Coach factory in kazipet
-
'వందే భారత్' మేడిన్ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: భారతీయ రైల్వేలో త్వరలోనే రైల్ కోచ్.. మేడ్ ఇన్ తెలంగాణ అన్న అక్షరాలు కనిపించబోతున్నాయి. దశాబ్దాలుగా కలగానే మిగిలిన కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ మరికొన్ని నెలల్లో కార్యరూపం దాల్చబోతోంది. దేశవ్యాప్తంగా దూసుకుపోతున్న వందేభారత్ రైళ్లకు ఇక్కడి నుంచి హైస్పీడ్ బోగీలు సరఫరా కాబోతున్నాయి. ప్రస్తుతం వందేభారత్ రైళ్లకు డిమాండ్ పెరగటం, కేంద్రం కూడా భవిష్యత్తులో సాధారణ రైళ్ల స్థానంలో వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని భావిస్తుండటంతో కాజీపేటలో ఎక్కువగా వందేభారత్ రైల్ కోచ్‌లు తయారుచేయాలని నిర్ణయించింది. ఇందుకోసం చకచకా ఏర్పాట్లు చేస్తున్నది. ఫ్యాక్టరీ ఏర్పాటుకు బడ్జెట్ ను కూడా పెంచింది. వచ్చే ఏడాది మార్చి నుంచి ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంతో పనిచేస్తున్నది. రొబోటిక్ టెక్నాలజీ వినియోగం..: కాజీపేటలో ఏర్పాటుచేస్తున్న కోచ్ ఫ్యాక్టరీలో అత్యాధునిక రొబోటిక్ యంత్రాలు వాడాలని కేంద్రం నిర్ణయించింది. గతంలో మంజూరు చేసిన వ్యాగన్ తయారీ కేంద్రాన్ని కోచ్ ఫ్యాక్టరీగా మార్చిన నేపథ్యంలో ఆ మేరకు నిర్మాణాల డిజైన్లను మార్చింది. వందేభారత్ రైళ్ల బోగీల తయారీకి వీలుగా జపాన్‌కు చెందిన టైకిషా ఇంజినీరింగ్ సంస్థ నుంచి ఆధునిక రొబోటిక్ యంత్రాలను దిగుమతి చేసుకుంటోంది. ఇప్పటికే ఆ సంస్థకు ఆర్డర్ కూడా ఇచ్చింది. ఈ ఫ్యాక్టరీని రూ.521 కోట్లతో ఏర్పాటుచేస్తామని గతంలో కేంద్రప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఆధునిక యంత్రాలు కొనుగోలు చేస్తుండటంతో బడ్జెట్‌ను మరో రూ.150 కోట్ల మేర పెంచుతోంది. డిమాండ్‌కు అనుగుణంగా.. ఆలస్యానికి బ్రాండ్‌గా మారిన భారతీయ రైల్వేలను పరుగులు పెట్టించే పని మొదలుపెట్టిన కేంద్ర ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా క్రమంగా హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెడుతున్నది. వందేభారత్ రైళ్లు కూడా అందులో భాగమే. రైల్వేశాఖ సంప్రదాయ ఐసీఎఫ్ కోచ్‌ల వినియోగాన్ని కూడా ఆపేసి పూర్తిగా ఆధునిక ఎల్‌హెచ్‌బీ కోచ్‌లనే వినియోగించటం ప్రారంభించింది. క్రమంగా ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్ రైళ్లను కూడా తప్పించి వందేభారత్ రైళ్లనే తిప్పాలని నిర్ణయించింది. అన్ని కేటగిరీల్లో వాటినే వాడాలన్నది కేంద్రం యోచన. వందేభారత్ రైళ్లకు డిమాండ్ కూడా అమాంతం పెరిగింది. రైల్వేకు చెందిన ప్రధాన కోచ్ ఫ్యాక్టరీలైన చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్‌ఫ్యాక్టరీ (ఐసీఎఫ్), కపుర్తలాలోని రైల్ కోచ్‌ఫ్యాక్టరీ (ఆర్సీఎఫ్)లలో ప్రస్తుతం సింహభాగం కోచ్‌ల ఉత్పత్తి జరుగుతోంది. త్వరలో లాతూరులోని మరాటా్వడా రైల్ కోచ్ ఫ్యాక్టరీ (ఎంఆర్సీఎఫ్)లో ఉత్పత్తి మొదలు కాబోతోంది. వీటితోపాటు కొన్ని ప్రైవేట్ సంస్థలకు కూడా కోచ్‌ల కోసం రైల్వేశాఖ ఆర్డర్ ఇస్తోంది. భవిష్యత్తు డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి జరగాలన్న ఉద్దేశంతో ఇప్పుడు కాజీపేటలో కూడా అత్యాధునిక కోచ్‌ల తయారీని ప్రారంభిస్తున్నది. క్రమంగా ఉత్పత్తి పెంపు – పూర్తిస్థాయిలో నిర్మాణ వ్యవస్థ ఏర్పాటయ్యే వరకు కాజీపేటలో తక్కువ పరిమాణంలో అయినా ఉత్పత్తిని ప్రారంభించాలన్నది కేంద్రం యోచన. ఇందులో భాగంగా తొలుత నెలకు 10 ఎల్‌హెచ్‌బీ, వందేభారత్ కోచ్‌లు తయారు చేసేలా ఏర్పాట్లు చేస్తారు. – తదుపరి ఐదారు నెలల్లో నెలకు 20 చొప్పున కోచ్‌లు తయారు చేసేలా సిద్ధం చేస్తారు. ఆ తర్వాత డిమాండ్ ఆధారంగా సామరŠాధ్యన్ని మరింత పెంచుతారు. అందుకు తగ్గట్టు బడ్జెట్‌ను కేటాయిస్తారు. – యాద్గిర్లో తయారయ్యే చక్రాలను ఇక్కడికి పంపుతారు. మరో ప్రాంతంలో తయారైన విడి భాగాలను (కోచ్ దిగువ భాగం) ఇక్కడికి తీసుకొచ్చి పూర్తిస్థాయి బోగీగా రూపొందించి దానిపై షెల్ (కోచ్ బాడీ)ను బిగిస్తారు. – కోచ్‌లలో కావాల్సిన అమరికలను సిద్ధం చేసేందుకు కాంపోనెంట్ ఎరిక్షన్, ఫ్యాబ్రికేషన్ షెడ్లను నిర్మిస్తున్నారు. –తయారైన కోచ్‌లకు రంగులు వేయటం, వాటి పనితీరును తనిఖీ చేసేందుకు పెయింటింగ్ బూత్, టెస్ట్ షాప్‌లను ఏర్పాటుచేస్తున్నారు. – ఒక వందేభారత్ రైలు రేక్ తయారీకి రూ.125 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల రైలుకు రూ.80 కోట్లవుతుంది. ఐదు దశాబ్దాల కల కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు డిమాండ్ ఐదు దశాబ్దాలుగా ఉన్నది. 1982లో ఈ కోచ్ ఫ్యాక్టరీ మంజూరు అయింది. నాటి ప్రధాని ఇందిర హత్య, ఆ తర్వాత సిక్కులపై ఊచకోత.. కాంగ్రెస్‌పై సిక్కుల్లో ఆగ్రహం.. వారిని శాంతపరిచే చర్యల్లో భాగంగా ఇక్కడ ఏర్పాటువాల్సి కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్‌లోని కపుర్తలాకు తరలించారు. అప్పటి నుంచి ఫ్యాక్టరీ కోసం తెలంగాణలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. 2009లో మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు కాజీపేటకు రైలు చక్రాల తయారీ యూనిట్ మంజూరైంది. అది కూడా ఆ తర్వాత రద్దయ్యి, మోదీ ప్రభుత్వం వచ్చాక పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్‌గా మారింది. భూ సమస్య కారణంగా దాని ఏర్పాటు పనులు ఆలస్యంగా మొదలయ్యాయి. చివరకు గత ఏడాది ఫిబ్రవరిలో దాన్ని గూడ్సు రైలు వ్యాగన్ల తయారీ కేంద్రంగా అప్‌గ్రేడ్ చేశారు. ఇప్పుడు దాన్ని కోచ్‌ల తయారీ కేంద్రంగా మళ్లీ అప్‌గ్రేడ్ చేశారు. మరో 35 ఎకరాల భూ సేకరణకాజీపేట ఫ్యాక్టరీ ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం 160 ఎకరాల భూమిని మంజూరు చేసింది. అందులో 150 ఎకరాలు ఇప్పటికే రైల్వేకు అప్పగించింది. మిగతా భూమి త్వరలో అందజేయనుంది. మారిన డిజైన్ నేపథ్యంలో తాజాగా మరో 35 ఎకరాలు కూడా రైల్వే తీసుకోనున్నట్టు తెలిసింది. కాజీపేట స్టేషన్‌తో అనుసంధానిస్తూ కోచ్ తయారీ కేంద్రంలోకి ట్రాక్ ఏర్పాటు పనులు వేగంగా సాగుతున్నాయి. 