
న్యూఢిల్లీ: సీఎన్‌జీ ధరలను తగ్గించాలని ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. పర్యావరణ సుస్థిర లక్ష్యాల సాధనకు ఇది అవసరమని పేర్కొంది. గడిచిన కొన్ని నెలల్లో సీఎన్‌జీ ధరలు అసాధారణంగా పెరిగినట్టు గుర్తు చేసింది.
సామాజిక, ఆర్థిక, పర్యావరణ అనుకూల లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వం నుంచి సరైన మద్దతును, సరైన సమయంలో కోరుకుంటున్నట్టు సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు. జాతి లక్ష్యాలైన చమురు దిగుమతులను తగ్గించుకోవడం, స్వచ్ఛమైన పర్యావరణం సాకారానికి.. పరిశ్రమ, ప్రభుత్వం మధ్య సహకార ధోరణి ఉండడం అభినందనీయమన్నారు.
‘‘సీఎన్‌జీని ప్రోత్సహించడం, నెట్‌వర్క్ విస్తరణ విషయంలో ప్రభుత్వ కృషికి మద్దతుగా.. సీఎన్‌జీ వాహన ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు ఆటోమొబైల్ పరిశ్రమ కట్టుబడి ఉంది’’అని రాజేష్ మీనన్ ఓ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం కేంద్ర పెట్రోలియం,సహజవాయువుల మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరి 166 సీఎన్‌జీ స్టేషన్లను ప్రారంభించారు. గత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 1,332 సీఎన్‌జీ స్టేషన్లు ఏర్పాటు కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment