్కడి ఓటర్లు ఆర్థిక వ్యవస్థపై చాలా ఆందోళన చెందుతున్నారు. వారు క్రమంగా ట్రంప్ వైపే మొగ్గుతున్నారు. వివాదాస్పద, కుంభకోణాల వ్యక్తిగా ట్రంప్‌పై విముఖత ఉన్నా ఆయన హయాంలో ఆహారం, పెట్రోల్ ధరలు తక్కువగా ఉండేవని అభిప్రాయపడుతున్నారు. ఇక్కడి మహిళలు మాత్రం హారిస్ పట్ల సానుకూలంగా ఉన్నారు. ‘‘ట్రంప్ వ్యాఖ్యలు, ఆయన ప్రవర్తన దారుణం. ఆయన్ను మరోసారి వైట్‌హౌస్‌కు పంపించేదే లేదు’’ అంటున్నారు. కాంగ్రెస్ మాజీ సభ్యురాలు, మాజీ ఉపాధ్యక్షుడు డిక్ షెనీ కూతురు లిజ్ షెనీ వంటివారి ప్రచారం కూడా హారిస్‌కు ఎంతో కొంత కలిసి రానుంది.‘అబార్షన్ హక్కులు’ ప్రభావం చూపేనా?హారిస్‌కు అమెరికావ్యాప్తంగా ఉన్న సానుకూలత మహిళా ఓటర్లలో బలమైన ఆధిక్యం. ఆమె అభ్యర్థిత్వమే చరిత్రాత్మకం. కానీ ఆమె దీనిపై ప్రచారం చేసుకోవడం లేదు. మహిళల అబార్షన్ హక్కులకు బలంగా మద్దతిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు ప్రవేశపెట్టిన అత్యంత కఠినమైన అబార్షన్ నిషేధం మహిళలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీన్ని రాజ్యాంగంలో చేర్చాలా వద్దా అనే అంశాన్ని పది రాష్ట్రాలు ఓటింగ్‌కు పెట్టాయి. అలాంటి రాష్ట్రాల్లో అరిజోనాలో హారిస్‌కు మెజారిటీ వచ్చే అవకాశముంది. అయితే అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగినప్పుడు సృష్టించిన వాతావరణాన్ని హారిస్ బలంగా కొనసాగించలేకపోయినట్టు పోల్స్ చెబుతున్నాయి.డెమొక్రాట్లకు ‘గాజా’ షాక్ట్రంప్కే అరబ్–అమెరికన్ల జయహోకీలక రాష్ట్రాల్లో ఒకటైన మిషిగన్‌లో అరబ్–అమెరికన్ ఓటర్లు అత్యధికంగా ఉంటారు. 2020లో బైడెన్ కేవలం అక్కడ 1.5 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు, ఇక్కడ అరబ్ అమెరికన్ల జనాభా 3 లక్షలు. గాజా, లెబనాన్లలో ఇజ్రాయెల్ దాడులను నియంత్రించడంలో బైడెన్ విఫలమయ్యారని వారంతా భావిస్తున్నారు. ఈ ప్రభావం నేరుగా డెమొక్రాట్ల అభ్యర్థి హారిస్‌పై పడేలా ఉంది. ఉపాధ్యక్షురాలిగా హారిస్ కూడా దీనికి బాధ్యురాలేనని వారు భావిస్తున్నారు. డెమొక్రాట్ల కంటే అధిక వామపక్ష భావాలున్న వారిలోనూ ఇదే ధోరణి కనబడుతోంది. ‘‘మేమంతా ట్రంప్‌కు ఓటేస్తాం. అంతేగాక ఆయనకే ఓటేయాలని ఇతరులకూ చెబుతాం’’ అని వారంటున్నారు. ‘‘మేం ట్రంప్‌కు ఓటేస్తామని ఏడాది కిందట ఊహించను కూడా లేదు. కానీ ఇప్పుడు డెమొక్రాట్లను క్షమించలేం. హారిస్‌కు ఓటేసేది లేదు’’ అని స్పష్టంగా చెబుతున్నారు. మిషిగన్‌లో కార్మికవర్గం, యూనియన్ల ఓట్లు కూడా కీలకంగా మారనున్నాయి. తామెవరికీ మద్దతివ్వబోమని ఇప్పటికే కొన్ని యూనియన్లు ప్రకటించాయి. హారిస్‌పై కొన్ని అభ్యంతరాలున్నా ఆమె తప్ప ప్రత్యామ్నాయం లేదని కొందరు భావిస్తుండటం ఆమెకు కాస్త కలిసొచ్చే అంశం.– సాక్షి, నేషనల్ డెస్క్