390 మీటర్ల పొడవైన షెడ్లుకాజీపేట ఫ్యాక్టరీలో తొలుత వ్యాగన్లు తయారుచేయాలని నిర్ణయించినందున అందుకు తగ్గట్టుగానే డిజైన్లు రూపొందించారు. తాజాగా ఆ డిజైన్లలో 50 శాతం వరకు మార్చాల్సి వచ్చింది. ప్రస్తుతం 30 శాతం పనులు కూడా పూర్తయ్యాయి. 2026 మార్చి నాటికి పూర్తిగా యూనిట్ సిద్ధమై ఉత్పత్తి పనులు మొదలుపెట్టాలన్నది లక్ష్యం. ఇక్కడ భారీ షెల్ అసెంబ్లింగ్ షెడ్ నిర్మిస్తున్నారు. ఇందులో కోచ్‌ల బాడీలు సిద్ధమవుతాయి. వందే భారత్ రైలు దాదాపు 390 మీటర్ల పొడవుంటుంది. దానికి సరిపడే రీతిలో దీన్ని నిర్మిస్తున్నారు. 600 మంది ఉద్యోగులుకాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో వివిధ విభాగాల్లో ప్రత్యక్ష్యంగా 600 మంది ఉద్యోగులు పనిచేస్తారు. పరోక్షంగా 8 వేల నుంచి పది వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వాలు చెప్తున్నాయి. వేగంగా కోచ్‌లను సిద్ధం చేయాల్సిన నేపథ్యంలో ఇది అసెంబ్లింగ్ యూనిట్‌గా ఏర్పాటవుతోంది. కోచ్‌ల తయారీకి కావాల్సిన ముడి సరుకు పనులను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారు. దీంతో ఈ ఫ్యాక్టరీకి అనుబంధంగా స్థానికంగా ప్రైవేటు సంస్థలు లాభపడతాయి. వాటిల్లో పనిచేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు రాబోతున్నారు. -
పెండింగ్ ప్రాజెక్టుల కోసం పట్టు
* రైల్వే బడ్జెట్‌కోసం పాత విజ్ఞప్తులతోనే ప్రతిపాదనలు పంపిన తెలంగాణ ప్రభుత్వం * కాజీపేటలో కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటుకు మళ్లీ వినతి * వ్యాగన్‌వీల్ ఫ్యాక్టరీకి నిధులు.. * కాజీపేటకు డివిజన్ హోదాకు మరోసారి ప్రయత్నం సాక్షి, హైదరాబాద్: రైల్వేలో సంస్కరణల దిశగా కేంద్రం అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈసారి రైల్వే బడ్జెట్లో కొత్త ప్రాజెక్టులకు అవకాశం ఉండదని గట్టిగా నమ్ముతున్న రాష్ట్ర ప్రభుత్వం పాత ప్రతిపాదనలపైనే పట్టుబట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మూడు రోజుల క్రితం ైరె ల్వేశాఖకు అధికారికంగా ప్రతిపాదనలు పంపిన ప్రభుత్వం వ్యూహాత్మకంగానే వాటిని పాతవాటితో నింపేసింది. జనవరిలో హైదరాబాద్ వచ్చిన సందర్భంగా రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు, ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య జరిగిన మర్యాదపూర్వక సమావేశంలో రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టుల అంశం చర్చకొచ్చింది. కొత్త రాష్ట్రం గా అవతరించడంతోపాటు దశాబ్దాలుగా ఈ ప్రాంతానికి సరైన ప్రాధాన్యం దక్కలేదనే విషయాన్ని సురేశ్‌ప్రభుకు కేసీఆర్ తెలియజేస్తూ రైల్వే బడ్జెట్లో తమ పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కల్పించి రాష్ట్రానికి న్యాయం చేయాలని గట్టిగా కోరారు. ముఖ్యంగా కాజీపేటలో కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటు అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర విభజన సమయంలో నాటి యూపీఏ-2 ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టును ప్రస్తావించినందువల్ల ఈసారైనా కోచ్‌ఫ్యాక్టరీని మంజూరు చేయాలని కోరారు. అయితే ఈ ప్రతిపాదన సరికాదని నిపుణుల కమిటీ తేల్చినట్లు పేర్కొన్న సురేశ్‌ప్రభు...కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటుపై హామీ ఇవ్వలేదు. అయినప్పటికీ ఈ విషయంలో ఒత్తిడి పెంచాలని నిర్ణయించిన సీఎం కె.చంద్రశేఖర్ రావు తాజా ప్రతిపాదనల్లో మొదటగా దాన్నే ప్రస్తావించారు. దీంతోపాటు ఐదేళ్ల క్రితం మంజూరైన వ్యాగన్ వీల్ ఫ్యాక్టరీకి ఈసారి నిధులు కేటాయించాలని, కాజీపేటకు డివిజన్ హోదా ప్రకటించాలని పేర్కొన్నారు. ఆర్యూబీ/ఆర్ఓబీ ప్రతిపాదనలు లెవల్ క్రాసింగ్స్‌ను తొలగించే క్రమంలో కొత్త గా 15 చోట్ల ఆర్ఓబీ/ఆర్‌యూబీలు నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అవి ఎక్కడంటే... కరీంనగర్ జిల్లాలోని ఉప్పల్-జమ్మికుంట స్టేషన్ల మధ్య, జమ్మికుంట-బిసుగిర్ షరీఫ్ మధ్య, కొలనూర్-పెద్దపల్లి, మహబూబ్‌నగర్-ఎంక్యూఎన్, మెదక్ జిల్లా జహీరాబాద్- మెట్లకుంట, నల్లగొండ జిల్లా ఆలేరు-పెంబర్తి మధ్య, వరంగల్ జిల్లా కాజీపేట-హసన్‌పర్తి, కాజీపేట-వరంగల్, వరంగల్-చింతలపల్లి, చింతలపల్లి-ఎల్గూర్, మహబూబాబాద్ యార్డు, గార్ల-డోర్నకల్, నష్కల్-పెండ్యాల మధ్య, నిజామాబాద్‌లో యూపీడబ్ల్యూ-కేఎంసీ, ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం- గంగినేని మధ్య వీటిని నిర్మించాలని కోరింది. మరికొన్ని ప్రతిపాదనలు - పెద్దపల్లి- నిజామాబాద్ బ్రాడ్‌గేజ్ లైన్ (178.39 కి.మీ.): తుది దశగా ఉన్న పెద్దపల్లి-జగిత్యాల (81 కి.మీ.) పెండింగ్ పనులను పూర్తిచేయాలి. - మనోహరాబాద్-కొత్తపల్లి (153.6 కి.మీ.): ఐదేళ్ల యాన్యుటీ పద్ధతిలో రూ. 367.05 చెల్లించేందుకు ఆమోదం తెలిపినందున ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలి. (దీని అంచనా వ్యయం రూ. 952 కోట్లు. రైల్వే భరించాల్సిన వాటా రూ. 579.73 కోట్లు) - అక్కన్నపేట-మెదక్ (17.16 కి.మీ.): రూ.117.74 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టులో 50 శాతం ఖర్చు భరించటమే కాకుండా స్థలాన్ని ఉచితంగా ఇచ్చేందుకు అంగీకరించినందున బడ్జెట్లో నిధులు కేటాయించాలి.(ఇప్పటికే రూ.35.26 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది) - భద్రాచలం రోడ్డు-సత్తుపల్లి (56.25 కి.మీ.): 2010-11లో ఖరారైన ఈ ప్రతిపాదనకు నిధులు కేటాయించాలి. - మంచిర్యాల-పెద్దంపేట ట్రిప్లింగ్: లైన్ పనులు కొనసాగుతున్నా గోదావరిపై వంతెన పనులకు నిధులు కేటాయించాలి. - కాజీపేట-విజయవాడ, రాఘవాపురం-మందమర్రి మూడో లైన్ పని వేగం పెంచాలి. - మణుగూరు-రామగుండం (200 కి.మీ.) కొత్త లైన్ సర్వే పనులు పూర్తి చేసి పనులు మొదలుపెట్టాలి. - హైదరాబాద్-మహబూబ్‌నగర్, సికింద్రాబాద్-జహీరాబాద్, పగిడిపల్లి-శంకర్పల్లి డబ్లింగ్ పనులకు నిధులు కేటాయించాలి. - గద్వాల-మాచర్ల, పాండురంగాపురం-భద్రాచలం లైన్లకు మోక్షం కల్పించాలి. ళీ వరంగల్‌లో రైల్వే విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి.