CNG price
-
CNG Price: సీఎన్జీ వినియోగదారులకు చేదు వార్త
సాక్షి, హైదరాబాద్: కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధర మళ్లీ పెరిగింది. కిలోపై రూ. 2 పెరగడంతో హైదరాబాద్‌లో దీని ధర రూ.92కు చేరింది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తట్టుకోలేక సీఎన్జీ వైపు వాహనదారులు మొగ్గు చూపుతుండగా తాజాగా సీఎన్జీ ధర కూడా అదే స్థాయికి ఎగబాగుతోంది. మరోవైపు పెట్రోల్ బంకులో కిలో ధరపై అదనంగా రూ.5 నుంచి రూ.10 బాదేస్తున్నాయి. కాలుష్య రహితంతో పాటు మైలేజీ అధికంగా వస్తుందన్న కారణంతో సీఎన్జీ వినియోగం వైపు వెళితే.. పెరిగిన ధరలతో మళ్లీ వెనక్కి వెళ్లని పరిస్థితి నెలకొంది. వాస్తవంగా పెట్రోల్, డీజిల్ కంటే సీఎన్జీ, గ్యాస్‌తో నడిచే వాహనాలు మైలేజీ అధికంగా ఇస్తాయి. పెట్రోల్, డీజిల్ లీటర్‌కు 15 నుంచి 20 కిలో మీటర్ల వరకు మైలేజీ ఇస్తే సీఎన్జీ, ఆటో గ్యాస్, ఎల్పీజీ కిలోకు 22 నుంచి 28 కిలో మీటర్ల వరకు మైలేజీ వస్తుందని అంచనా. ప్రయాణికులను చేరేవేసే ఆటోలు, ఇతర వాహనదారులు తమ ట్యాంకులను ఎక్కువ శాతం సీఎన్జీకి బదిలీ చేసుకున్నాయి. మరోవైపు ఇంధన కొరత మహానగరంలో సీఎన్జీ కొరత ఏర్పడింది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను తట్టుకోలేక సీఎన్జీ గ్యాస్ కిట్లు అమర్చుకున్న వాహనాలకు కొరత వెంటాడుతోంది. గత ఆరు నెలలలో వాహనాల సంఖ్య ఎగబాగడంతో సీఎన్జీ బంకులకు సరఫరా అవుతున్న గ్యాస్ ఏ మూలకు సరిపోని పరిస్థితి నెలకొంది. బంకుల్లో లోడ్ నింపిన నాలుగైదు గంటల్లోనే గ్యాస్ నిండుకుంటోంది. ఫలితంగా వాహనదారులు సీఎన్జీ కోసం క్యూ కడుతున్నారు. (క్లిక్ చేయండి: అత్యంత విలువైన రైల్వే భూముల్లో రియల్ దందా) -
సీఎన్జీ ధరలు తగ్గించాలి, కేంద్రానికి సియామ్ విజ్ఞప్తి!
న్యూఢిల్లీ: సీఎన్జీ ధరలను తగ్గించాలని ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. పర్యావరణ సుస్థిర లక్ష్యాల సాధనకు ఇది అవసరమని పేర్కొంది. గడిచిన కొన్ని నెలల్లో సీఎన్జీ ధరలు అసాధారణంగా పెరిగినట్టు గుర్తు చేసింది. సామాజిక, ఆర్థిక, పర్యావరణ అనుకూల లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వం నుంచి సరైన మద్దతును, సరైన సమయంలో కోరుకుంటున్నట్టు సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు. జాతి లక్ష్యాలైన చమురు దిగుమతులను తగ్గించుకోవడం, స్వచ్ఛమైన పర్యావరణం సాకారానికి.. పరిశ్రమ, ప్రభుత్వం మధ్య సహకార ధోరణి ఉండడం అభినందనీయమన్నారు. ‘‘సీఎన్జీని ప్రోత్సహించడం, నెట్వర్క్ విస్తరణ విషయంలో ప్రభుత్వ కృషికి మద్దతుగా.. సీఎన్జీ వాహన ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు ఆటోమొబైల్ పరిశ్రమ కట్టుబడి ఉంది’’అని రాజేష్ మీనన్ ఓ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం కేంద్ర పెట్రోలియం,సహజవాయువుల మంత్రి హర్దీప్సింగ్ పూరి 166 సీఎన్జీ స్టేషన్లను ప్రారంభించారు. గత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 1,332 సీఎన్జీ స్టేషన్లు ఏర్పాటు కావడం గమనార్హం. -
సీఎన్జీ ధరలను తగ్గించండి
