పెన్షన్‌లోకి 26 ఎఫ్‌డీఐలు | Lok Sabha approves pension bill, paves way for 26% FDI | Sakshi
Sakshi News home page

పెన్షన్‌లోకి 26 ఎఫ్‌డీఐలు

Published Thu, Sep 5 2013 7:05 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM

పెన్షన్‌లోకి 26 ఎఫ్‌డీఐలు - Sakshi

పెన్షన్‌లోకి 26 ఎఫ్‌డీఐలు

సాక్షి, న్యూఢిల్లీ: సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పింఛన్ నిధి బిల్లు ఎట్టకేలకు బుధవారం లోక్‌సభ ఆమోదం పొందింది. చందాదారులు కనీస రిటర్నులు పొందడానికి ఈ ‘పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ, డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) బిల్లు-2011’ భరోసానిస్తుంది. ‘ఆదాయంతోపాటు సేవింగ్స్’ అనే సూత్రం ఆధారంగా ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించిందని ఆర్థిక మంత్రి చిదంబరం చెప్పారు. పెన్షన్ ఫండ్‌ను ఈక్విటీ మార్కెట్‌లో పెట్టుబడిగా పెట్టేందుకు, ఈ రంగంలో 26 శాతం ఎఫ్‌డీఐలను (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను) అనుమతించేందుకు ఈ బిల్లు దోహదం చేస్తుంది. రెండు రోజులుగా చర్చకు నోచుకోని ఈ కీలక సంస్కరణల బిల్లు... ప్రధాన విపక్షం బీజేపీ అండగా నిలబడటంతో సులువుగా లోక్‌సభ ఆమోదం పొందింది. విపక్షాలు సూచించిన సవరణలు తిరస్కరణకు గురికాగా, బిల్లుకు అనుకూలంగా 174 మంది, వ్యతిరేకంగా 33 మంది ఓటేశారు. సామాజిక భద్రత కోసం పెట్టిన ఈ నిధులను డోలాయమానంగా ఉండే స్టాక్‌మార్కెట్‌లో పెట్టడం వల్ల ఉద్యోగులు నష్టపోతారంటూ బిల్లు ను తృణమూల్, డీఎంకే, అన్నాడీఎంకే, వామపక్షాలు వ్యతిరేకించాయి.
 
 దేశంలో పింఛన్ రంగాన్ని నియంత్రించేందుకు, మరింత అభివృద్ధిపరిచేందుకు ఈ బిల్లు దోహదపడుతుంది. 52.83 లక్షల మంది చందాదారులున్న (26 రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులతో కలిపి) ఎన్‌పీఎస్‌లో రూ.35 వేల కోట్లున్న కార్పస్ ఫండ్‌ను మంచి ఆదాయం వచ్చే చోట్ల పెట్టుబడులుగా పెట్టి, వాటిని సక్రమంగా నిర్వహించేందుకు పీఎఫ్‌ఆర్డీఏకు చట్టబద్ధత కల్పించినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ ఫండ్‌ను చట్టబద్ధం కాని సంస్థలు వినియోగించకుండా నిరోధిస్తుంది. అంతేగాక పింఛన్ రంగంలో 26 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించేందుకు వీలవుతుంది. 2004 జనవరి 1 నుంచి కేంద్ర ఉద్యోగులు (సాయుధ బలగాలు తప్ప) ఎన్‌పీఎస్‌లో కచ్చితంగా చేరాలని నిబంధన విధించారు. తర్వాత దేశంలో ఎవరైనా స్వచ్ఛందంగా ఎన్‌పీఎస్‌లో చేరేందుకు 2009 మేలో అవకాశం కల్పించారు. పీఎఫ్‌ఆర్డీఏ 2003 ఆగస్టులో ఏర్పాటుకాగా, దీనికి సంబంధించిన బిల్లును 2005, 2011లలో రెండుసార్లు స్థాయీ సంఘానికి పంపారు.
 
