రేపటి నుంచే మున్సిపల్ నామినేషన్లు
కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్ : మున్సిపల్ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ జారీచేయనున్నారు. 10 నుంచి 13వ తేదీ వరకు ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మున్సిపాలిటీలలో అయితే 14వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఇప్పటికే కడప కార్పొరేషన్‌తోపాటు ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు, ఎర్రగుంట్ల, రాయచోటి, బద్వేలు మున్సిపాలిటీలలో రిటర్నింగ్ అధికారుల నియామకం పూర్తయింది. కడపలో 13 మంది రిటర్నింగ్ అధికారులను నియమించి ఏయే డివిజన్లకు ఎక్కడ నామినేషన్లు దాఖలు చేయాలనే సమాచారాన్ని కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు.
ఇతర మున్సిపాలిటీలలో కూడా ఏ వార్డుకు సంబంధించిన వారు ఎక్కడ నామినేషన్ పత్రాలు దాఖలు చేయాలనే విషయాన్ని బహిర్గతం చేశారు.ఎన్నికలు సమీపించడంతో అభ్యర్థులు ఆత్మీయ పలకరింపులతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. టీకొట్లు, ప్రధాన కూడళ్లు, రచ్చబండల వద్ద అందరినీ వరుసలు పెట్టి పలుకరిస్తూ ఎన్నికల అంశాన్ని కూడా జోడించి తనకు మద్దతు ఇవ్వాలనే ప్రచారాన్ని ప్రారంభించారు. గతంలో మనస్పర్థలు, అభిప్రాయ బేధాలున్నా వాటన్నింటినీ పక్కనబెట్టి అందరినీ కలుపుకొని పోయేలా సంభాషణలు సాగుతున్నాయి.