బొగ్గు బిల్లుకు లోక్‌సభ ఓకే
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య బొగ్గు గనుల(ప్రత్యేక నిబంధనల) బిల్లు- 2015కు బుధవారం లోక్‌సభ ఆమోదం లభించింది. గతంలో జరిగిన బొగ్గు బ్లాకుల కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో ఈ రంగంలో అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కొత్త బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. ఇప్పటికే కేంద్రం జారీ చేసిన రెండు ఆర్డినెన్స్‌ల స్థానంలో తాజాగా బిల్లును ప్రవేశపెట్టింది.దీనిపై లోక్‌సభలో చర్చ సందర్భంగా బొగ్గు, విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. బొగ్గు బ్లాకుల వేలంలో పారదర్శకత కోసమే ఈ బిల్లును తీసుకొచ్చినట్లు తెలిపారు.
దీనికి ఆమోదం లభించకపోతే బొగ్గు రంగంలో సంక్షోభం తలెత్తుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యుత్ కేంద్రాలకు తీవ్ర బొగ్గు కొర త తలెత్తిందని పేర్కొన్నారు. బొగ్గు వినియోగంలో అక్రమాలకు తావులేకుండా కఠిన నిబంధనలను బిల్లులో పొందుపరిచినట్లు మంత్రి వివరించారు. ఈ బిల్లుకు ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలను మూజువాణి ఓటుతో తిరస్కరించి బిల్లుకు స్పీకర్ ఆమోదం తెలిపారు. లెఫ్ట్ సహా ఇతర పక్షాలు డివిజన్ ఓటింగ్‌కు పట్టుబట్టినా ఫలితం లేకుండాపోయింది.
పౌరస్మృతి సవరణ బిల్లుకు రాజ్యసభ ఓకే
పౌరస్మృతి చట్టంలో సవరణలు చేస్తూ తీసుకొచ్చిన మరో బిల్లును రాజ్యసభ ఆమోదించింది. భారతీయ మూలాలున్న వ్యక్తులు(పీఐవో), విదేశాల్లోని భారతీయ పౌరులు(ఓసీఐ) కార్డులకు మధ్య ఉన్న భేదాలను తొలగించే ఉద్దేశించే ఈ సవరణ బిల్లును కేంద్రం రెండు రోజు ల క్రితమే లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అక్కడ ఆమోదం పొందిన తర్వాత తాజాగా రాజ్యసభ ముందుకువచ్చింది. మూజువాణి ఓటుతో ఎగువ సభ ఆమోదం కూడా లభించింది. దీనికి సంబంధించి కూడా గతంలో ఆర్డినెన్స్ జారీ అయింది. పీఐవో, ఓసీఐ కార్డులను కలిపేసి ఒకే కార్డు జారీ చేస్తామని అమెరికా, ఆస్ట్రేలియా పర్యటనల్లో ప్రధాని మోదీ అక్కడి భారతీయ సంతతికి హామీ ఇచ్చిన సంగతి తెలిసిం దే. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు ఇదే విషయాన్ని రాజ్యసభకు తెలియజేశారు. ఈ బిల్లు ప్రకారం విదేశాల్లోని భారతీయుల మునిమనవలను కూడా భారత ప్రభుత్వం గుర్తించే అవకాశముంటుందని తెలిపారు.
బీమాలో ఎఫ్‌డీఐల పెంపు బిల్లుకూ ఆమోదం
బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని ప్రస్తుతమున్న 26 శాతం నుంచి 49 శాతానికి పెంచుతూ ప్రవేశపెట్టిన సవరణ బిల్లును కూడా లోక్‌సభ ఆమోదించింది. అయితే రాజ్యసభలో దీని ఆమోదం పొందడమే కేంద్రానికి సవాల్‌గా నిలిచింది. ఎగువసభలో ప్రభుత్వానికి మెజారిటీ లేకపోవడంతో విపక్షాలదే పైచేయిగా నిలిచే అవకాశముంది. అయితే రాజ్యసభలో బీమా బిల్లు ఆమోదం పొందకపోతే ఉభయసభల సంయుక్త సమావేశాన్ని నిర్వహిస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.