 బిల్లుపై చర్చ సందర్భంగా చిదంబరం మాట్లాడుతూ, మార్కెట్ ఆధారిత రిటర్నులు పొందడంతోపాటు ప్రభుత్వ బాండ్లు, పలు ఇతర పెట్టుబడి మార్గాల్లో నిధులను పెట్టేందుకు అవకాశముంటుందన్నారు. అంతేగాకుండా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో డబ్బును వాపసు తీసుకునేందుకూ, కొత్త పెన్షన్ పథకం (ఎన్‌పీఎస్)లో సభ్యులుగా చేరేవారు ఇన్సెంటివ్ పొందవచ్చన్నారు. స్థాయీ సంఘం చేసిన చాలా సిఫార్సులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. ఎన్‌పీఎస్ వల్ల ఉద్యోగులకు దీర్ఘకాలంలో చాలా ప్రయోజనాలుం టాయని, ముఖ్యంగా రిటైర్మెంట్ సమయంలో రెగ్యులర్ ఆదాయం పొందేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఇప్పటిదాకా చట్టబద్ధత లేని పీఎఫ్‌ఆర్డీఏకు ఈ బిల్లు ద్వారా చట్టబద్ధత వస్తుందని చెప్పారు. జరిమానాలు విధించే అధికారం కూడా ఈ అథారిటీకి ఉంటుందన్నారు.  కష్టార్జితంలోకి ఎఫ్‌డీఐలా?: విపక్షాల మండిపాటు ఉద్యోగులకు రిటర్నులపై ఎలాంటి భరోసా ఇవ్వదని సమాజ్‌వాదీ సభ్యుడు శైలేంద్ర కుమార్ అన్నారు. ప్రజల కష్టార్జితాన్ని ప్రైవేట్ సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టడంపై, అందులోకి ఎఫ్‌డీఐలను అనుమతించడంపై డీఎంకే ఆక్షేపించింది. లక్షలాది మంది జీవితాలకు సంబంధించిన బిల్లును సమగ్ర చర్చలేకుండా హడావిడిగా ఆమోదించవద్దని తృణమూల్ కోరింది. 

పెన్షన్ బిల్లులో స్థాయీ సంఘం చేసిన ముఖ్య సిఫారసులు

  •      కనీస రిటర్నులు వచ్చే స్కీములో తమ ఇష్టప్రకారం నిధులను పెట్టుబడి పెట్టేందుకు చందాదారులను అనుమతించాలి
  •      వ్యక్తిగత పెన్షన్ ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రాకు సంబంధించి కొన్ని షరతులతో అనుమతించాలి. ఉద్దేశం, ఎంత తరచుగా తీసుకుంటున్నారు? పరిమితి వంటివాటిని నిబంధనల ప్రకారం పరిశీలించాలి
  •      పెన్షన్ ఫండ్ నిర్వహించే సంస్థలలో ప్రభుత్వ సంస్థ కనీసం ఒక్కటైనా ఉండాలి
  •      పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ(పీఎఫ్‌ఆర్‌డీఏ)కి చట్టబద్ధ హోదా కట్టబెట్టాలి
  •      పీఎఫ్‌ఆర్‌డీఏ యాక్ట్ ప్రకారం.. నిబంధనలను రూపొందించేందుకుగాను పీఎఫ్‌ఆర్‌డీఏకు సూచనలు ఇచ్చేందుకు పెన్షన్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటుచేయాలి. ఇందులో పెన్షన్ నిర్వహణ సంస్థలన్నింటికీ ప్రాతినిధ్యం ఉండాలి
  •      టైర్-1 పెన్షన్ ఖాతా నుంచి పరిమిత ఉద్దేశాల కోసం నిధులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది కొత్త పెన్షన్ పథకం (ఎన్‌పీఎస్)లో చేరేందుకు ప్రోత్సాహకంగా ఉంటుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement