Coal bill
-
బొగ్గు బిల్లుకు లోక్‌సభ ఓకే
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య బొగ్గు గనుల(ప్రత్యేక నిబంధనల) బిల్లు- 2015కు బుధవారం లోక్‌సభ ఆమోదం లభించింది. గతంలో జరిగిన బొగ్గు బ్లాకుల కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో ఈ రంగంలో అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కొత్త బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. ఇప్పటికే కేంద్రం జారీ చేసిన రెండు ఆర్డినెన్స్‌ల స్థానంలో తాజాగా బిల్లును ప్రవేశపెట్టింది.దీనిపై లోక్‌సభలో చర్చ సందర్భంగా బొగ్గు, విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. బొగ్గు బ్లాకుల వేలంలో పారదర్శకత కోసమే ఈ బిల్లును తీసుకొచ్చినట్లు తెలిపారు. దీనికి ఆమోదం లభించకపోతే బొగ్గు రంగంలో సంక్షోభం తలెత్తుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యుత్ కేంద్రాలకు తీవ్ర బొగ్గు కొర త తలెత్తిందని పేర్కొన్నారు. బొగ్గు వినియోగంలో అక్రమాలకు తావులేకుండా కఠిన నిబంధనలను బిల్లులో పొందుపరిచినట్లు మంత్రి వివరించారు. ఈ బిల్లుకు ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలను మూజువాణి ఓటుతో తిరస్కరించి బిల్లుకు స్పీకర్ ఆమోదం తెలిపారు. లెఫ్ట్ సహా ఇతర పక్షాలు డివిజన్ ఓటింగ్‌కు పట్టుబట్టినా ఫలితం లేకుండాపోయింది. పౌరస్మృతి సవరణ బిల్లుకు రాజ్యసభ ఓకే పౌరస్మృతి చట్టంలో సవరణలు చేస్తూ తీసుకొచ్చిన మరో బిల్లును రాజ్యసభ ఆమోదించింది. భారతీయ మూలాలున్న వ్యక్తులు(పీఐవో), విదేశాల్లోని భారతీయ పౌరులు(ఓసీఐ) కార్డులకు మధ్య ఉన్న భేదాలను తొలగించే ఉద్దేశించే ఈ సవరణ బిల్లును కేంద్రం రెండు రోజు ల క్రితమే లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అక్కడ ఆమోదం పొందిన తర్వాత తాజాగా రాజ్యసభ ముందుకువచ్చింది. మూజువాణి ఓటుతో ఎగువ సభ ఆమోదం కూడా లభించింది. దీనికి సంబంధించి కూడా గతంలో ఆర్డినెన్స్ జారీ అయింది. పీఐవో, ఓసీఐ కార్డులను కలిపేసి ఒకే కార్డు జారీ చేస్తామని అమెరికా, ఆస్ట్రేలియా పర్యటనల్లో ప్రధాని మోదీ అక్కడి భారతీయ సంతతికి హామీ ఇచ్చిన సంగతి తెలిసిం దే. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు ఇదే విషయాన్ని రాజ్యసభకు తెలియజేశారు. ఈ బిల్లు ప్రకారం విదేశాల్లోని భారతీయుల మునిమనవలను కూడా భారత ప్రభుత్వం గుర్తించే అవకాశముంటుందని తెలిపారు. బీమాలో ఎఫ్‌డీఐల పెంపు బిల్లుకూ ఆమోదం బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని ప్రస్తుతమున్న 26 శాతం నుంచి 49 శాతానికి పెంచుతూ ప్రవేశపెట్టిన సవరణ బిల్లును కూడా లోక్‌సభ ఆమోదించింది. అయితే రాజ్యసభలో దీని ఆమోదం పొందడమే కేంద్రానికి సవాల్‌గా నిలిచింది. ఎగువసభలో ప్రభుత్వానికి మెజారిటీ లేకపోవడంతో విపక్షాలదే పైచేయిగా నిలిచే అవకాశముంది. అయితే రాజ్యసభలో బీమా బిల్లు ఆమోదం పొందకపోతే ఉభయసభల సంయుక్త సమావేశాన్ని నిర్వహిస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
పార్లమెంటులో ‘బొగ్గు’ బిల్లు
ఆర్డినెన్సు స్థానంలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం సాక్షి, న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో సంస్కరణలకు ఉద్దేశించిన రెండు బిల్లులను ప్రభుత్వం ఈ వారం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. 214 బొగ్గు క్షేత్రాల కేటాయింపును సుప్రీం కోర్టు రద్దు చేసిన నేపథ్యంలో తీసుకువచ్చిన ఆర్డినెన్సుల స్థానంలో వీటిని ప్రవేశపెడ్తున్నారు. బొగ్గు వెలికితీత, అమ్మకాల్లో ప్రైవేటు సంస్థలను అనుమతించే ఆ ఆర్డినెన్సును కార్మిక సంఘాలు వ్యతిరేకించాయి. టెక్స్టైల్స్ అండర్‌టేకింగ్స్ ఆర్డినెన్స్‌కు ప్రత్యామ్నాయ బిల్లును సోమవారమే సభలో ప్రవేశపెట్టనున్నారు. వాణిజ్య నౌకల నిర్వహణకు సంబంధించిన రెండు మర్చంట్ షిప్పింగ్ సవరణ బిల్లులను, తమిళనాడు, అస్సాంలలో శాసనమండలులకు సంబంధించిన రెండు బిల్లులను, కాలం చెల్లిన చట్టాల రద్దుకు ఉద్దేశించిన రెండు బిల్లులను, స్కూల్ ఆఫ్ ప్లానింగ్, ఆర్కిటెక్చర్ బిల్లులనూ సభ ముందుంచనున్నారు. లోక్‌సభ ఆమోదించిన హైజాకింగ్ వ్యతిరేక బిల్లు , ట్రిపుల్ఐటీ, కాన్సిట్యూషన్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ సవరణ బిల్లులను రాజ్యసభ ఆమోదానికి పంపనున్నారు. తాజా సమావేశాల తొలివారంలోనే లోక్‌సభలో ఐదు, రాజ్యసభలో రెండు బిల్లులను ఆమోదించారు. లోక్‌సభలో ఢిల్లీ పోలీస్ స్పెషల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్(సవరణబిల్లు)ను, సెంట్రల్ వర్సిటీల సవరణ బిల్లు, ఐఐఐటీ బిల్లు, షెడ్యూల్ కులాల ఆర్డర్ల సవరణ బిల్లులు ఆమోదం పొందాయి. రాజ్యసభ కార్మిక చట్టాల సవరణ, అప్రెటిసెస్ యాక్ట్, ఢిల్లీ స్పెషల్ పోలీస్ సవరణబిల్లులను ఆమోదం తెలిపింది.