న్యూఢిల్లీ: స్టీల్, ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీకి వినియోగించే పలు మడి పదార్థాల దిగుమతులపై సుంకాలు తగ్గించాలని, సీఎన్జీ ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆటోమొబైల్ తయారీ సంస్థల సంఘం సియామ్ కోరింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాల తగ్గింపును ఆహ్వానించింది. ఈ నిర్ణయం ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గిస్తుందని, అంతిమంగా సామాన్యుడికి ప్రయోజనం కలిగిస్తుందని సియామ్ తన ట్విట్టర్ పేజీలో ప్రకటించింది. స్టీల్, ప్లాస్టిక్ తయారీకి సంబంధించిన కొన్ని ముడి పదార్థాలపై దిగుమతి సుంకాలు తగ్గించడంతోపాటు.. స్టీల్ ఇంటర్ మీడియట్స్పై సుంకాలు పెంచడం వల్ల దేశీ మార్కెట్లో స్టీల్ ధరలు మోస్తరు స్థాయికి దిగొచ్చేందుకు సాయపడుతుందని పేర్కొంది. గత ఏడు నెలల కాలంలో సీఎన్జీ ధరలు గణనీయంగా పెరిగినందున దీనిపైనా ఉపశమనం కల్పించాలని పరిశ్రమ కోరింది. చదవండి: ఎలక్ట్రిక్ వాహనాలు ప్రమాదాలు.. డీఆర్డీవో రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు -
సహజవాయువు ధర పెంపు 50 శాతమే!
న్యూఢిల్లీ: గ్యాస్ ధరల కొత్త విధానంపై ఏర్పాటైన నలుగురు సభ్యుల కమిటీ రూపొందించిన నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి అందించినట్లు తెలుస్తోంది. నివేదికలో గ్యాస్ ధరను 50%మేర పెంచేందుకు వీలుగా సూచనలు చేసినట్లు అత్యున్నత అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, గత యూపీఏ ప్రభుత్వం గ్యాస్ ధరను రెట్టింపు చేసేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. గ్యాస్ ధరను ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్(ఎంబీటీయూ)కు 8.4 డాలర్లకు పెంచుతూ ఈ ఏడాది జనవరిలో వెలువడ్డ నోటిఫికేషన్‌ను సవరించేందుకు ప్రభుత్వం గత నెలలో ఒక కమిటీని నియమించింది. దీనిలో ఆయిల్ శాఖలోని అదనపు కార్యదర్శితోపాటు విద్యుత్, ఎరువులు, వ్యయ కార్యకలాపాల కార్యదర్శులుసభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఇచ్చిన నివేదికను ఆయిల్ శాఖ సమీక్షించాక క్యాబినెట్‌కు పంపనున్నట్లు ప్రభుత్వాధికారి చెప్పారు. నివేదికలో విషయాలను గోప్యంగా ఉంచినప్పటికీ, గ్యాస్ ధరను రెట్టింపు చేయకుండా 50% వరకూ పెంచేందుకు ప్రతిపాదించినట్లు తెలిపారు. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌ను ప్రస్తుతం ఒక ఎంబీటీయూకి 4.2 డాలర్లకు విక్రయిస్తున్నారు. అయితే డిమాండ్‌కు సరఫరాకు మధ్య సమతుల్యాన్ని సాధించేలా కార్యదర్శుల కమిటీ గ్యాస్ ధరపై విధానాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందుకు వివిధ రకాల క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్‌పై వ్యయాలనూ, విద్యుత్, ఎరువుల పరిశ్రమల డిమాండ్‌నూ కమిటీ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ చివరికల్లా గ్యాస్ ధరను ప్రకటించే అవకాశమున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కాగా, గ్యాస్ ధరను ఒక ఎంబీటీయూకి 2 డాలర్ల చొప్పున పెంచితే యూరియా, విద్యుత్, సీఎన్జీ ధరలకు రెక్కలొస్తాయి. ప్రభుత్వానికి మాత్రం పన్నులు, రాయల్టీ రూపంలో రూ.12,900 కోట్లు అదనంగా లభిస్తాయి.