బ్యాంకింగ్ రంగం.. కెరీర్ స్వరూపం
మన దేశంలోని బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకు లు ముఖ్యమైనవి. సహకార (కో-ఆపరేటివ్) బ్యాంకు లు, గ్రామీణ బ్యాంకులు కూడా ఉన్నప్పటికీ వాటిలో ఉద్యోగాలు స్థానికులకు మాత్రమే కేటాయించినందువల్ల ఆయా ప్రాంతాల్లో నివసించే వారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వాటిలో ఉద్యోగాల సంఖ్య కూడా పరిమితంగా ఉంటుంది.
భారత దేశం.. బ్యాంకింగ్ స్వరూపం
భారతదేశంలో మొదటి సారిగా 1969లో అప్పటి ప్రధా ని ఇందిరా గాంధీ 14 ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేశారు. తర్వాత 1980లో మరో ఆరు బ్యాంకులను జాతీయం చేశారు. ఆ విధంగా రెండు దశాబ్దాల పాటు 20 జాతీయ బ్యాంకులు ఉండేవి. తర్వాత కొన్ని చిన్న బ్యాంకులను లాభదాయకత సరిగా లేని కారణంగా పెద్ద బ్యాంకుల్లో విలీనం చేశారు. ఈ గ్రూపులోకి ఆంధ్రా బ్యాంక్, కెనరా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేనా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, విజయా బ్యాంక్ వంటివి వస్తాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) భారత దేశంలో అత్యధిక శాఖలు కలిగి అనేక విషయాల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. దీనికి ఏడు అనుబంధ బ్యాంకులుండేవి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్‌లను ఎస్బీఐలో విలీనం చేయడం వల్ల ఇప్పుడు అయిదు అనుబంధ బ్యాంకులు మాత్రమే ఉన్నాయి. అవి: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్కూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా.హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఇండ్స్ఇండ్, కర్ణాటక, లక్ష్మీవిలాస్, యునెటైడ్ వెస్టర్న్ బ్యాంక్, యూటీఐ వంటివి ప్రైవేటు రంగ బ్యాంకులు. ఏబీఎన్ ఆమ్రో, అబూదబి కమర్షియల్, బ్యాంక్ ఆఫ్ సిలన్, సిటీ బ్యాంక్, హెచ్ఎస్బీసీ, స్టాండర్డ్ ఛార్టర్డ వంటివి విదేశీ బ్యాంకులు.
నియామక ప్రక్రియ
అన్ని రకాల బ్యాంకుల్లోనూ క్లరికల్ కంటే దిగువ స్థాయి ఉద్యోగాల్లో స్థానికులకు మాత్రమే అవకాశం లభిస్తుంది. సాధారణంగా ఉపాధి కల్పన కార్యాలయాల ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. క్లరికల్, ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు అభ్యర్థులు డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. కొన్ని బ్యాంకులు డిగ్రీలో నిర్దేశిత మార్కులు సాధించాలని నిబంధనలు విధిస్తున్నాయి. ఈ ఉద్యోగాల భర్తీ సాధారణంగా రాత పరీక్షల ద్వారా జరుగుతుంది. ఐబీపీఎస్ ఉమ్మడి రాత పరీక్ష ద్వారా ప్రభుత్వ రంగ, కొన్ని ప్రైవేటు రంగ బ్యాంకులకు ఉద్యోగ నియామకాల ప్రక్రియను నిర్వహిస్తోంది. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), దాని అనుబంధ బ్యాంకుల్లో భర్తీకి ఎస్బీఐ ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తోంది. విదేశీ బ్యాంకులు మాత్రం పేరొందిన విద్యా సంస్థల (ఐఐఎంలు వంటివి)ల్లో క్యాంపస్ రిక్రూట్మెంట్లు నిర్వహించి ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అనుభవం ఉన్న వారికి అధిక వేతనాలు ఇవ్వడం ద్వారా ఆకర్షిస్తున్నాయి.
