అవన్నీ పుకార్లే!
బర్మింగ్‌హామ్: భారత క్రికెట్లో సంచలనంగా మారిన కెప్టెన్ కోహ్లి, కోచ్ కుంబ్లే మధ్య వివాదాన్ని బీసీసీఐ మాత్రం తేలిగ్గా తీసుకుంది. బోర్డు సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి దీనిపై స్పందిస్తూ ‘అవన్నీ పెద్ద పుకార్లు’ అంటూ కొట్టిపారేశారు. తనకు అసలు ఈ విషయం గురించి ఎలాంటి సమాచారం లేదని ఆయన అన్నారు. ‘ఇద్దరికీ పడటం లేదంటూ వచ్చిన కథనాలన్నీ ఊహాజనితం. ఏదేదో ఊహించుకొని రాయడం తప్ప వాటికి ఎలాంటి విలువ లేదు. నిప్పు లేదని పొగ రాదని కొందరంటున్నారు. కానీ అసలు పొగే లేదని నేను నమ్ముతున్నాను’ అని చౌదరి వ్యాఖ్యానించారు.
కోచ్ ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానించడంలో తప్పు లేదని ఆయన సమర్థించుకున్నారు. ‘దీనిపై ఇప్పటికే స్పష్టతనిచ్చాం. కోచ్ ఎంపిక అనేది ఒక ప్రక్రియ. అంతా పారదర్శకంగా, సరిగ్గా జరిగేందుకు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాం. కాబట్టి అప్లికేషన్లు కోరడంలో సమస్య లేదు’ అని అమితాబ్ చెప్పారు. భారత్ వరుసగా సిరీస్‌లు ఆడుతుండటం వల్ల విరామం లభించడం లేదని, అందుకే ఒక వైపు చాంపియన్స్ ట్రోఫీ జరుగుతుండగానే కోచ్ కోసం ప్రకటన ఇవ్వాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. మరోవైపు గురువారం ఎడ్జ్‌బాస్టన్ మైదానం లో సాధన చేసిన భారత్ తమకు కల్పించిన ప్రాక్టీస్ సౌకర్యాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.