రాత పరీక్ష నుంచి శిక్షణ వరకు
బ్యాంకు ఉద్యోగాలకు నిర్వహించే రాత పరీక్ష కోసం అభ్యర్థులు జనరల్ ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, మార్కెటింగ్, కంప్యూటర్ అవేర్నెస్లకు సంబంధించిన అంశాలను నేర్చుకోవాలి. వీటిని క్షుణ్నంగా నేర్చుకోవడం ద్వారా అన్ని బ్యాంకుల పరీక్షలకూ సిద్ధం కావచ్చు. క్లరికల్ పరీక్షలతో పోలిస్తే ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల భర్తీ పరీక్షల స్థాయి కొంచెం ఎక్కువగా ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుంది. కొన్ని బ్యాంకులు బృంద చర్చ (జీడీ) కూడా నిర్వహిస్తాయి. ఉద్యోగంలో చేరిన అభ్యర్థులను కొంత కాలం శిక్షణ కాలంలో ఉంచుతారు. ప్రత్యేక శిక్షణ కళాశాలల్లోనూ, బ్యాంకుల శాఖల్లోనూ శిక్షణ ఉంటుంది. ఎస్బీఐలో అయితే అభ్యర్థులకు శిక్షణ ఇచ్చిన తర్వాత పరీక్షలు కూడా నిర్వహిస్తారు.
క్లరికల్ ఉద్యోగులు ఫ్రంట్ ఆఫీస్ విధులు నిర్వహిస్తారు. ఆఫీసర్ స్థాయి ఉద్యోగులు క్లరికల్ ఉద్యోగుల పనిని పర్యవేక్షిస్తారు. బ్యాంకుల్లో ప్రతి పనీ డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ ద్వారా జరుగుతుంది. అదే విధంగా మేకర్- చెకర్ విధానాన్ని పాటిస్తారు. క్లరికల్ స్థాయి ఉద్యోగులు మేకర్ పని, ఆఫీసర్స్థాయి ఉద్యోగులు చెకర్ పని చేస్తారు. ఇంతకుముందు రోజుల్లో క్లర్క్ కమ్ క్యాషియర్; క్లర్క్ కమ్ టైపిస్ట్ అనే రెండు హోదాల్లో క్లరికల్ నియామకాలు జరిపేవారు. కంప్యూటరీకరణ పెరిగిన నేపథ్యంలో ఈ రెండింటినీ కలిపి క్లర్క్ కమ్ క్యాషియర్ కమ్ టైపిస్ట్ (సీసీటీ) అనే హోదాలో ఒకేస్థాయి నియామకాలు జరుపుతున్నారు. ఇప్పటి క్లరికల్ ఉద్యోగులు క్యాషియర్, టైపిస్ట్ విధులను కూడా ఆయా బ్రాంచ్‌ల అవసరాలకు అనుగుణంగా నిర్వర్తించాల్సి ఉంటుంది.
జీతాలకు ప్రామాణికం
ప్రభుత్వ రంగ, ప్రైవేటు రంగ బ్యాంక్ ఉద్యోగులందరికీ ఒకే విధమైన జీతాలుంటాయి. అయితే ఇతర సదుపాయాల విషయంలో ఎస్బీఐ గత మూడు దశాబ్దాలుగా తన ప్రత్యేకతను నిలుపుకుంటుంది. ప్రతి వేతన సవరణ సమయంలోనూ ఎస్బీఐ ఉద్యోగ సంఘాలు ప్రత్యేక సదుపాయాలు పొందే విషయంలో మిగిలిన వాటికంటే ముందుంటున్నాయి. ఉదాహరణకు ఉద్యోగుల పిల్లల చదువుకోసం స్కాలర్షిప్లను అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు మంజూరు చేస్తున్నాయి. ఎస్బీఐ, అనుబంధ బ్యాంకులు మరో అడుగు ముందుకేసి ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్, జిప్మర్ వంటి జాతీయస్థాయి సంస్థల్లో సీటు సంపాదించిన ఉద్యోగుల పిల్లలకు రూ.25వేలు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తోంది.బ్యాంకింగ్ రంగంలో ద్వైపాక్షిక ఒప్పందం ద్వారా జీతాలను నిర్ధారిస్తారు. ప్రస్తుతం అమల్లో ఉన్న వేతన ఒప్పందం కాల పరిమితి 2012 అక్టోబర్‌లో ముగిసింది. తర్వాతి ఒప్పందం 2012 నవంబర్ నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. చర్చలు ముగిస్తే ఇది కొలిక్కి వస్తుంది. ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలో చేరే అభ్యర్థులు అందరికీ కొత్త వేతన ఒప్పందం వర్తిస్తుంది. ఒప్పందానికి సంబంధించిన చర్చలు పూర్తయితే ఎరియర్స్ వస్తాయి.
దిగువ స్థాయి ఉద్యోగంలో చేరిన అభ్యర్థులు డిగ్రీ పూర్తిచేసి, అంతర్గత పోటీ పరీక్షలు రాయడం ద్వారా క్లర్కులుగా పదోన్నతి పొందొచ్చు. క్లర్కులుగా చేరిన వారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ నిర్వహించే జేఏఐఐబీ, సీఏఐఐబీ పరీక్షలు పూర్తిచేసి ఇతర పదోన్నతుల పరీక్షలు రాయడం ద్వారా ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు పొందొచ్చు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లరికల్ స్థాయిలో రిక్రూట్ అయి, చీఫ్ జనరల్ మేనేజర్ (బ్యాంకుల్లో రెండో అత్యున్నత స్థాయి) వరకు ఎదిగిన వారున్నారు. తొలుత బ్యాంకుల్లో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల్లో చేరిన వారు పదోన్నతుల ద్వారా జూనియర్ మేనేజ్మెంట్ స్థాయి నుంచి మిడిల్ మేనేజ్మెంట్, ఆపైన సీనియర్ మేనేజ్మెంట్ స్థాయికి చేరొచ్చు. దీని తర్వాత టాప్ ఎగ్జిక్యూటివ్ కేడర్లకు సంబంధించిన ఉద్యోగాలను కైవసం చేసుకోవచ్చు. ఒకటో స్కేల్ నుంచి ఏడో స్కేల్ వరకు పదోన్నతులు ఉంటాయి.
డెరైక్ట్ రిక్రూట్మెంట్
జూనియర్ స్థాయి నుంచి ప్రారంభించి కెరీర్లో ఎదిగేందుకు అనేక సంవత్సరాలు పడుతుంది. కొన్ని సందర్భాల్లో అత్యవసరంగా అనుభవం ఉన్న ఉద్యోగులు అవసరమైతే ఆయా బ్యాంకులు ఉన్నతస్థాయిలో డెరైక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో ఉద్యోగులను భర్తీ చేసుకుంటాయి.ఉదాహరణకు మహిళా బ్యాంక్‌కు అన్ని స్థాయిల్లోనూ ఉద్యోగులు అవసరమవడంతో తాత్కాలిక ప్రాతిపదికన కొందరు ఉద్యోగులను డిప్యుటేషన్‌పై పంపాలని కేంద్ర ప్రభుత్వం గతంలో అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను కోరింది. కొత్తగా ప్రారంభించబోయే ప్రైవేటు రంగ బ్యాంకులు ఇలా డిప్యుటేషన్ అడగలేవు కనుక అన్ని స్థాయిల్లోనూ ఉద్యోగులను భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది.
గతంలో ఒకసారి బ్యాంక్ ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ చేసి కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో చేరారు. అదే విధంగా త్వరలో రాబోయే ప్రైవేటు బ్యాంకుల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీకి ఇతర బ్యాంక్ ఉద్యోగులపైనే ఆధారపడాల్సి ఉంటుంది. త్వరగా ఉన్నత అవకాశాలను పొందాలనుకునే వారికి ఇలా కొత్తగా స్థాపించే బ్యాంకులు ఔత్సాహికులకు అనుభవానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి. ఈ విధంగా ఉన్నత స్థానాలు పొందాలనుకునేవారు కొన్ని రంగాలను ఎంపిక చేసుకొని వాటిలో ప్రావీణ్యత సంపాదించాలి. అడ్వాన్స్‌లు (ఇన్ బ్యాంకింగ్), ఫారిన్ ఎక్స్ఛేంజ్, కంప్యూటర్ ఆధారిత సేవలు నిత్యం అవసరమైనవి. సాధారణ నైపుణ్యాలతో పాటు వీటిలో ప్రావీణ్యం ఉన్న వారికోసం అన్ని బ్యాంకులు నిరీక్షిస్తుంటాయి. ఆయా రంగాల్లో పనిచేయడంతో పాటు ఐఐబీఎఫ్ నిర్వహించే పరీక్షలు పూర్తిచేయడం ద్వారా థియరిటికల్ పరిజ్ఞానం ఉందని కూడా నిరూపించుకోవచ్చు. వ్యవహార పరిజ్ఞానం చివరివిజయాన్ని అందిస్తుంది.